‘‘నన్ను ఆంటీ అంటావా! మరోసారి ఆంటీ అంటే మర్యాద దక్కదు’’ అంటూ నయనతార హాస్యనటుడు ప్రేమ్‌జీని దులిపేశారు. ఆమె అంతగా ఆవేశపడటానికి కారణం లేకపోలేదు. నయనతార నటిస్తున్న తాజా చిత్రం మాస్. సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. కాగా ఆయన సోదరుడు ప్రేమ్‌జీ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. షూటింగ్ స్పాట్‌లో ప్రేమ్‌జీ సరదాగా జోక్స్ వేస్తూ అందరినీ ఆటపట్టిస్తుంటారు.
అదే విధంగా మాస్ చిత్రం షూటింగ్ స్పాట్‌లోనూ తన వాటం చూపిస్తూ నయనతారతో హాస్యమాడ చూశారు. అందులో భాగంగా ఆంటీ అంటూ ఆమెను పిలిచారు. మొదట్లో నయనతార ఈ విషయాన్ని సరదాగానే తీసుకున్నారు. అయితే కావాలనే తరచూ ఆంటీ అని ఆటపట్టిస్తుండడంతో ఆమె చికాకుకు గురయ్యారు. దీంతో సహనం కోల్పోయిన నయనతార మరోసారి ఆంటీ అన్నావంటే మర్యాద దక్కదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది అంటూ ఎడాపెడా మాటలతోనే కొట్టేంత పని చేశారు. దీంతో ప్రేమ్‌జీ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారని కోలీవుడ్ సమాచారం.