విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం
విశాఖ: భారీ వర్షంతో పాటు, చిన్నపాటి నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు బలిగొన్నాయి. విశాఖ సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతరాత్రి భారీ వర్షం కురవటంతో గోడ కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరి గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పది అడుగుల లోతు ఉన్న...గుంతలో అయిదుగురు కార్మికులు పని చేస్తుండగా...ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలింది. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేష్, సోమేష్ గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు ఒడిశా వాసులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.