కంప్యూటర్ చిప్‌కు, గుండెకు ఒకే శక్తి!
వాషింగ్టన్: కంప్యూటర్ మెమరీ చిప్‌లు పనిచేయాలంటే విద్యుత్ కావాలి.. గుండె, ఊపిరితిత్తులు పనిచేసేందుకు జీవశక్తి కావాలి.. కానీ ఇవన్నీ కూడా ఒకే తరహా శక్తితో పనిచేస్తున్నాయని మీకు తెలుసా? గుండె, ఊపిరితిత్తులే కాదు.. జంతువుల శరీరంలో సంకోచ, వ్యాకోచాలు జరుపుతూనే ఉండే అవయవాలన్నీ ఆ తరహా శక్తితోనే పనిచేస్తాయని.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుడు జింగ్యూ లీ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.
సాధారణంగా కంప్యూటర్ తెరలు, మెమరీ చిప్‌లు, సెన్సర్లు ‘ఫెర్రో ఎలక్ట్రిక్ స్విచ్చింగ్’ విధానంలో పనిచేస్తాయి. అంటే విద్యుత్ క్షేత్రం ప్రసరించినప్పుడు ఫెర్రో పదార్థాల్లోని ధనావేశం రుణావేశంగా మారుతుంది. ఆ క్షేత్రం తొలగినప్పుడు తిరిగి ధనావేశంగా మారుతుంది. ఇదే తరహాలో జీవకణాల్లో ఉండే ఎలాస్టిన్ అనే ప్రొటీన్ కూడా విద్యుత్ క్షేత్రానికి అనుగుణంగా ధన, రుణావేశా స్థితుల్లోకి మారుతుందని తాము గుర్తించినట్లు జింగ్యూ లీ చెప్పారు.