సినారె సాహిత్యం ఇతరభాషలలోకి అనువాదం కావాలి
రాజమహేంద్రవరం కల్చరల్: ‘తెలుగు సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదం కాకపోవడం వలనే జాతీయ స్ధాయిలో తెలుగువారికి రావలసినంత గుర్తింపు రావడం లేదు. పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదం కావాలి’ అని కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి అన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో దానవాయిపేటలోని శుభోదయా ఇన్ ఫ్రా కార్యాలయంలో ఆదివారం జరిగిన సినారె సంస్మరణసభలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో నేటి వరకు ఏడుగురు కవులు జ్ఞానపీఠ అవార్డును అందుకోగా, తెలుగులో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారన్నారు. సినారె రాసిన కర్పూర వసంతరాయలు చదివిన ఎన్టీఆర్ ఆయనకు ‘గులేబకావళికథ’ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారని తెలిపారు. సినారె విశ్వంభరలో రాసిన ‘అడుగు సాగుతున్నది–అడుసులో నక్కిన ముళ్లను తొక్కేస్తూ’ అన్న కవితను వినిపించారు. ఓఎన్‌జీసి విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కవులకు ‘ప్రాంతీయస్టాంపులు’ వేయడం బాధాకరమన్నారు. ‘కొందరు కవులను మద్రాసుకు, కొందరిని హైదరాబాద్‌కు మనం అప్పగించామని’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఇంగ్లిష్ ఉపన్యాసకుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ అక్కినేని, సినారెలు లేని రవీంద్రభారతి వేదికను ఊహించుకోలేమన్నారు. ఉపాధ్యాయుడు సుదర్శన శాస్త్రి మాట్లాడుతూ ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ వంటి కవులకోవలో చివరివారు సినారె అన్నారు. మూడు వేల పైచిలుకు సినీపాటలను రాసిన సినారె సుమారు 8 వేల పుస్తకాలకు ముందుమాట రాశారని తెలిపారు. పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి మాట్లాడుతూ సినారె రాసిన అక్షరాల గవాక్షాలులోని కవితలు ఆయనలోని దేశభక్తికి నిదర్శనాలని అన్నారు. నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్, నిమ్మలపూడి గోవిందు, వి.కృష్ణమోహన్, జి.శ్యామలాకుమారి తదితరులు ప్రసంగించారు. శుభోదయమ్‌ఇన్‌ఫ్రా అధినేత కె.లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా సినారె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.