మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కండి
ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో విద్యార్థులకు వక్తల పిలుపు
తిరుపతి కల్చరల్: విద్యారంగ పరిరక్షణకు విద్యార్థులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 80వ వార్షికోత్సవం బుధవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య జెండాను ఆవిష్కరించారు. మృతవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ కేఎస్.చలం సభను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడడంతో సేవా రంగాలు సైతం వ్యాపారంగా మారాయన్నారు. దీనికి విద్యారంగాన్ని ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. దీన్ని రక్షించుకునేందుకు విద్యార్థులు నడుం బిగించాలని కోరారు. ఎస్వీయూలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థి సంఘాలు అవసరం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్, కేరళ మాజీ మంత్రి, మాజీ ఏఐఎస్ఎఫ్ నేత బినయ్ విశ్వం, ఏఐఎస్ఎఫ్ జాతీయ గర్ల్స్ కన్వీనర్ కరమ్ వీర్ కౌర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లే ప్రభుత్వ విద్య నిర్వీర్యమవుతోందని, వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నడిపిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ఎమ్మార్ పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి.