కమిషనర్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి
ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడికి పాల్పడ్డ టీడీపీ ప్రజాప్రతినిధులను కఠినంగా శిక్షించాలని ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బాల సుబ్రహ్మణ్యంని రెండు గంటల పాటు నడిరోడ్డుపై నిల్చోబెట్టిన టీడీపీ ప్రజాప్రతినిధులు తీరుని ఖండిస్తూ ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(క్రైమ్): రవాణాశాఖ కమిషనర్ ఎన్.బాల సుబ్రమణ్యం, ఆయన గన్‌మ్యాన్ దశరథపై కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ చైర్మన్ నాగూర్బాబుల దౌర్జన్యాన్ని రాష్ట్ర పోలీసు, రవాణా అధికారుల సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. రౌడీల్లా వ్యవహరించిన సదరు టీడీపీ ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో పోలీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యులైన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.