commercial bank
-
సుస్తీకి మూలం ఏది?
అమలాపురం టౌన్ : సహకార రంగాన్ని పరపతేతర వ్యాపార పట్టాలు ఎక్కించి, వాణిజ్య బ్యాంకులకు దీటుగా ప్రగతి సాధించేలా చేయూలనుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నానాటికీ తీసికట్టవుతున్న స్థితిని చూసి ఆందోళనలో పడింది. పరిష్కారాన్వేషణలో ‘సుస్థిర, సమ్మిళిత వ్యవసాయాభివృద్ధి’ పేరిట సబ్ కమిటీని నియమించి ‘టాస్క్ఫోర్స్ కమిటీ’గా పేరు పెట్టి సంక్షోభ దిశగా పయనిస్తున్న సహకార, వ్యవసాయ రంగాలపై సర్వేకు కార్యాచరణ రూపొందించింది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ ప్రయోగాత్మకంగా సర్వేలు, అధ్యయనాలు చేయాలని నిర్దేశించింది. ఈ క్రమంలో డాక్టర్ ఎస్.గాలిబ్ చైర్మన్గా, నాబార్డు విశ్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఎర్రంరాజులతో కూడిన ఆ కమిటీ బుధ, గురువారాల్లో జిల్లాలో పర్యటిస్తోంది. తొలి రోజు ఇద్దరు సభ్యులు జిల్లాలో సహకార రంగంపై అధ్యయనం చేయగా రెండోరోజు గురువారం వ్యవసాయ రంగంపై సర్వే చేయనుంది. జిల్లాలో ప్రస్తుతం సహకార సంఘాలు రుణాలిస్తున్న విధానం, అవి రైతుల అవసరాలు ఏ మేరకు తీరుస్తున్నది, రైతుల ఆర్థిక పరిస్థితులు, రుణాలు తీసుకుని పండించే పంటలకు గిట్టుబాటు ధర లభిస్తున్నదీ, లేనిదీ, వంటి అంశాలపై ఈ కమిటీ లోతుగా అధ్యయనం, సర్వే చేయనుంది. బృందానికి అమలాపురం డీసీసీబీ బ్రాంచి వద్ద డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, వైస్ చైర్మన్ దున్నా జనార్దనరావు, సీఈవో ఎ.హేమసుందర్, డీసీవో టి.ప్రవీణ స్వాగతం పలికారు. బలహీనంగా సహకార వ్యవస్థ.. అమలాపురం డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో చైర్మన్ రాజా అధ్యక్షతన ఈ బృందం కోనసీమలోని సహకార సంఘాల సీఈవోలతో ముఖాముఖి మాట్లాడింది. తొలుత కమిటీ ప్రతినిధి డాక్టర్ ఎర్రంరాజు మాట్లాడుతూ జిల్లాలో 50 డీసీసీబీ బ్రాంచీలు, 300 సహకార సంఘాలు ఉన్నాయన్నారు. వాణిజ్య బ్యాంకులతో పోల్చుకుంటే సహకార వ్యవస్థ దాదాపు 60 శాతం బలం కలిగి ఉన్నా గణాంకాలపరంగా జిల్లా చాలా బలహీనంగా ఉందన్నారు. జిల్లాలో సహకార శాఖ సమకూర్చుకోవాల్సిన ఆర్థిక, మానవ వనరులపై కమిటీ విశ్లేషించి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. రుణమాఫీ హామీయే రైతుల కొంప ముంచింది.. సహకారరంగం వెనుకబాటుకు, రైతుల కుంగుబాటుకు రుణమాఫీ హామీయే కారణమని కొందరు డీసీసీబీ డెరైక్టర్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. గోదశి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాఫీ అవుతుందన్న నమ్మకంతో రుణాలు చెల్లించక, చివరికి అధిక వడ్డీల భారం మోయూల్సి వచ్చిందని అన్నారు. సహకార, వ్యవసాయం సంక్షోభాల గురించి కొత్తగా అధ్యయనం చేయనవసరం లేదని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేస్తే రైతుకు కష్టనష్టాలుండవని స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో జీరో శాతం వడ్డీ రాయితీ సొమ్మును జమచేయకపోవటం వల్ల జిల్లాలో 250 సంఘాలకు పైగా నష్టాల్లో కూరుకుపోతున్నాయన్నారు. కమిటీ మలికిపురం మండలం లక్కవరం, గుడిమాల సహకార సంఘాలను సందర్శించి రైతులతో మాట్లాడింది. రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కాగా రెండు నెలలు సర్వేలు, అధ్యయనాలు చేసి, అక్టోబరు నెలాఖరుకు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని బృందం తెలిపింది. -
తగ్గిన గృహ రుణ అకౌంట్ల సంఖ్య
చెన్నై: గృహ రుణ అకౌంట్ల సంఖ్య 2013లో అసలు పెరక్కపోగా, 2.7 శాతం క్షీణించింది. కమర్షియల్ బ్యాంకుల్లో 2012లో గృహ రుణ అకౌంట్ల సంఖ్య 47.78 లక్షలుకాగా, ఈ సంఖ్య 2013లో 46.43 లక్షలకు తగ్గింది. కాగా రుణ మంజూరీ విలువ మాత్రం రూ.2.6 లక్షల కోట్ల నుంచి 7.3 శాతం వృద్ధితో రూ.2.8 లక్షల కోట్లకు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. నగరాల్లో రియల్టీ అధిక ధరలు కస్టమర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. నిర్మాణం, ఆ రంగం ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా అకౌంట్ల వృద్ధికి అవరోధంగా మారింది. కాగా రూ.2 కోట్ల నుంచి రూ.8 కోట్ల శ్రేణిలో రుణం తీసుకున్న కస్టమర్ల సంఖ్య పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. -
రిక‘వర్రీ’
ఏలూరు (టూ టౌన్) : జిల్లాలోని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల్లో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలోను, సంబంధిత మొత్తాలను వసూలు చేయడంలోను బ్యాంకుల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే సందర్భంలో బినామీ పేర్లతో తీసుకున్న రుణాలను ఎవరి నుంచి రికవరీ చేయూలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 256 సహకార సంఘాల్లో ఈ తరహా కేసులకు సంబంధించి రూ.15 కోట్లు వసూలుకాకపోవడంతో ఆయూ సహకార సంఘాలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. తాజాగా టి.నరసాపురం మండలం కె.జగ్గవరం సహకార సంఘ సిబ్బంది రైతుల పేరిట లక్షలాది రూపాయల్ని కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కొద్ది నెలలుగా పలు సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు 51, 52 విచారణలు జరిపించి నివేదికలు తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా కొంతమంది సహకార సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సిబ్బందికి సహకార శాఖ నోటీసులు ఇచ్చింది. వాణిజ్య బ్యాంకుల్లోనూ బినామీ రుణాలు నిన్నమొన్నటి వరకూ బినామీ రుణాల జబ్బు సహకార సంఘాలకే పరిమితం కాగా, తాజాగా వాణిజ్య బ్యాంకులకూ సోకింది. ఒకే రైతు ఒకే మండలంలో రెండుచోట్ల రుణాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకచోట ఆయిల్పామ్ పంట పేరుతో రుణం తీసుకోగా, మరోచోట చెరకు పంటకు రుణం తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఆంధ్రాబ్యాంకులో సైతం నకిలీ రుణాలు, బినామీ రుణాలు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఆంధ్రాబ్యాంకులో నకిలీ పట్టాలు పెట్టి లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న ఘటనలో ఒక వీఆర్వోతోపాటు 15 మంది రైతులపై పోలీస్ కేసులు నమోదు చేశారు. భీమడోలు, దూబచర్ల, తిరుమలంపాలెం, ద్వారకాతిరుమల బ్యాంకుల్లోనూ నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో సుమారు రూ.5 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక బ్యాంకులో ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ను మచ్చిక చేసుకుని తన పేర, తండ్రి పేర నకిలీ పాస్ పుస్తకాలలో సుమారు రూ.50 లక్షల మేర రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఒకే వ్యక్తి తమ బ్యాంకు పరిధికాని బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చే సినప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. వడ్డించేవాడు మన వాడైతే అన్న చందంగా కొంతమంది బ్యాంకు మేనేజర్ల సాయంతో కొందరు బినామీలు ఎడాపెడా రుణాలు తీసుకుని ఆనక బ్యాంకులకు మొహం చాటేస్తున్నారు. సామాన్యుడు రుణం కోసం వెళితే.. సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులు బినామీలకు మాత్రం వెండిపళ్లెంలో వడ్డించిన చందంగా రుణాలు ఇస్తుండటం విశేషం.