దేవుని భయం విశ్వాసికి వరం
హంగరీ రాజైన లూయిస్‌కు దైవభీతి ఎక్కువ. చిన్న తప్పు చేయాలన్నా జంకేవాడు. అతని తమ్ముడైన ఫిలిప్దేమో విచ్చలవిడి జీవితం. దేవునికి అంత భయపడాలా? అంటూ అన్నను వెక్కిరించేవాడు. ఆ రోజుల్లో అర్ధరాత్రి ఎవరి ఇంటిముందైనా తలారి అంటే ఉరితీసే వ్యక్తి బాకా మోగిస్తే ఆ ఇంటి యజమానికి రాజుగారు ఉరిశిక్ష విధించారని అర్థం. అందువల్ల అంతా అర్ధరాత్రి బాకానాదానికి భయపడేవాళ్లు. ఒకరాత్రి ఫిలిప్ ఇంటిముందు బాకా మోగింది. అంతే! ఫిలిప్ భయంతో కుప్పకూలి, పిచ్చిపట్టినట్లు బిగ్గరగా ఏడ్వసాగాడు. తలారి అతన్ని ఉరికంబం ఎక్కిస్తే ఎదురుగా ఉన్న లూయిస్ రాజు ‘తలారి బాకా నాదానికే నువ్వంత భయపడితే, దేవదేవుని తీర్పు పీఠం ముందు నిలువడానికి మరెంత భయపడాలి?’ అని ప్రశ్నించి అతన్ని మందలించి ఇంటికి పంపేశాడు.
ఇశ్రాయేలీయుల చరిత్రలో 40 ఏళ్ల అరణ్యవాసం అత్యంత ప్రాముఖ్యమైనది. జగద్ రక్షకుడైన యేసుక్రీస్తును లోకానికి తీసుకురావడానికి దేవుని చెంత ప్రత్యేకించబడిన జనాంగంగా అక్కడే దేవుడు తన రాజ్యాంగాన్ని లేదా ధర్మాశాస్త్రాన్నిచ్చాడు. మానవ చరిత్రలో అదే మొదటి రాజ్యాంగం. ఆ తర్వాతే దాన్ననుసరించి రోమా ప్రభుత్వంతో సహా అన్ని రాజ్యాలూ తమ తమ రాజ్యాంగాలు రాసుకున్నాయి. అంటే మాతృరాజ్యాంగమన్నమాట. దేవుని భయంతో ఆ రాజ్యాంగాన్ని తు.చ తప్పకుండా పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని దేవుడు ఆదేశించాడు. పైగా ‘దేవుని భయం’ అన్ని పాపాలు, ఇబ్బందుల నుండి కాపాడుతుందని వారి నాయకుడు మోషే వివరించాడు (నిర్గమ 20:20).
దేవుణ్ణి ప్రేమించడం, ఆయనకు విధేయత చూపడం, భయపడటం అనే మూడు దశల్లో విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది, కష్టమైనది, కీలకమైనది మూడవదే. ఎందుకంటే ‘దేవుని భయం’అపారంగా సమకూరిన ఈ మూడవ దశలో విశ్వాసి అజేయుడవుతాడు. ఆశీర్వాదాల వరదలో తడుస్తాడు. అప్పుడు లోకమే అతని ముందు మోకరిల్లుతుంది. నలభై ఏళ్ల అరణ్యయాత్ర చివరి మజిలీగా ఇశ్రాయేలీయులు ఇప్పటి జోర్డన్ దేశమైన నాటి మోయాబుకు వచ్చారు.
అక్కడినుండి ఎడమకు తిరిగితే పాలు తేనెలు ప్రవహించే దేశమని దేవుడే చెప్పిన వాగ్దాన దేశమైన కనాను వెళ్తారు. కుడికి తిరిగితే చమురు నిక్షేపాలతో సుసంపన్నంగా ఉన్న ఇప్పటి సౌదీ అరేబియాకు వెళ్తారు. ‘మా మోషేగారు మమ్మల్ని ఎడమకుగాక కుడివైపుకు నడిపించి ఉంటే తేనెకు బదులు నూనె (చమురు) లభ్యమయ్యేది’ అని కొందరు యూదులు ఇప్పటికీ వాపోతారు. ఎంత చమురున్నా అది వచ్చే ఇరవై ఏళ్లలో అడుగంటిపోయే నిక్షేపం. కాని ఎన్నటికీ తరగడం కాదు, నానాటికీ వృద్ధి చెందే అత్యంత అమూల్యమైన ‘దైవభయం’ అనే నిక్షేపాన్ని దేవుడు కనానులో ఇశ్రాయేలీయులకిచ్చాడు.
అందుకే చమురు లేకున్నా, శ్రీలంకలో మూడోవంతు మాత్రమే ఉన్న అతి చిన్న దేశమైనా, ఇజ్రాయెల్ ప్రపంచ రాజకీయాలను, అర్థిక వ్యవస్థలను కూడా శాసిస్తోంది. దేవుడే వారినుద్దేశించి ‘యొహోవా భయము వారికి ఐశ్వర్యము’ అన్నాడు (యెషయా 33:6). కొత్త నిబంధన కాలపు ఇశ్రాయేలీయులైన మన జీవితాల్లో, కుటుంబాల్లో, చర్చిల్లో కూడా ‘దేవుని భయం’ అనే పరిమళం నిండి ఉంటే అదెంత భాగ్యం? అది లేకపోతే ఎంత దౌర్భాగ్యం? జ్ఞానానికే కాదు, ఐశ్వర్యానికి కూడా దేవుని భయమే కారణమని దేవుడు చెబితే, ఇంకా లోకైశ్వర్యాలకే పాకులాడటం ఎంత అవివేకం?
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
హితవాక్యం: రక్షణ కేవలం పాప విముక్తి మాత్రమే కాదు. దైవిక రాజ్యాంగం అమలులో ఉన్న ఒకకొత్త లోకంలో ఆ రాజ్యాంగానికి భయంతో, విధేయతతో జీవిస్తూ శాంతిని, పరమానందాన్ని సంపూర్ణంగా అనుభవించడం.
- ఆస్వాల్డ్ చేంబర్స్