Vinesh Phogat: పట్టు వదలని పోరాటం..!
దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమె.. జీవితంలో అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొంది. అయితే అది రెజ్లింగ్ మ్యాట్‌పై కాదు.. ఢిల్లీ వీథుల్లో.. కొన్ని రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకోవడం.. పోలీసు దెబ్బలు, ఆపై అరెస్ట్, బహిరంగంగా అవమానాలు.. ఆన్లైన్లో చంపేస్తామనే బెదిరింపులు.. ప్రభుత్వ పెద్దల అబద్ధపు హామీలు.. జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, ఒక దశలో సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేయాల్సిన స్థితికి చేరడం.. ఇక కెరీర్ ముగిసినట్లే, రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చేసినట్లే అనిపించిన క్షణం.. ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడం వల్లే!సహచర మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు కారణమైన వ్యక్తిని తప్పించి తమకు న్యాయం చేయమని కోరడం వల్లే! కెరీర్‌ను పణంగా పెట్టి చేసిన ఆ పోరాటం వెంటనే సత్ఫలితాన్నివ్వలేదు. పైగా భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. మళ్లీ రెజ్లింగ్‌పై దృష్టి పెట్టింది. తీవ్ర గాయంతో ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా పట్టుదల వీడలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ పోరాడింది.ఆరు నెలలు ముగిసేలోగా తనేంటో నిరూపిస్తూ వరుస విజయాలు అందుకుంది. దాంతో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. ఇప్పటికే వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ పతకాలతో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న వినేశ్.. ఒలింపిక్స్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.రియో ఒలింపిక్స్‌లో గాయపడి..‘గాయాలు నాకు కొత్త కాదు. కెరీర్లో ఎన్నోసార్లు వాటితో ఇబ్బంది పడ్డాను. కానీ శస్త్ర చికిత్సలతో కోలుకొని మళ్లీ మ్యాట్‌పై అడుగు పెట్టగలిగాను. ఇప్పుడు తగిలిన గాయం మాత్రం చాలా పెద్దది. నేను కాలు విరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాననిపించింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగిపోయింది’ అంటూ ఢిల్లీ ఉదంతం తర్వాత కన్నీటితో వినేశ్ ఫొగాట్ చేసిన వ్యాఖ్య ఇది.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సహచరులు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లతో కలసి వినేశ్ నిరసన చేపట్టింది. అయితే బ్రిజ్‌భూషణ్ అధికార పార్టీ ఎంపీ కావడంతో వారికి ఆశించిన మద్దతు లభించలేదు. దానికి తోడు తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు.ఈ పోరాటం ముగిసిన తర్వాత మళ్లీ ఆటపై అడుగు పెట్టేందుకు చేసిన క్రమంలో విమర్శలు ఇంకా తీవ్రమయ్యాయి. సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరు కాకుండా తన సీనియారిటీని ఉపయోగించి అడ్డదారిలో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టీస్ కొనసాగించాల్సిన సమయంలో ఈ మనోవేదన. కానీ వినేశ్ బేలగా మారిపోలేదు. మరింత బలంగా నిలబడింది. గతంలోలాగే రెట్టింపు శ్రమించి మ్యాట్‌పైనే సత్తా చాటింది.2018 ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భం..రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చి..‘ఫొగాట్ సిస్టర్స్’.. అని వినగానే భారత క్రీడా, సినిమా అభిమానుల దృష్టిలో దంగల్ సినిమా కదలాడుతుంది. మాజీ రెజ్లర్, కోచ్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత విశేషాలతో ఆ సినిమా రూపొందింది. సినిమాలో ప్రధాన పాత్రలైన గీత, బబితలతో పాటు రీతూ, సంగీత కూడా మహావీర్ సింగ్ కూతుళ్లే. అతని సోదరుడైన రాజ్‌పాల్ ఫొగాట్ కూతురే వినేశ్. ఆమెకు ప్రియంకా అనే సోదరి కూడా ఉంది. తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి అనూహ్యంగా మరణించారు. ఆ తర్వాత పెదనాన్న వద్దే వినేశ్ కూడా రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. తన కజిన్ గీత కంటే వినేశ్ ఆరేళ్లు చిన్నది. గీత జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వస్తున్న దశలో వినేశ్ రెజ్లింగ్‌లోకి ప్రవేశించింది. అమ్మాయిలపై వివక్ష చూపించడంలో అగ్రస్థానంలో ఉండే హరియాణా రాష్ట్రంలో అందరిలాగే తాను కూడా ఈ ఆటలో ప్రవేశించే ముందు సూటిపోటి మాటలు ఎదుర్కొంది. కానీ పెదనాన్న అండతో వాటన్నంటినీ వెనక్కి తోసి రెజ్లింగ్‌లో తన పట్టును చూపించింది. జూనియర్, యూత్ స్థాయిలో వరుస విజయాలతో ఆపై వినేశ్ దూసుకుపోయింది. 2013లో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన యూత్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజతపతకం గెలుచుకోవడంతో వినేశ్ అందరి దృష్టిలో పడింది.సీనియర్ స్థాయిలో విజయాలతో..న్యూఢిల్లీలో 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 19 ఏళ్ల వినేశ్ మొదటిసారి అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. క్వార్టర్స్ వరకు చేరి అక్కడ ఓడినా.. రెపిచెజ్ రూపంలో మరో అవకాశం దక్కింది. ఇందులో థాయిలండ్ రెజ్లర్ శ్రీప్రపను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆమె సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఇది ఆరంభం మాత్రమే. వినేశ్ అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె మరో 3 కాంస్యాలు, 3 రజతాలు, ఒక స్వర్ణం గెలుచుకుంది. తన సోదరీమణులను దాటి వారికంటే మరిన్ని పెద్ద విజయాలతో వినేశ్ పైకి దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక మూడు ఈవెంట్లలో ఆమె పతకాలు గెలుచుకోవడం విశేషం. వరుసగా మూడు కామన్వెల్త్ (2014, 2018, 2022)క్రీడల్లో వినేశ్ స్వర్ణపతకాలు గెలుచుకుంది. ఆపై ఆసియా క్రీడల్లోనూ సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన ఆమె తర్వాతి క్రీడలకు (2018) వచ్చేసరికి స్వర్ణంతో మెరిసింది. ఇక 2019, 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో వినేశ్ గెలుచుకున్న కాంస్య పతకాలు ఆమె ఘనతను మరింత పెంచాయి.ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా..2016 రియో ఒలింపిక్స్‌లో జరిగిన ఘటన వినేశ్ కెరీర్లో ఒక్కసారిగా విషాదాన్ని తెచ్చింది. ఇస్తాంబుల్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో గెలిచి అమిత ఉత్సాహంతో ఆమె ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. చక్కటి ఆటతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. అయితే 21 ఏళ్ల వినేశ్ ఒలింపిక్స్ పతకం కలలు అక్కడే కల్లలయ్యాయి. చైనాకు చెందిన సున్ యానన్‌తో ఆమె ఈ మ్యాచ్‌లో తలపడింది. బౌట్ మధ్యలో ఆమె కుడి మోకాలుకు తీవ్ర గాయమైంది. ఆ బాధను తట్టుకోలేక ఆమె మ్యాట్‌పైనే ఏడ్చేసింది.స్ట్రెచర్‌పై వినేశ్‌ను బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ మరింత ప్రేరణ పొందింది. శస్త్రచికిత్స, ఆపై రీహాబిలిటేషన్ తర్వాత మళ్లీ బరిలోకి దిగి విజయాలు అందుకుంది. ఈ క్రమంలో 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది. అప్పుడే అద్భుత ఫామ్‌లో ఉన్న ఆమె టాప్ సీడ్‌గా అడుగు పెట్టింది.పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించి.., సర్జరీ తర్వాత..అయితే మరోసారి నిరాశను కలిగిస్తూ రెండో రౌండ్లో వెనుదిరిగింది. ఈ మెగా ఈవెంట్ వైఫల్యం తర్వాత జరిగిన ఘటనలు ఆమెను మానసికంగా మరింత కుంగిపోయేలా చేశాయి. ఓటమి తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు అంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ సస్పెన్షన్ విధించింది. టీమ్‌కి ఇచ్చిన యూనిఫామ్‌ను ధరించకుండా మరో లోగో వాడిందని, గేమ్స్ విలేజ్‌లో కాకుండా బయట ఉందని, భారత జట్టు సహచరులతో కలసి సాధన చేయలేదని ఆరోపణలు వచ్చాయి.అదృష్టవశాత్తు ఫెడరేషన్ కొద్ది రోజులకే సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టులో ఆమె మళ్లీ గాయపడింది. ఎడమ మోకాలుకు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయమైంది. దానికి మళ్లీ శస్త్ర చికిత్స, రీహాబిలిటేషన్.. ఆపై మ్యాట్‌పై పోరుకు సిద్ధమైంది. అన్నింటికి మించి ఒలింపిక్స్ కోసం వెయిట్ కేటగిరీ మారాల్సి రావడం ఆమెకు పెద్ద సవాల్ అయింది. సాధారణంగా రెజ్లింగ్‌లో వెయిట్ కేటగిరీ మారడం అంత సులువు కాదు. పైగా తక్కువకు మారడం మరీ కష్టం.ఆట ఆరంభంనుంచి ఆమె 53 కేజీల విభాగంలోనే పోటీ పడింది. అయితే వేర్వేరు కారణాలు, మరో ప్లేయర్ అదే కేటగిరీలో అర్హత సాధించడంతో తప్పనిసరిగా మారాల్సి వచ్చింది. తాను దేంట్లో అయినా నెగ్గగలననే పట్టుదలే మళ్లీ వినేశ్‌ను నడిపించింది. 50 కేజీల విభాగానికి మారి మరీ ఆమె పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇన్ని అవరోధాలను దాటి ఇక్కడి వరకు వచ్చిన వినేశ్ తన మూడో ప్రయత్నంలోనైనా ఒలింపిక్స్ పతకం గెలిచి తన కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది