Competition world
-
నైపుణ్యాలకు నవ్య పథం.. ఇంటర్న్‌షిప్!
సైద్ధాంతిక పరిజ్ఞానం విద్యార్థికి ఓ కొత్త అంశాన్ని పరిచయం చేస్తే, ప్రాక్టికల్ పరిజ్ఞానం ఆ అంశం లోతుపాతుల్ని ఒంటబట్టిస్తుంది! ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలకే పెద్దపీట. నియామకాల సందర్భంగా ఓ విద్యార్థి తరగతిగదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ఎంత వరకు క్షేత్రస్థాయిలో ఆచరించి చూపగలరనే దాన్ని పరిశ్రమలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు చదివేవారు కోరుకున్న కొలువు దక్కించుకునేందుకు ఇంటర్న్షిప్స్ కీలకమవుతున్నాయి. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘‘ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్’’ ప్రారంభించిన నేపథ్యంలో.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.. ఇంటర్న్షిప్స్.. క్యాంపస్‌లో ఉన్నప్పుడే పరిశ్రమల కార్యకలాపాలపై శిక్షణ, పని అనుభవాన్ని పొందడానికి తోడ్పాటును అందిస్తున్నాయి. విద్యార్థి దశలోనే ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తున్నాయి. ‘‘ఇటీవలి కాలంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యా ప్రాంగణాల్లోనే పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను మలిచే పనిలో నిమగ్నమవుతున్నాయి. ఇందులో భాగంగా టాప్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లలోని ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వారికి తమ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశమిస్తున్నాయి. ఆపై గ్రాడ్యుయేషన్ పూర్తయిందే తడవు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నాయి’’ అంటున్నారు ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ హెడ్ టీవీ దేవీప్రసాద్. ఇంజనీరింగ్ విద్యార్థులకు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014 ఇంటర్న్‌షిప్‌ను అకడమిక్ స్థాయిలో వివిధ కోర్సులకు అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో ‘ఎంహెచ్ఆర్డీ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2014’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకానికి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థలో ఎడ్యుకేషన్, సోషల్ సెన్సైస్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఐసీటీ, లా కోర్సుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ కోర్సులు చేస్తున్న వారు అర్హులు. ఐఐటీ, ఐఐఎం, పరిశోధన/అభివృద్ధి సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, భాషా విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు తదితరాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి రెండు నెలలు, అవసరాన్ని బట్టి ఆరు నెలల వరకు పొడిగిస్తారు. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. పథకం మొదటి బ్యాచ్ ఇంటర్న్‌షిప్ అక్టోబర్ 1న ప్రారంభమైంది. మిగిలిన బ్యాచ్‌లకు ఔత్సాహిక విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: mhrd.gov.in ప్రముఖ సంస్థల్లో అవకాశాలు బీహెచ్ఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్, ఇస్రో వంటి సంస్థలు ఇంటర్న్‌షిప్ అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎల్ అండ్ టీ, టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. వీటికోసం ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. వివిధ విభాగాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందించడంలో డీఆర్డీవో, సీసీఎంబీ, ఐఐఆర్ఎస్, ఏఆర్సీఏ తదితర సంస్థలు ముందుంటున్నాయి. విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకొని ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందుకోవచ్చు. డీఆర్డీవో: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో).. ఏటా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. సంస్థకు చెందిన ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొనేలా చేసి ప్రాక్టికల్ పరిజ్ఞానం అందిస్తోంది. విద్యార్థుల అర్హతలు, అవసరాలకు అనుగుణంగా సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న లేబొరేటరీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందొచ్చు. సాధారణ సమయంతోపాటు వేసవిలోనూ ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రవేశాలు కల్పిస్తోంది. వెబ్సైట్: www.drdo.gov.in సీసీఎంబీ:సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ).. విద్యార్థులకు ఏటా వేసవిలో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల్లో సైన్స్ బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పరిశోధన వాతావరణం వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ ఇంటర్న్‌షిప్ దోహదం చేస్తుంది. విద్యార్థులకు సీసీఎంబీ సైంటిస్టులు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. వెబ్సైట్: www.ccmb.res.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ విభాగమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్).. విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్, ఇంటర్న్‌షిప్‌లకు వీలు కల్పిస్తోంది. విద్యార్థులకు ఐఐఆర్ఎస్ ఫ్యాకల్టీ సభ్యులు గైడ్/సూపర్వైజర్గా వ్యవహరిస్తారు. ఎంఎస్సీ, ఎంఎస్సీ (టెక్), ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, ఎంసీఏ తదితర కోర్సులు చేస్తున్న విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టు చేపట్టే అవకాశాన్ని ఐఐఆర్ఎస్ కల్పిస్తోంది. వేసవి శిక్షణ అవకాశాన్ని సంస్థ ఉద్యోగ సంబంధీకులతో పాటు ఐఐటీ, బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ, నిట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. వెబ్సైట్: www.iirs.gov.in ఏఆర్‌సీఐ: ఇంటర్నేషనల్ అడ్వాన్సడ్ రీసెర్చ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ).. పూర్తికాల సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులో ఉంచుతోంది. ఏటా వేసవి సెలవుల్లో (మే నుంచి జూన్ చివరి వరకు) ఈ శిక్షణ ఉంటుంది. ప్రారంభంలో విద్యార్థులను బ్యాచ్‌కు 6-8 మంది ఉండేలా ఐదారు బ్యాచ్‌లుగా విభజిస్తారు. వీరికి వారం పాటు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీని తర్వాత ఒక్కో విద్యార్థిని ఒక్కో శాస్త్రవేత్త పరిధిలో ఉంచుతారు. ఈ శాస్త్రవేత్త పర్యవేక్షణలో విద్యార్థి ఓ చిన్న ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది. చివర్లో దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలి. వీటిని పరిగణనలోకి తీసుకుని ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. ఎంటెక్/ఎంఈ/ఎంఎస్సీ మొదటి ఏడాది పూర్తిచేసిన వారు, బీటెక్/బీఈ రెండు, మూడో ఏడాది విద్యార్థులు వేసవి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వెబ్సైట్: www.arci.res.in ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ స్కిల్స్ ‘‘విద్యార్థులు తరగతి గదిలో కేవలం అకడమిక్స్ అంశాలను మాత్రమే నేర్చుకుంటారు. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో మాత్రమే పొందగలరు. ముఖ్యంగా సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నత కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ప్రాక్టికల్ పరిజ్ఞానమే దిక్సూచి. ఇటీవలి కాలంలో బహుళజాతి సంస్థలు.. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి, ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తర్వాత ప్లేస్‌మెంట్స్ పొందడానికి తోడ్పాటునందిస్తున్నాయి. ఎంహెచ్ఆర్డీ ప్రకటించిన ఇంటర్న్‌షిప్ పథకం విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు నిర్ణీత కాల వ్యవధిలో ముఖ్యంగా వేసవిలో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకొని కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు’’ - డాక్టర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్, జేఎన్టీయూహెచ్ -
టిక్.. టిక్.. టిక్.. వాచ్ డిజైనర్..
విలువైన కెరీర్‌కు చక్కటి ‘టైమ్’ టైమ్.. ఎంతో విలువైంది. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రధానం. అలాంటి టైమ్‌ను సూచించే గడియారాలు.. నేడు విలువైన కెరీర్‌ను అందించడంలో.. లక్షల జీతం సొంతం చేసుకోవడంలో.. మెరుగైన ఉపకరణాలుగా మారుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ ట్రెండ్స్ రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో సమయాన్ని సూచించే గడియారాలు కూడా కొత్త ఆకృతులతో ఆకర్షిస్తున్నాయి. ఇలా ఆకర్షించే విధంగా వాచ్‌ల డిజైన్‌ను రూపొందించడం వెనుక ఎంతో శ్రమ. మరెంతో సృజనాత్మకత ఉంది. వంద రూపాయల మొదలు.. లక్షల రూపాయల వరకు ఆయా స్థాయిల వినియోగదారుల కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం ఒక ప్రత్యేక కళ. ఆ కళను అందించించడంతోపాటు కలర్‌ఫుల్ కెరీర్‌కు.. సోపానంగా నిలుస్తున్న వాచ్ డిజైనర్ కెరీర్‌పై ఫోకస్. గడియారం.. వాచ్.. అంటే 12 అంకెలు.. రెండు ముళ్లతో సమయాన్ని సూచించే సాధనం. వాల్ క్లాక్ అయినా రిస్ట్ వాచ్ అయినా గడియారం ఉద్దేశం అదే. కానీ ఆధునిక ప్రపంచంలో, అత్యాధునిక అభిరుచులకు అనుగుణంగా గడియారాలను డిజైన్ చేయడం అంత సులువేమీ కాదు. అందుకే నేడు వాచ్ డిజైనర్ విధి ఎంతో క్రియాశీలకమైంది. ఒక నిర్దిష్ట ఆకృతిలో వాచ్‌ను డిజైన్ చేయాలంటే.. దానికోసం చేయాల్సిన కసరత్తు కూడా ప్రత్యేకం. ప్రస్తుత వినియోగదారుల అభిరుచి, ట్రెండ్‌ను పరిశీలించడం- విశ్లేషించడం; వీటికి అనుగుణంగా ముందుగా పలు రకాల ఆకృతులను రూపొందించడం, అన్నిటిలోకి అత్యున్నత ఆకృతి ఏంటని ఆలోచించడం, కొత్త వాచ్ డిజైన్ వెనుక ఉద్దేశాన్ని గుర్తించడం ఇలా ఎన్నో ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. వీటన్నిటి కలయికతోనే ఆకర్షణీయమైన ఆకృతికి ఆస్కారం. ‘టైమ్’.. టు ‘టీం’ వర్క్: వాస్తవానికి సృజనాత్మకతకు పెద్దపీట వేసే డిజైన్ కోణంలో పరిగణిస్తే.. వాచ్ డిజైన్‌లో ఇది మరింత ఆవశ్యకం. లక్షల మంది వినియోగదారులను ఆకర్షించేలా డిజైన్ చేసే విషయంలో టీం వర్క్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలో ఉత్పత్తి ఉద్దేశాన్ని వివరించడం, ఆలోచనను తెలపడం, సహచరులతో పరస్పర అభిప్రాయ సేకరణ, ఆలోచనను పంచుకోవడం, గ్రూప్ ప్రజెంటేషన్, ఇంటరాక్షన్ కోసం టీం వర్క్ తప్పనిసరి. తద్వారా కాన్సెప్ట్‌లను కుదించడం, టెక్నికల్ డ్రాయింగ్స్కు రూపమివ్వడం, వాటి మాతృకలను పరిశీలించి.. చివరికి ప్రస్తుత అవసరానికి అనువైన ఆకృతికి రూపమివ్వడం సాధ్యమవుతుంది. వృద్ధి బాటలో పరిశ్రమ: వాచ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 8 శాతం వార్షిక వృద్ధితో పురోగమిస్తోంది. దీంతో వాచ్ డిజైనింగ్ సృజనాత్మక కోణంలో అత్యున్నత విభాగంగా నిలుస్తోంది. వాచ్ డిజైనింగ్‌లో విధులు నిర్వర్తించే క్రమంలో సదరు వాచ్ భౌతిక పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని డయల్స్, స్ట్రాప్స్, కేస్ వంటి వాటిని రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రధానమైంది, ప్రాథమికమైంది లక్షిత వినియోగదారుల అభిరుచి, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవడం. పని వేళలు ఇలా: వాచ్ డిజైనర్ వృత్తి ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం అయిదు గంటలకు విధులు ముగిసే ఉద్యోగం కాదు. సృజనాత్మకత కీలకమైన డిజైనింగ్ విభాగంలో అనుక్షణం కొత్త ఆలోచనలను పదును పెట్టాల్సిందే. అంటే ఒకరకంగా ఇది 24ఁ7 తరహా ఉద్యోగంగానే భావించాలి. ఆఫీసులో ఉన్నా.. ఇంటి వద్ద ఉన్నా.. కొత్త ఆలోచన రాగానే దానికి పెన్ను, పేపర్‌తో ప్రాథమిక రూపమివ్వడం అనేది ప్రాధాన్యం. దాని ద్వారా భవిష్యత్తులో మంచి డిజైన్ల రూపకల్పనకు ఆస్కారం లభిస్తుంది. ఇక.. డిజైన్ ప్రజెంటేషన్స్; మీటింగ్స్, ఫ్యాక్టరీ విజిట్స్, కొత్త డిజైనర్లకు శిక్షణనివ్వడం, ఇతర డిజైనర్లతో కలిసి పని చేయడం; క్లయింట్లతో చర్చలు వంటివి సాధారణంగా ఒక రోజులో వాచ్ డిజైనర్ విధుల్లో భాగంగా ఉంటాయి. లక్షల్లో వేతనాలు: వాచ్ డిజైనర్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవల్ నుంచి డిజైన్ డెరైక్టర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. ప్రారంభంలో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వార్షిక వేతనం గ్యారంటీ. కొంత అనుభవం లభించాక సీనియర్ డిజైనర్‌గా రూ. 8 లక్షలు అందుకునేందుకు ఎన్నో అవకాశాలు. డిజైన్ మేనేజర్‌గా రూ. 16 లక్షల వార్షిక వేతనం పొందడం కూడా సాధ్యమే. కావల్సిన నైపుణ్యాలు: సృజనాత్మక సమయస్ఫూర్తి లక్ష్యంపై ఆసక్తి తగిన ఆకృతులు, ప్రమాణాలను గుర్తించే లక్షణం సాంకేతిక పరికరాలపై పరిజ్ఞానం చిన్నపాటి పరిమాణంలోని ఆకృతులను గుర్తించే లక్షణం నిరంతరం నేర్చుకోవాలనే అభిరుచి పరిశీలనాత్మక దృక్పథం వినియోగదారుల అవసరాలను గుర్తించడం సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం వాచ్ డిజైన్‌లో అడుగు పెట్టాలంటే: ఈ రంగంలో కెరీర్ కోరుకునే ఔత్సాహికులకు ముందుగా డిజైన్ ఆప్టిట్యూడ్ ఉండాలి. డిజైన్‌లో డిగ్రీ కచ్చితంగా దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, యాక్ససరీ డిజైన్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడం ఉపకరిస్తుంది. ప్రస్తుతం దేశంలోని ఎందరో వాచ్ డిజైనర్లు ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక డిజైన్‌లో పీజీ చేసి మరీ ఈ రంగంలో అడుగు పెడుతున్నారు. డిజైన్ కోర్సులు.. ప్రముఖ ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్- అహ్మదాబాద్ వెబ్సైట్: www.nid.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వెబ్సైట్: www.nift.ac.in క్రియేటివ్ అకాడెమీ-మిలాన్ వెబ్సైట్: www.creative-academy.com ఓయూలో లా కోర్సులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లా వివిధ లా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ లాస్ విభాగాలు: సైబర్ లాస్, టాక్సేషన్ ఆండ్ ఇన్సూరెన్స్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎంపిక: అక్టోబర్ 12న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ద్వారా. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. వెబ్సైట్:www.osmania.ac.in ఎన్ఐబీఎంలో పీజీ డిప్లొమా పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విభాగం: బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాలపరిమితి: రెండేళ్లు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 2014- క్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏలో అర్హత సాధించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 1 - జనవరి 31 వెబ్సైట్:www.nibmindia.org బార్కలో టెక్నీషియన్లు కల్పకంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఫెసిలిటీస్‌లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ - సి: 2, విభాగం: బాయిలర్ ఆపరేటర్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: సెప్టెంబర్ 19 వెబ్సైట్: http://www.barc.gov.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ గ్రూప్స్, సివిల్స్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలిపండి? - హెచ్. లహరి, కొత్తపేట జనరల్ సైన్స్ విభాగంలోని బయాలజీలో వృక్ష, జంతు వైవిధ్యం-వాటి లక్షణాలు; ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అదే విధంగా మానవ శరీర ధర్మశాస్త్రం; వ్యాధులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. గ్రూప్-1లో శరీర అవయవాలు- పని తీరు- వ్యాధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితమైన ప్రశ్నలూ కనిపిస్తున్నాయి. (ఉదా: ఇటీవల కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, అమల్లోకి వచ్చిన టీకాలు, మందులు, చికిత్స విధానాలు, నోబెల్ పురస్కారాలు-సంబంధిత పరిశోధనలు వంటివి). ఫిజిక్స్ ప్రశ్నలు అప్లైడ్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం ముఖ్యాంశాలుగా చదవాలి. రసాయన శాస్త్రానికి సంబంధించి సివిల్స్, గ్రూప్స్‌లో క్రమేణా ప్రాధాన్యం పెరుగుతోంది. నిత్య జీవితంలో మానవులు వినియోగించే పలు రసాయనాలు (ఉదా: కాస్మొటిక్స్, టాయిలెట్స్, ఫార్మాస్యూటికల్స్), ప్లాస్టిక్స్, పాలిమర్స్, కాంపొజిట్స్‌పై సమాచారం తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక ప్రత్యేకత, మూలకాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలతోపాటు గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. - సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్