Commonwealth Games 2018
-
సింధు సారథ్యంలో టీమిండియా..
న్యూఢిల్లీ : తెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన అవకాశం లభించింది. గోల్డ్ కోస్ట్(ఆస్ట్రేలియా)లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్స వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి భారత జట్టుకు సారథ్యం వహించనున్నారామె. ఏప్రిల్ 4న కరారా స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభవేడుకలు జరుగుతాయని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దాదాపు 300 మంది భారత అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటారు. తన కంటే సీనియర్లైన మేరీ కోమ్, సైనా నెహ్వాల్‌లు కూడా కామన్వెల్త్లో పాల్గొంటున్నప్పటికీ ఈ అవకాశం మాత్రం సింధూకే దక్కడం గమనార్హం. ప్రస్తుతం సింధూ దేశంలోనే గొప్ప అథ్లెట్‌గా గుర్తింపు పొందారని, అందుకే ఆమెకు ఈ బాధ్యతలు అప్పజెప్పామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
కామన్ వెల్త్ గేమ్స్‌కు మాలిక్ అర్హత
న్యూఢిల్లీ : ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ 2018లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్(సీడబ్ల్యూజీ)కు అర్హత సాధించారు. వచ్చే ఏడాది కిర్గిస్థాన్‌లో జరగనున్న సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌కు భారతీయ మహిళా రెజ్లింగ్ టీం ఎంపిక శనివారం లక్నోలో జరిగింది. 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ సీడబ్ల్యూజీకి అర్హత సాధించారు. మాలిక్‌తో పాటు వినేష్ ఫొగాట్(50 కేజీలు), పూజా ధాండా(57కేజీలు), బబితా కుమారి ఫొగాట్(54 కేజీలు), దివ్య కరణ్(68కేజీలు), కిరణ్(76 కేజీలు) విభాగాల్లో రెండు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. సీడబ్ల్యూజీ 2018 ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరగనుంది. -
కామన్వెల్త్ గేమ్స్‌కు సతీశ్, రాహుల్ క్వాలిఫై
సాక్షి, న్యూఢిల్లీ : భారత వెయిట్ లిఫ్టర్లు శివలింగం సతీశ్ కుమార్, రాగల వెంకట్ రాహుల్ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్-2018కి అర్హత సాధించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో పురుషులు, మహిళలకు పలు విభాగాల్లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇదివరకే రికార్డులు సృష్టించిన రాహుల్ స్నాచ్ లో 156 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 195 కేజీలు ఎత్తి సత్తాచాటారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బరిలోకి రాహుల్ దిగనున్నారు. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన సతీశ్ కుమార్ 77 కేజీల విభాగంలో స్నాచ్‌లో 148 కేజీలు, క్లీన్ అండర్ జర్క్‌లో 172 కేజీలతో ఓవరాల్‌గా 320 కేజీలెత్తారు.