common entrance tests
-
సెట్స్‌కు ఏపీ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేయిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యాశాఖ అధికారులు, ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు, వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్లతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు అందించారు. ► కోవిడ్–19 ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టింది. ► కంప్యూటర్ ఆధారిత (సీబీటీ)గా (పీఈసెట్ మినహా) ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ► ఇప్పటికే బార్‌కోడింగ్ హాల్ టికెట్లు జారీచేసి, విద్యార్థులు పాటించాల్సిన విధివిధానాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ► ప్రతి అభ్యర్థి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌ను తీసుకొనేందుకు ప్రత్యేక ప్రొఫార్మాను ఉన్నత విద్యామండలి రూపొందించింది. ► ఈ నెల 10 నుంచి ఐసెట్ పరీక్షలతో సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ► బార్కోడ్ స్కానింగ్ ద్వారా అభ్యర్థుల సమాచారాన్ని అధికారులు ధ్రువీకరించుకుంటారు. ఇందుకోసం ప్రవేశద్వారం వద్ద బార్కోడ్ రీడర్లను ఏర్పాటు చేశారు. ► అభ్యర్థులు మాస్క్‌తో రావాలి. పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తారు. ► అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం సెషన్లో 7.30– 9.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్లో 1.30– 3.00 వరకు అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ► ప్రతి సెషన్లో పరీక్ష హాలు లోపల శానిటైజ్ చేస్తారు. ► సెట్లకు సంబంధించిన సమాచారం ఆయా సెట్ల అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ► అభ్యర్థులను ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న వారిని ఐసోలేషన్ గదిలో పరీక్ష రాయిస్తారు. ► ప్రతి కేంద్రంలో ఐసోలేషన్ గదులు కేటాయిస్తున్నారు. ఈ గదుల్లో పరీక్షల సిబ్బందికి పీపీఈ కిట్లు అందించనున్నారు. ► ఈసెట్‌లో ఈసారి కొత్తగా అగ్రికల్చర్ డిప్లొమో కోర్సుకు ప్రవేశాలు చేపట్టనున్నారు. ► ఐసెట్‌లో గతంలో బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చేసిన వారికి ఎంసీఏలో లేటరల్ ఎంట్రీ ఉండేది. కానీ ఎంసీఏను రెండేళ్లకు కుదించినందున లేటరల్ ఎంట్రీని రద్దుచేసి వారికి కూడా ఫస్టియర్‌లోనే ప్రవేశాలు కల్పించనున్నారు. ► ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ఇంగ్లిష్ లేకుంటే మీ ముందు ఇలా మాట్లాడగలిగేవాడినా?) -
పాస్, ఫెయిల్ లేదు.. డైరెక్ట్ ప్రమోట్
సాక్షి, హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా లాక్డౌన్ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మే 7 తర్వాతి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒక వేళ మే నెల మొత్తం లాక్డౌన్ ఉంటే జూన్ మూడో, నాలుగో వారంలో పరీక్షలు నిర్వహిస్తాం. డిగ్రీ ఆ స్థాయి ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం కానీ, పాస్, ఫెయిల్ అనే మాట ఉండదు. డైరెక్ట్ ప్రమోట్ చేస్తాం. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల సిలబస్ కోసం కాలేజ్‌లతో మాట్లాడుతున్నాం. ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తాం. కామన్ టెస్ట్‌ల తర్వాత కొత్త విద్యా సంవత్సరం నెల, రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంద’’ని తెలిపారు. -
మేలో ‘సెట్’ల పండుగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌లో) ప్రవేశాల కోసం 2020 మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్ పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను బట్టి సెషన్స్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. నిమిషం నిబంధన యథాతథం.. ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి నేషనల్ పూల్ లేదు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్ట సవరణతోనే విదేశీ వర్సిటీలు ప్రస్తుతం ఉన్న పార్లమెంటు చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలు దేశంలో యూనివర్సిటీ లేదా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న నూతన విద్యా విధానంలో ఆ అంశంపై చర్చిస్తోందని, అందులో ఓకే చెబితే విదేశీ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా సెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి. -
ఏదీ 'సెట్' కాలేదు
సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే! ఈసెట్, పాలిసెట్ అలాట్మెంట్లు మాత్రమే పూర్తి ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే! అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు. జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే! ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. పీజీఈసెట్: అంతా గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు. అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్ వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. లాసెట్దీ అదే పరిస్థితి.. లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి. పీజీఈసెట్ గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది.