ఏజెన్సీలకు రూ. కోట్ల నామినేషన్లు
=జీహెచ్ఎంసీ తీరుపై సభ్యుల మండిపాటు
=ఈ అంశంపైనే గంటసేపు దుమారం
సాక్షి, సిటీబ్యూరో : దాదాపు రూ. 20 వేల విలువైన క్యాచ్‌పిట్ పనులకు సైతం టెండర్లు పిలిచే జీహెచ్ఎంసీ అధికారులు.. లక్షలు, కోట్ల రూపాయల పనుల్ని కన్సల్టెంట్ ఏజెన్సీలకు నామినేషన్లపై కట్టబెట్టడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్‌లో లేకున్నా లక్షలాది రూపాయలు నామినేషన్లపై ఎలా ఇస్తున్నారంటూ వెల్లువెత్తిన ప్రశ్నలతో సమాధానం చెప్పలేని అధికారులు నీళ్లు నమిలారు. లక్షలాది రూపాయలు ఫీజులుగా తీసుకుంటున్న కన్సల్టెంట్లు భవిష్యత్తులో జీహెచ్ఎంసీని శాసించేలా ఉన్నార ని మండిపడ్డారు.
లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్నా వారిచ్చే నివేదికలు తప్పుల తడకలని దుయ్యబడుతూ, వందగజాల స్థలంలో ఇంటి విస్తీర్ణం 10వేల చదరపు అడుగులంటూ ఒక ఏజెన్సీ నివేదిక ఇవ్వడాన్ని ప్రస్తావించారు. గూగుల్‌మ్యాప్ ద్వారా ఆ వివరాలనడంతో.. తిరిగి మన అధికారులే సర్వే చేయాల్సి వచ్చిందన్నారు. మన వద్ద నిపుణులైన ఇంజినీర్లు లేరా.. ? ఎందుకు వారికి కట్టబెడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు మహేశ్‌యాదవ్ ఈ అంశాన్ని లేవనెత్తగా కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్డి రాంబాబు, జుల్ఫీక ర్ అలీ(ఎంఐఎం), జితేందర్(బీజేపీ), నజీరుద్దీన్(ఎంఐఎం) తదితరులు అధికారుల తీరును తూర్పారబట్టారు.
వైఎస్సార్ కౌన్సిల్‌హాల్ డిజైన్ కోసం ఇప్పటికి మూడు ఏజెన్సీలకు రూ. 25 లక్షలు ఖర్చు చేశారని, శంకుస్థాపన తప్ప పని మాత్రం ప్రారంభం కాలేద న్నారు. చివరకు రోడ్లు, తదితర పనులను సైతం కన్సల్టెంట్స్‌కు ఇస్తున్నారంటూ.. మన ఇంజినీర్లు చేస్తున్న పనేమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈఎన్సీ ధన్సింగ్ మాట్లాడుతూ.. ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ వంటి సంస్థలు కూడా ఏజన్సీలకిస్తున్నాయన్నారు. వాటికి పాలకమండలి, చట్టం అనేవి లేవని, స్టాండింగ్ కమిటీ, జనరల్‌బాడీ ఆమోదం లేకుండా పనులెలా కట్టబెడతారని జుల్ఫీకర్అలీ ప్రశ్నించారు. రూ. 8 కోట్లకు పైగా ఏజెన్సీలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు.
కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పందిస్తూ.. జీహెచ్ఎంసీలో తగినంతమంది ఇంజినీర్లు లేనందున ఉన్నవారికి నిర్వహణ పనులతోనే సరిపోతోందన్నారు. ఆర్ఓబీ, ఆర్యూబీల వంటి ప్రత్యేక పనులకు నిపుణులు లేనందున కన్సల్టెంట్ల సేవలు తీసుకుంటున్నారన్నారు. ఆయా అంశాల్లో నిపుణులైన ఇంజనీర్లను జీహెచ్ఎంసీలో నియమించాల్సి ఉందన్నారు. అన్ని అంశాలపై 15 రోజుల్లోగా తగిన నివేదిక సమర్పిస్తామని హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి సమగ్ర నివేదికను తదుపరి స్టాండింగ్ కమిటీ ముందుంచాల్సిందిగా మేయర్ ఆదేశించారు.
ప్రైవేటు కన్సల్టెంట్ ఏజెన్సీల అవసరం.. ఇంతవరకు వాటికిచ్చిన ప్రాజెక్టుల పనులు.. చేసిన వ్యయం తదితర అంశాలపై నివేదిక నివ్వాల్సిందిగా తీర్మానం చేశారు. అలాగే అక్రమంగా వెలసిన ప్లాస్టిక్ ఉత్పత్తి సంస్థలపై, జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి నూనె తీస్తున్నవారిపై కఠినచర్యలకు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అంతకుముందు మాదాపూర్ సాయినగర్‌లో సివరేజి పనులు ఎంతోకాలంగా పూర్తికాకపోవడంపై కాంగ్రెస్ సభ్యుడు జగదీశ్వర్‌గౌడ్, కల్తీనూనెలు వినియోగిస్తున్న హోటళ్లపై చర్యలు లేకపోవడంపై బంగారిప్రకాశ్(బీజేపీ)లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.