సమైక్య తీర్మానంపై దద్దరిల్లిన సభలు
హైదరాబాద్ : ఎటువంటి కార్యకలాపాలు సాగకుండానే ఉభయ సభలూ రేపటికి వాయిదా పడ్డాయి. నినాదాలు, నిరసనల మధ్య అసెంబ్లీ శుక్రవారం ప్రారంభమైంది. సమావేశాలు ప్రారంభమైన కాగానే రాష్ట్ర విభజనను తిరస్కరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. మరోవైపు స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టారు.
సభను నడపకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు... ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్నికూడా అడ్డుకున్నారు. ప్రారంభమైన మూడు నిమిషాలకే అరగంట పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభమైన సభలోకూడా ఎటువంటి మార్పూ లేకపోవడంతో.. సభ మరో గంటపాటు వాయిదాపడింది.
ఆతర్వాత ముచ్చటగా మూడోసారి శనివారానికి అసెంబ్లీ వాయిదా పడింది. అటు శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సమైక్య తీర్మానంకోసం పట్టుబట్టిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడీయంను చుట్టుముట్టడంతో తొలుత అరగంటపాటు వాయిదాపడ్డ మండలి.. ఆతరువాత రేపటికి వాయిదా పడింది.