శ్వాస స్లో అవుతోంది!
తాము అతిగా కష్టపడుతున్నాం, తీరికలేకుండా కష్టపడుతున్నాం అని చెప్పుకోవడానికి చాలామంది ‘ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాం’ అంటుంటారు. అయితే, అతిశయోక్తి కొద్దీ ఇలా చెబుతున్నా... కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తున్న వారి లో 80 శాతం మంది శ్వాస తీసుకోవడం మరచిపోతున్నారట! ప్రత్యేకించి ఇ-మెయిల్ లేదా ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు కంపోజ్ చేసేవారు పనిమీద దృష్టి పెట్టి శ్వాస తీర్చుకోవడాన్ని స్లో చేస్తున్నారట! దీనికే ‘ఇ మెయిల్ అప్నోయా’ అని పేరు పెట్టారు.
సాధారణంగా మనిషి నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకోవాలి. అయితే కంప్యూటర్లో కంపోజింగ్ వర్క్‌లో ఉన్నప్పుడు చాలామంది పూర్తిగా పనిమీదే దృష్టిపెట్టి తక్కువసార్లు శ్వాస తీసుకొంటున్నారు. దీని ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హృదయ స్పందనల మీద కూడా ఈ ప్రభావం ఉంటుందట. ఇలా శ్వాస తీసుకోవడం మందగించడం వల్ల ఆ ప్రభావం నరాలపై కూడా ఉంటుందట.
ప్రస్తుతం ప్రపంచంలో పీసీల ముందు పనిచేసే వారిలో ఏకంగా 80 శాతం మందిపై ఈమెయిల్ అప్నోయా ప్రభావం ఉంది. అయితే వారెవరికీ తాము తక్కువ శ్వాస తీసుకొంటున్నామన్న విషయం తెలియనే తెలియదట! మరి ఈ వ్యాధిబారిన పడ్డామా? అనే విషయాన్ని ఎవరికి వారు తాము టైపింగ్ చేస్తున్నప్పుడు పరిశీలించుకుని జాగ్రత్తగా శ్వాస తీసుకోవాలి!