మార్పు రావాలి
పరిగి మండలంలోని 23 గ్రామాల్లో 113 మంది తల్లులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోలేదు. మగ సంతానం కోసం వేచిచూస్తూ.. ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తూ పలువురు మృత్యుఒడికి చేరారు. ఇలా ఇటీవలి కాలంలో 60 మంది తల్లులు చనిపోయారు. తనువు చాలించిన వారిలో 65 శాతం మంది 18 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న వారే. అంటు వ్యాధుల బారిన పడుతున్న వారు.. పౌష్టికాహార లోపం ఉన్న వారు చాలా మందే ఉన్నారు.
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : నిరక్షరాస్యత, మూఢనమ్మకాలతో అధిక సంతానానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో పలువురు మహిళలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరికి నచ్చజెప్పి వారి జీవన గమనాన్ని మార్చడానికి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ‘మార్పు’ కార్యక్రమం నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మాతా శిశు మరణాల తగ్గింపు, పౌష్టికాహార లోపం నివారణ, అంటువ్యాధుల నివారణ, పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కుల కల్పన వంటి నాలుగు ప్రధాన అంశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తొలుత జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సర్వే పూర్తి చేసి.. 18 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఆయా మండలాల్లో పరిస్థితులపై ఇప్పటికే సర్వే నిర్వహించారు. తదనంతర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4,5 తేదీల్లో ఆయా మండల సమాఖ్య కార్యాలయాల్లో గ్రామైక్య సంఘాల లీడర్లు, వీఆర్వోలు, యానిమేటర్లు, సీసీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక్కో మండలం నుంచి ఆరుగురు కమ్యూనిటీ రీసోర్సు పర్సన్లు (సీఆర్పీలు), ముగ్గురు ఏఎన్ఎంలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఉన్నత స్థాయి శిక్షణ ఇచ్చారు. వీరు బుధవారం నుంచి మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఐకేపీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మార్పు ఉద్దేశాన్ని వివరించనున్నారు.
ఇందుకు స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారం కూడా తీసుకుంటారు. దీంతో పాటు ఐకేపీ ఉద్యోగులందరి సెల్ఫోన్లలో మార్పు అంశాలపై అవగాహన కలిగేలా కాలర్ టోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశాలపై గ్రామైక్య సంఘాల సమావేశాల్లోనూ తప్పనిసరిగా చర్చించాలని మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా చైతన్యం తేవాలని భావిస్తున్నారు. మార్పులో భాగస్వాములు కాని మహిళలను గ్రామ ఐక్య సంఘాల లీడర్లుగా ఎన్నుకోరాదని సూచించనున్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళలను భవిష్యత్‌లో జిల్లా, మండల సమాఖ్య అధ్యక్ష పదవులకూ అనర్హులు చేయనున్నారు.
18 మండలాల్లో నేడు, రేపు శిక్షణ
బుక్కరాయసముద్రం, అనంతపురం, ఆత్మకూరు, నార్పల, చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల, కూడేరు, బత్తలపల్లి, రాప్తాడు, శింగనమల, గార్లదిన్నె, గుంతకల్లు, ధర్మవరం, బెళుగుప్ప, ఉరవకొండ, విడపనకల్లు, తాడిపత్రి మండలాల్లో తొలి విడతగా బుధ, గురువారాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రజల్లో మార్పు తెస్తాం
ప్రజల్లో అమాయకత్వం, నిరక్షరాస్యత కారణంగా రోగాల బారిన పడుతున్నారు. జబ్బులు నయం చేసుకోవడానికే సంపాదనలో అధిక శాతం ఖర్చు చేస్తున్నారు. వారిలో చైతన్యం తీసుకురావడానికే ఈ ఏడాది మార్పు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. ఈ కార్యక్రమం అమలు చేయడమే ఐకేపీ సిబ్బంది ప్రధాన ఎజెండా.
నీలకంఠారెడ్డి, పీడీ,
ఇందిరా క్రాంతి పథం