రిక‘వర్రీ’ | Andhra Pradesh govt to waive farm loans up to Rs 1.5 lakh | Sakshi
Sakshi News home page

రిక‘వర్రీ’

Published Sat, Dec 27 2014 4:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

రిక‘వర్రీ’ - Sakshi

రిక‘వర్రీ’

ఏలూరు (టూ టౌన్) : జిల్లాలోని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల్లో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలోను, సంబంధిత మొత్తాలను వసూలు చేయడంలోను బ్యాంకుల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఇదే సందర్భంలో బినామీ పేర్లతో తీసుకున్న రుణాలను ఎవరి నుంచి రికవరీ చేయూలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 256 సహకార సంఘాల్లో ఈ తరహా కేసులకు సంబంధించి రూ.15 కోట్లు వసూలుకాకపోవడంతో ఆయూ సహకార సంఘాలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. తాజాగా టి.నరసాపురం మండలం కె.జగ్గవరం సహకార సంఘ సిబ్బంది రైతుల పేరిట లక్షలాది రూపాయల్ని కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కొద్ది నెలలుగా పలు సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు 51, 52 విచారణలు జరిపించి నివేదికలు తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా కొంతమంది సహకార సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సిబ్బందికి సహకార శాఖ నోటీసులు ఇచ్చింది.
 
వాణిజ్య బ్యాంకుల్లోనూ బినామీ రుణాలు
నిన్నమొన్నటి వరకూ బినామీ రుణాల జబ్బు సహకార సంఘాలకే పరిమితం కాగా,  తాజాగా వాణిజ్య బ్యాంకులకూ సోకింది. ఒకే రైతు ఒకే మండలంలో రెండుచోట్ల రుణాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకచోట ఆయిల్‌పామ్ పంట పేరుతో రుణం తీసుకోగా, మరోచోట చెరకు పంటకు రుణం తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఆంధ్రాబ్యాంకులో సైతం నకిలీ రుణాలు, బినామీ రుణాలు తీసుకున్నారు.

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఆంధ్రాబ్యాంకులో నకిలీ పట్టాలు పెట్టి లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న ఘటనలో ఒక వీఆర్వోతోపాటు 15 మంది రైతులపై పోలీస్ కేసులు నమోదు చేశారు. భీమడోలు, దూబచర్ల, తిరుమలంపాలెం, ద్వారకాతిరుమల బ్యాంకుల్లోనూ నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో సుమారు రూ.5 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక బ్యాంకులో ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌ను మచ్చిక చేసుకుని తన పేర, తండ్రి పేర నకిలీ పాస్ పుస్తకాలలో సుమారు రూ.50 లక్షల మేర రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

సాధారణంగా ఒకే వ్యక్తి తమ బ్యాంకు పరిధికాని బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చే సినప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. వడ్డించేవాడు మన వాడైతే అన్న చందంగా కొంతమంది బ్యాంకు మేనేజర్ల సాయంతో కొందరు బినామీలు ఎడాపెడా రుణాలు తీసుకుని ఆనక బ్యాంకులకు మొహం చాటేస్తున్నారు. సామాన్యుడు రుణం కోసం వెళితే.. సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులు బినామీలకు మాత్రం వెండిపళ్లెంలో వడ్డించిన చందంగా రుణాలు ఇస్తుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement