అటూ ఇటూ.. ఆకర్ష్
నేతల కోసం టీఆర్ఎస్ - కాంగ్రెస్ పోటాపోటీ
కాంగ్రెస్ నేతలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు
పార్టీ నేతలు వెళ్లకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు
నందీశ్వర్ గౌడ్‌ను బుజ్జగించేందుకు స్వయంగా రాహుల్ ఫోన్!
టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవటంపైనా దృష్టి కేంద్రీకరణ
టీ-జేఏసీ, ప్రజాసంఘాల నేతల కోసమూ రెండు పార్టీల పోటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించడంతో పాటు ఇకపై ఎవరు ఏ పార్టీలో చేరతారో చూద్దామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు విసిరిన సవాలు.. ఆ రెండు పార్టీల్లో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు.. పరస్పరం పార్టీల నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ.. చేరికలను ప్రోత్సహించే పనిలో పోటీపడుతున్నారు. తమ పార్టీ నుంచి ఎదుటి పార్టీకి వెళతారనుకున్న వారిని బుజ్జగిస్తూనే.. తెలంగాణ జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నేతల మద్దతు కూడగట్టేందుకూ ప్రయత్నిస్తున్నారు. అలాగే.. ఈ ప్రాంతంలోని ఇతర పార్టీలతో పొత్తులపైనా దృష్టిపెట్టారు. ముఖ్యంగా.. రాష్ట్రాన్ని విభజించిన ఘనత తమదేనని చెప్పుకుంటూ తెలంగాణలో దూసుకుపోవచ్చని భావించిన కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు మింగుడుపడటం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి ఇక ఎవరూ టీఆర్ఎస్లో చేరకుండా కాపాడుకోవడమే కాకుండా.. తెలంగాణ వాదులను పార్టీలో చేర్పించుకోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తలకుమించిన భారంగా మారింది. మరోవైపు సవాలు విసిరిన కేసీఆర్ సైతం తమ పార్టీలో చేరికలు ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదని తెలుస్తోంది. జిల్లాల వారీగా పరిస్థితిని అంచనా వేస్తూనే చేరికలపై అంతర్గత చర్చలను ముమ్మరం చేశారు.
ఎవరు ఎవరి పార్టీలోకి వెళతారో చూద్దామంటూ కేసీఆర్ ఆషామాషీగా ప్రకటన చేసి ఉండరని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళతారనుకునే నేతల జాబితాను రూపొందించి మరీ వారితో సంప్రదింపులు, బుజ్జగింపులు ప్రారంభించింది. మెదక్ జిల్లా పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రంగంలోకి దిగారు. సోమవారం నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి పార్టీని వీడొద్దని, కాంగ్రెస్‌లో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారు. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందీశ్వర్‌గౌడ్‌కు, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వి.భుపాల్రెడ్డికి మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డీసీసీ పంపిన అభ్యర్థుల జాబితాలో నందీశ్వర్‌గౌడ్ పేరును చేర్చకపోగా, అక్కడి నుంచి భుపాల్‌రెడ్డి తన పేరును మాత్రమే సిఫారసు చేసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సన్నిహితుడైన భూపాల్‌రెడ్డి ఆయన సూచన మేరకే జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు పథకం ప్రకారమే తన పేరును తప్పించారని భావించిన నందీశ్వర్‌గౌడ్ ఇక కాంగ్రెస్‌లో కొనసాగకూడదని భావించారు. అందులో భాగంగానే రెండు రోజుల కిందట కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లి టీఆర్ఎస్లో చేరే అంశంపై చర్చించారు. ఈ విషయం తెలిసి పొన్నాల, డీఎస్ తదితరులు నందీశ్వర్‌గౌడ్‌ను పిలిచి బుజ్జగించడమే కాకుండా దామోదరతో పాటు నేరుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నుంచి నందీశ్వర్‌గౌడ్‌కు ఫోన్ చేయించారు. దాంతో నందీశ్వర్‌గౌడ్ మెత్తబడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తనకు కన్నతల్లి వంటిదన్నారు. బతికున్నంత కాలం ఆ పార్టీలోనే కొనసాగుతానన్నారు.
ఇబ్రహీంతో కాంగ్రెస్ మంతనాలు...
మరోవైపు.. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ నేత ఇబ్రహీంతో కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేర్పించుకోవడానికి సంప్రదింపులు ప్రారంభించారు. ఇబ్రహీం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. టీఆర్ఎస్తో విభేదిస్తున్న తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాల నేతలను కూడా కాంగ్రెస్‌లోకి రప్పించే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతంను, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను తాజాగా పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నజర్...
కాంగ్రెస్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడంతో టీఆర్ఎస్ నేతలు ఖంగుతిన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌లో పేరున్న నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కేసీఆర్ పోటీచేయబోతున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలపై ముందుగా దృష్టి సారించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి ఒకరు మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో గట్టి ప్రాబల్యమున్న మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులు కూడా టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ బలంగా ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కాంగ్రెస్ అసంతృప్త నాయకులపై టీఆర్ఎస్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మరికొందరు అగ్రనేతలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతారని ధీమాగా ఉన్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో బలంగా ఉన్న ఒక వర్గం నేతలు తెలంగాణ కాంగ్రెస్ కమిటీని ప్రకటించిన తర్వాత అసంతృప్తిగా ఉన్నట్టు టీఆర్ఎస్కు సమాచారం అందింది. దాన్ని ఆసరా చేసుకుని ఆ నాయకులను పార్టీలో చేర్చుకుంటే దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్కు తిరుగు ఉండదని భావిస్తోంది.
కాంగ్రెస్‌లోకి సుద్దాల దేవయ్య!
కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైంది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సోమవారం సమావేశమై పార్టీలో చేరే అంశంపై చర్చించారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ కావాలని కోరినప్పటికీ స్పష్టమైన హామీ లభించలేదు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతానికి చొప్పదండి టిక్కెట్ ఇస్తామని హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు లేదా కార్పొరేషన్ పదవి ఇస్తామని కాంగ్రెస్ నేతలు సుద్దాలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ పరిస్థితి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడం, తాను కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక టీడీపీలో కొనసాగడం అనవసరమనే భావనతోనే నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని సుద్దాల దేవయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే మీడియాకు మాత్రం తాను హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకే పొన్నాలను కలిశానని ఆయన చెప్పారు.
పొన్నాలతో దామోదర, షబ్బీర్ భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో-చైర్మన్ షబ్బీర్‌అలీలు సమావేశమయ్యారు. తెలంగాణలో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించిన టీపీసీసీ నేతలు ఈ అంశంపైనే చర్చించుకున్నట్లు తెలిసింది.