ఉత్కంఠ భరితం
‘కోట’లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
క్రీడాకారులను పరిచయం చేసుకున్న డిప్యూటీసీఎం
నేటితో ముగియనున్న పోటీలు
సామర్లకోట :
సామర్లకోటలో జరుగుతున్న ఎన్టీఆర్ మెమోరియల్ 64వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పురుష, మహిళల జట్ల మధ్య వేర్వేరుగా ఫ్లడ్లైట్ల వెలుగులో పోటీలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ పోటీలను తిలకించారు. శుక్రవారం కర్నూలు– గుంటూరు మహిళల కబడ్డీ పోటీ ఆసక్తిగా సాగింది. ఇరు జట్లు 38 పాయింట్ల వంతున సాధించడంతో చెరో ఒక పాయింటు కేటాయించారు. పురుషుల విభాగంలో కడప 27 పాయింట్లు సాధించగా, తూర్పు గోదావరి 66 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కర్నూలు– పశ్చిమ గోదావరి జట్ల మధ్య జరిగిన పోటీలో పశ్చిమ 29 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు జట్టు శ్రీకాకుళం జట్టుపై రెండు పాయింట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నంపై ప్రకాశం జట్టు 44 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. నెల్లూరు జట్టు అనంతపురం జుట్టుపై 44 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. చిత్తూరు జట్టుపై విశాఖపట్నం 23 పాయింట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అనంతపురంపై కృష్ణా జట్టు 34 పాయింట్ల తేడా విజేతగా నిలిచింది. అదే విధంగా మహిళా విభాగంలో నెల్లూరు జట్టుపై తూర్పు గోదావరి జట్టు 43 పాయింట్ల తేడాతో, శ్రీకాకుళం జట్టు కడప పై 46 పాయింట్ల తేడాతో, ప్రకాశం జట్టు చిత్తూరుపై ఏడు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కృష్ణా జట్టు పశ్చిమ గోదావరిపై 24 పాయింట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసుకుంది. నెల్లూరుపై అనంతపురం 31 పాయింట్ల ఆధిక్యంతో, శ్రీకాకుళంపై విజయనగరం 31 పాయింట్ల తేడాతో, గుంటూరుపై విశాఖ పట్నం 27 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా అధ్యక్షుడు, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి బోగిళ్ల ముర ళీకుమార్, జాతీయ కోచ్ పోతుల సాయి, భారత మాత సేవా పరిషత్తు జిల్లా అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర, టీ డీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, జిల్లా వాణిజ్య విభాగపు కార్యదర్శి గుమెళ్ల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పంచా రామ క్షేత్ర ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌ న్సిలర్లు, జిల్లాలోని పీఈటీలు పాల్గొన్నారు.