చెన్నై భవనం ఎందుకు కూలింది?
జానెడు పొట్ట నింపుకోడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి కూలి పనులు చేసుకుంటున్న 61 మంది అసువులు బాశారు. మరో 27 మంది గాయపడ్డారు. వారం రోజుల పాటు 'ఆపరేషన్ రక్ష' పేరిట శిథిలాల తొలగింపు చేపట్టి.. ఎట్టకేలకు మృతదేహాలను, బతికున్నవారిని బయటకు తీశారు. అయితే.. 11 అంతస్థులతో చేపట్టిన ఈ భారీ నిర్మాణంలో అడుగడుగునా లొసుగులే ఉన్నాయి. భవన నిర్మాణ నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని నిపుణులు తేల్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్)తో పాటు.. ఐఐటీ మద్రాస్ నుంచి కూడా నిపుణులు ఈ భవన నిర్మాణంలో వాడిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి.. నిజాన్ని నిగ్గుతేల్చారు.
ఈ భవనం దుర్ఘటనలో మరణించిన 61 మందిలో 51 మంది తెలుగువాళ్లే. అందులోనూ ఎక్కువగా విజయనగరం జిల్లాకు చెందిన వలస కూలీలే ఉన్నారు. అత్యంత నాసిరకమైన సామగ్రిని ఉపయోగించి, ఏమాత్రం బరువు భరించలేని బీమ్‌లు, కాలమ్‌లతో ఈ భవనాన్ని కట్టారని, నిర్మాణ ప్రమాణాల పరంగా చూస్తే ఇది అత్యంత ఘోరమైనదని నిపుణులు చెప్పారు.
శ్లాబులన్నీ ఒకదానిమీద ఒకటి పడిపోయాయని, కాలమ్‌లు కూడా పూర్తిగా పడిపోయాయని, పైన, కింద, అన్నివైపులా ఇందులోనిర్మాణ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయని క్రెడాయ్ చైర్మన్ డాక్టర్ ఆర్.కుమార్ తెలిపారు. చెన్నై వెలుపల గల పోరూరు చెరువుకు ఈ భవనం కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. అయినా సాయిల్ టెస్టింగ్ లాంటివి ఏవీ సరిగా చేయకపోవడం వల్ల భవనం భూమిలోకి కూరుకుపోయింది. ఈ ప్రాంతమంతా చెరువుకు పరివాహక ప్రాంతంగా ఉండటంతో చిత్తడినేలగానే ఉంది. భవన ప్రమోటర్లు సహా ఆరుగురిని ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే బిల్డర్లు మాత్రం తమ లోపం ఏమీ లేదని.. పిడుగుపాటు వల్లే భవనం కూలిందని వాదిస్తున్నారు.