ఏదీ క్షమాపణ!
తరాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా కొన్ని దురంతాలకు సంబంధించిన జ్ఞాపకాలు చెదిరిపోవు. అవి పదే పదే స్ఫురణకొస్తూనే ఉంటాయి. ఆగ్రహాగ్నిని రగిలిస్తూనే ఉంటాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక నెత్తుటి అధ్యాయంగా మిగిలిపోయిన జలివాలాబాగ్ దురంతం అటువంటిదే. వందేళ్లనాడు సరిగ్గా ఇదే రోజు జరిగిన ఆ దురంతంలో 379మంది మరణించారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నా ఆ సంఖ్య దాదాపు 1,000వరకూ ఉండొచ్చునని ప్రత్యక్షసాక్షుల కథనం. గాయపడినవారి సంఖ్య ఇంతకు మూడు రెట్లు ఉంటుంది. ఆ దుర్మార్గం ఆ ఒక్క రోజుతోనే ఆగిపోలేదు. మరో మూడు నాలుగు రోజులపాటు సాగింది. అమృత్సర్, ఆ చట్టుపట్ల ప్రాంతాల్లో మార్షల్ లా విధించి, పౌరులను అత్యంత అమానుషంగా హింసించారు. మండుటెండలో రోడ్లపై పౌరులను దొర్లిస్తూ వారిని కొరడాలతో కొట్టారు.
జనం గుమిగూడి ఉన్నారని అనుమానించిన ప్రాంతాలపై విమానా లతో బాంబులు కురిపించారు. వేలాదిమందిని అరెస్టు చేశారు. సెన్సార్‌షిప్‌తో ఈ దుర్మార్గాలు బయటకు రాకుండా చూశారు. పంజాబీల ఉగాది పర్వదినమైన బైశాఖినాడు జరిగే వేడుకల కోసం అమృత్సర్ పరిసరప్రాంతాలనుంచి వేలాదిమంది తరలిరావడం రివాజు. రెండువందల ఏళ్లుగా సాగే ఈ సంప్రదాయానికి కొనసాగింపుగానే జలియన్‌వాలాబాగ్ పేరిట ఉన్న విశాల మైదానంలో కుటుంబాలతోసహా వేలాదిమంది చేరారు. అంతమంది గుమిగూడటమే బ్రిటిష్ సైనికుల దృష్టిలో నేరమైంది. చుట్టూ నిలువెత్తు గోడ, బయటకు పోవడానికి మూడు చిన్న చిన్న గేట్లు మాత్రమే ఉన్న ఆ ప్రాంగణంపై సైన్యం తుపాకి గుళ్లు కురిపించింది. దాదాపు 10 నిమిషాలపాటు 1,650 రౌండ్లు కాల్పులు జరిపింది.
పంజాబ్‌లో అంతటి దౌష్ట్యాన్ని ప్రదర్శించడానికి నేపథ్యం ఉంది. అక్కడ వరస కరువులు, ఆహారం కొరత ఏర్పడటం, అధిక ధరలు తప్పలేదు. వీటివల్ల కలిగే ఆకలిమంటల్ని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం– సైన్యంలో చేరటం. బ్రిటిష్ సైన్యంలో 60 శాతంమంది పంజాబీలే ఉండేవారు. అలా వెళ్లలేనివారు, వెళ్లేందుకు ఇష్టపడనివారు ఉద్యమాల్లో సమీకృతులయ్యేవారు. కరువుతో అల్లాడే ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వలసపాలకులపై సహజంగానే ఆగ్రహం పెల్లుబికేది. అది ఉద్యమాల్లో వ్యక్తమయ్యేది. 1914–18 మధ్య సాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో సహకారం అందిస్తే స్వయంపాలనకు వీలుకల్పించే అధినివేశ ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన పాలకులు ఆ తర్వాత మాట తప్పారు. ఆ యుద్ధంలో మరణించిన, తీవ్రంగా గాయపడినవారిలో చాలామంది పంజా బీలు కావడం, యుద్ధానంతరం ఏర్పడిన ద్రవ్యోల్బణం, భారీ పన్నులు కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మరింత కుంగదీయడంతో జనంలో తీవ్ర అసంతృప్తి ఉండేది.
దీన్ని చల్లార్చడానికి, ఉద్యమాలను అణచడానికి పాలకులు రౌలట్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంకింద పౌరులను ఏ చిన్న అనుమానం కలిగినా విచక్షణారహితంగా అరెస్టు చేసేవారు. విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైళ్లలో బంధించేవారు. ఎక్కడైనా జనం గుమిగూడితే ప్రభుత్వం ఉలిక్కిపడేది. జలియన్వాలాబా గ్లో జరిగింది అదే. పండగపూటా స్వర్ణాలయాన్ని సందర్శించుకుని, వేడుకలు చేసుకుందామని పల్లెటూళ్లనుంచి రెండెడ్లబళ్లపై కుటుంబసమేతంగా వచ్చినవారిపై అకారణంగా గుళ్లవర్షం కురిపిం చారు. ఈ అమానుష హత్యాకాండే అనంతరకాలంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో అహింసా యుత సహాయ నిరాకరణ ఉద్యమానికి దారితీసింది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ అంతకు నాలు గేళ్లముందు బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్‌హుడ్‌ను వదులుకోవడానికి కారణమైంది. దీనికి సారథ్యంవహించిన డయ్యర్‌కు అన్నివిధాలా అండగా నిలిచిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయర్‌ను 1940లో విప్లవవీరుడు ఉధమ్‌సింగ్ లండన్ వెళ్లి మరీ హతమార్చాడు.
ఇంత చరిత్ర ఉన్న ఈ అమానుషత్వంపై క్షమాపణ చెప్పడానికి బ్రిటన్ ప్రభుత్వానికి నోరు పెగలడం లేదు. అది సిగ్గుమాలిన చర్య, ఒక విషాదకరమైన ఘటన అని మాత్రం బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అంటున్నారు. జలియన్‌వాలాబాగ్ దురంతానికి కేవలం డయ్యర్ అనే సైనికాధికారి తప్పిదం మాత్రమే కారణం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో తెల్లజాతి కొనసాగించిన రాక్షస పాలనలో భాగం. దశాబ్దాలు గడిచిపోయినప్పుడూ, తరాలు మారిపోయినప్పుడూ ఇలా క్షమా పణలు చెప్పమని అడగటం ఏమంత న్యాయమని ఎవరికైనా అనిపించవచ్చు. దానివల్ల చరిత్రలో భాగమైపోయిన తప్పును ఎలా సరిదిద్దగలమన్న సందేహం కలగొచ్చు. నిజానికి క్షమాపణ అనేది అడిగితే చెప్పేది కాదు. అది లోలోపలి నుంచి పెల్లుబికి రావాలి. అందులో పశ్చాత్తాపం ఉండాలి. వ్యక్తులకైనా, దేశాలకైనా ఇది నాగరిక లక్షణం. బాధితులకు, వారి వారసులకు అలాంటి క్షమాపణ ఓదార్పునిస్తుంది. సాంత్వన కలిగిస్తుంది.
డయ్యర్‌ను బాధ్యుణ్ణి చేసి, అతడిపై చర్య తీసుకున్న ప్పుడు ఆనాటి బ్రిటిష్ సమాజంలో అనేకులు అతనికి అండగా నిలబడ్డారని గుర్తుంచుకోవాలి. సాహితీప్రపంచానికి చెందిన రుయార్డ్ కిప్లింగ్ అందులో ఒకడు. డయ్యర్ చేసిన పని భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరపరిచిందని వాదించి, అతగాడికి 26,000 పౌండ్లు పోగేసి ఇచ్చిన ఘనులున్నారు. ఒక్క డయ్యర్‌ను మాత్రమే కాదు... అలాంటివారినెందరినో నెత్తినపెట్టుకుని ఊరే గిన బ్రిటిష్ సమాజం ఇన్నేళ్ల తర్వాత తాను మారానని చాటడానికి ఈ వందేళ్ల సందర్భం ఒక అవకాశం అయి ఉంటే దాని ఘనత పెరిగేది. కానీ ఏవేవో పదాలు, పదబంధాలు వాడి, తన భాషా పాండిత్యాన్ని చాటుకుని చరిత్రలో జరిగిన అమానుషత్వాన్ని చిన్నదిగా, ఒక యాదృచ్ఛిక ఉదం తంగా చాటడానికి బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ప్రయత్నిస్తోంది. ఇది సహించరానిది. ఆనాటి తరం వలసదేశాలను దోపిడీ చేసి సాధించిపెట్టిన సంపదనూ, అభివృద్ధినీ అనుభవిస్తూ, వారి అమాను షత్వానికి తాము బాధ్యులం కాదని చెప్పడం మర్యాద కాదు. నాగరిక లక్షణం అంతకన్నా కాదు. థెరిస్సా మే దీన్ని గుర్తించలేకపోవడం విచారించదగ్గ విషయం.