సుస్తీకి మూలం ఏది? | Sustiki What is the source? | Sakshi
Sakshi News home page

సుస్తీకి మూలం ఏది?

Published Thu, Aug 13 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

Sustiki What is the source?

అమలాపురం టౌన్ : సహకార రంగాన్ని పరపతేతర వ్యాపార పట్టాలు ఎక్కించి, వాణిజ్య బ్యాంకులకు దీటుగా ప్రగతి సాధించేలా చేయూలనుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నానాటికీ తీసికట్టవుతున్న స్థితిని చూసి ఆందోళనలో పడింది. పరిష్కారాన్వేషణలో ‘సుస్థిర, సమ్మిళిత వ్యవసాయాభివృద్ధి’ పేరిట సబ్ కమిటీని నియమించి ‘టాస్క్‌ఫోర్స్ కమిటీ’గా పేరు పెట్టి సంక్షోభ దిశగా పయనిస్తున్న సహకార, వ్యవసాయ రంగాలపై సర్వేకు కార్యాచరణ రూపొందించింది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ ప్రయోగాత్మకంగా సర్వేలు, అధ్యయనాలు చేయాలని నిర్దేశించింది.
 
 ఈ క్రమంలో డాక్టర్ ఎస్.గాలిబ్ చైర్మన్‌గా, నాబార్డు విశ్రాంత చీఫ్ జనరల్ మేనేజర్ మోహనయ్య, ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఎర్రంరాజులతో కూడిన ఆ  కమిటీ బుధ, గురువారాల్లో జిల్లాలో పర్యటిస్తోంది. తొలి రోజు ఇద్దరు సభ్యులు జిల్లాలో సహకార రంగంపై అధ్యయనం చేయగా రెండోరోజు గురువారం వ్యవసాయ రంగంపై సర్వే చేయనుంది. జిల్లాలో ప్రస్తుతం సహకార సంఘాలు రుణాలిస్తున్న విధానం, అవి రైతుల అవసరాలు ఏ మేరకు తీరుస్తున్నది, రైతుల ఆర్థిక పరిస్థితులు, రుణాలు తీసుకుని పండించే పంటలకు గిట్టుబాటు ధర లభిస్తున్నదీ, లేనిదీ, వంటి అంశాలపై ఈ కమిటీ లోతుగా అధ్యయనం, సర్వే చేయనుంది. బృందానికి అమలాపురం డీసీసీబీ బ్రాంచి వద్ద డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, వైస్ చైర్మన్ దున్నా జనార్దనరావు, సీఈవో ఎ.హేమసుందర్, డీసీవో టి.ప్రవీణ స్వాగతం పలికారు.
 
 బలహీనంగా సహకార వ్యవస్థ..
 అమలాపురం డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో చైర్మన్ రాజా అధ్యక్షతన ఈ బృందం కోనసీమలోని సహకార సంఘాల సీఈవోలతో ముఖాముఖి మాట్లాడింది. తొలుత కమిటీ ప్రతినిధి డాక్టర్ ఎర్రంరాజు మాట్లాడుతూ జిల్లాలో 50 డీసీసీబీ బ్రాంచీలు, 300 సహకార సంఘాలు ఉన్నాయన్నారు. వాణిజ్య బ్యాంకులతో పోల్చుకుంటే సహకార వ్యవస్థ దాదాపు 60 శాతం బలం కలిగి ఉన్నా గణాంకాలపరంగా జిల్లా చాలా బలహీనంగా ఉందన్నారు. జిల్లాలో సహకార శాఖ సమకూర్చుకోవాల్సిన ఆర్థిక, మానవ వనరులపై కమిటీ విశ్లేషించి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది.
 
 రుణమాఫీ హామీయే రైతుల కొంప ముంచింది..
 సహకారరంగం వెనుకబాటుకు, రైతుల కుంగుబాటుకు రుణమాఫీ హామీయే కారణమని కొందరు డీసీసీబీ డెరైక్టర్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. గోదశి నాగేశ్వరరావు మాట్లాడుతూ మాఫీ అవుతుందన్న నమ్మకంతో రుణాలు చెల్లించక, చివరికి అధిక వడ్డీల భారం మోయూల్సి వచ్చిందని అన్నారు. సహకార, వ్యవసాయం సంక్షోభాల గురించి కొత్తగా అధ్యయనం చేయనవసరం లేదని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేస్తే రైతుకు కష్టనష్టాలుండవని స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో జీరో శాతం వడ్డీ రాయితీ సొమ్మును జమచేయకపోవటం వల్ల జిల్లాలో 250 సంఘాలకు పైగా నష్టాల్లో కూరుకుపోతున్నాయన్నారు. కమిటీ మలికిపురం మండలం లక్కవరం, గుడిమాల సహకార సంఘాలను సందర్శించి రైతులతో మాట్లాడింది. రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. కాగా రెండు నెలలు సర్వేలు, అధ్యయనాలు చేసి, అక్టోబరు నెలాఖరుకు సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని బృందం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement