పుష్కరాలకు సకల సౌకర్యాలు
నెహ్రూనగర్: పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పుష్కర్‌నగర్ వద్ద సకల సౌకర్యాలతో కూడిన సదుపాయాలు కల్పించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్‌నగర్‌లో ఏర్పాట్ల పై విలేకర్లతో మాట్లాడారు.యాత్రికులకు షెడ్లు ఏర్పాటు చేశామని, సదరు షెడ్లలో రోజుకు 10 వేల మంది యాత్రికులు సేద తీరవచ్చన్నారు.. యాత్రికులు సౌకర్యార్థం పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. రోజు 10 వేల మందికి భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంబులెన్స్ సదుపాయం, మెడికల్ షాపులు, క్లాక్ రూం, యాత్రికులకు అవసరమైన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. వినోదం కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. పుష్కర్ నగర్ నుంచి అమరవాతికి, పవిత్ర సంగమం వద్దకు కూడా బస్సులు ఏర్పాటు చేశామని, బస్సులే కాక రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులందరికీ సకల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.