శాశ్వత పరిష్కారం కావాలి
చిత్రాల విడుదల సమయాల్లో సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాతలు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. చిత్ర నిర్మాణం పూర్తి అయిన విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో చిత్ర కథ తనదనో, లేక చిత్ర విడుదలపై నిషేధం విధించాలనో రకరకాల కోర్టులు, కేసులు అంటూ ఆటంకాలు కలిగిస్తున్నారు. అలా కోర్టుల కెళ్లే వారిని చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చును కోర్టులో డిపాజిట్ చేసి పిటిషన్ దాఖలు చేయమనాలి. కోర్టు తీర్పు వారి కనుకూలంగా వస్తే డిపాజిట్ చేసిన డబ్బును తిరిగి తీసుకోవచ్చు.
ఈ విధానం అమలయ్యేలా సినీ సంఘాల ప్రముఖులు హైకోర్టు న్యాయమూర్తితో చర్చించి ఆయన ఆలోచనలను తీసుకోవాలని నిర్మాత, పూర్వ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కేఆర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక తేనాంపేటలో గల కామరాజర్ హాలులో జరిగిన మాంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేఆర్ పై విధంగా పేర్కొన్నారు. హాస్యనటుడు ప్రేమ్జీ హీరోగా నటించిన చిత్రం మాంగా. అద్వైత, రిమా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ సోన్మూవీస్ పతాకంపై పీసీకే శక్తివేల్ నిర్మిస్తున్నారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్ఎస్రాజా నిర్వహిస్తున్నారు. ప్రేమ్జీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను కేఆర్ ఆవిష్కరించారు. గంగైఅమరన్, దర్శకుడు వి.శేఖర్, వెంకట్ ప్రభు, గీత రచయిత స్నేహన్, శక్తి చిదంబరం అతిథులుగా పాల్గొన్నారు.