come down
-
బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్
ముంబై: బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు/వసూలు కానీ మొండి బాకీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం మేర తగ్గి 5 శాతానికి పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు 2024 మార్చి నాటికి 4 శాతానికి క్షీణిస్తాయని పేర్కొంది. అయినా కానీ, బ్యాంకింగ్ రంగం ముందు ఇతర విభాగాల నుంచి సవాళ్లు ఉన్నట్టు ప్రస్తావించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల రుణ విభాగంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువగా రుణ వితరణ చేయడంతో, ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 10-11 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 9.3 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో రుణాల పునరుద్ధరణ 6 శాతంగా ఉంటే, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల పునరుద్ధరణ 2 శాతమే ఉన్నట్టు గుర్తు చేసింది. 6 శాతం పునరుద్ధరణ రుణాల్లో పావు వంతు ఎన్పీఏలుగా మారొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రుణ విభాగాల పరంగా ఎంఎస్ఎంఈల కంటే పెద్ద కంపెనీల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. (ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!) కార్పొరేట్ విభాగం మెరుగు పెద్ద కార్పొరేట్ విభాగంలో రుణాల పరంగా స్థూల ఎన్పీఏలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి 2 శాతానికి తగ్గుతాయని క్రిసిల్ పేర్కొంది. 2018 నాటికి ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాల్లో కార్పొరేట్ రుణాలకు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టడమే మెరుగుదలకు కారణంగా పేర్కొంది. -
దిగొస్తున్న పుత్తడి ధర
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం ధరలు గరిష్ట స్థాయిలనుంచి దిగి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా క్షీణించాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు పుంజుకోవడం కూడా బంగారం ధరల బలహీనతకు కారణమని తెలిపారు. బుధవారం బంగారం 10 గ్రాములకి రూ .128 తగ్గి 41,148 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ బంగారం రూ .128 తగ్గిందని మంగళవారం 10 గ్రాముల ధర రూ .41,276 వద్ద ముగిసింది. వెండి ధర కూడా మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే దిగి వచ్చింది. వెండి రూ .47,060 నుంచి కిలో ధర రూ .700 తగ్గి 46,360 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ఔన్స్ ధర వరుసగా 1,562.5 డాలర్లు, 17.51 డాలర్లుగా ట్రేడవుతున్నాయి. ఇటీవల కోవిడ్-2019 రేపిన ప్రకంపనలో ప్రధానంగా చమురు ధరలు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. -
స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా పెట్రోలు ధరలు దిగి వచ్చాయి. ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించడంతో వివిధ మెట్రో నగరాల్లో శనివారం పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. తాజా తగ్గింపుతో వివిధ నగరాల్లో లీటరు ఇంధన ధరలు హైదరాబాద్ : పెట్రోలు 75.33 డీజిల్ ధర 71.74 విజయవాడ : పెట్రోలు రూ. 74.75, డీజిల్ ధర రూ. 70.79 ఢిల్లీ : పెట్రోలు రూ. 71. డీజిల్ రూ. 65.96 చెన్నై: పెట్రోలు రూ. 73.72 డీజిల్ రూ.69.72 కోలకతా : పెట్రోలు రూ. 73.71 , డీజిల్ రూ. 67.71 ముంబై: పెట్రోలు రూ. 76.64 డీజిల్ రూ. 69.11 -
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి
న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రానికి 75%కి పైగా వాటా ఉండటం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25% ఉండాలి. ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ఇప్పటికే క్యూఐపీ ద్వారా రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53% నుంచి తగ్గుతుంది. సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
నాల్గవరోజూ తగ్గిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 17పైసలను సంస్థలు తగ్గించాయి. దీంతో సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 81.74 ఉండగా, డీజిల్ ధర రూ.75.19 గా ఉంది. వరుసగా నాలుగురోజులపాటు చమురు ధరలను తగ్గించడంతో మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.1.09, డీజిల్‌పై 50 పైసలు తగ్గింది. -
మన హెచ్1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: హెచ్ 1బి వీసాల అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. వివాదాస్పద వీసా సమస్యలపై భారతీయ టెక్ నిపుణులు, ఐటీ పరిశ్రమను భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది తప్ప, భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ్య తగ్గదని తెలిపారు. ఇప్పటివరకు మనకు లభిస్తున్న హెచ్ 1 బీ వీసాలు మనకు దక్కుతాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాలకాలంలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై పుస్తకాన్ని సీతారామన్ శనివారం ఆవిష్కరించారు. అనతరం విలేఖరులతో మాట్లాడుతూ వీసాలపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటి పరిశ్రమను కోరారు. హెచ్ 1 బీ వీసాల జారీకి లాటరీ ప్రక్రియలో మార్పులు తేవాలని అమెరికా ప్రయత్నిస్తోందని తాను భావిస్తున్నానన్నారు. అంతే తప్పఇండియన్ టెకీలకు జారీ చేసి వీసాల సంఖ్య తగ్గదన్నారు. వీసా ఆందోళనలు అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉన్నపుడు కూడా ఉన్నాయన్నారు. అయితే వీసా జారీ ప్రక్రియలో మాత్రమే ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్దర్ మార్పు తీసుకొచ్చిందన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికా సహా వివిధ అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్యోగులను విదేశీ ఉద్యోగులకు కాకుండా స్థానికులకు దక్కేలా రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాల జారీలో లాటరీ పద్దతికి స్వస్తి పలికి మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ పాలసీతో భర్తీ చేయాలని కోరుతోందని ఆమె చెప్పారు. అలాగే అమెరికా వీసాల్లో కేవలం 17 శాతం మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్తున్నాయనీ, భారతీయ కంపెనీలు అందిస్తున్న సేవల ద్వారా అనేక అమెరికా కంపెనీలు లబ్ది పొందుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హెచ్ 1బీ వీసాల జారీ రివ్యూపై భారత ఆందోళనలను అమెరికాకు ఇప్పటికే వ్యక్తం చేసినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాల నేపథ్యంలో వీటిని తిరిగి సమీక్షిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలను తయారు చేయడానికి అధిక నైపుణ్యం అవసరమైన చోట ఫస్ట్ గ్రాడ్యుయేట్లను కాకుండా కచ్చితంగా నిపుణులకోసం అమెరికా చూస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.