contract agencies
-
ఆగని.. అవుట్ సోర్సింగ్ దందా!
సాక్షి, నల్లగొండ: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా ఏళ్ల తరబడిగా కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నెలకు రూ.10వేల జీతం వచ్చే అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకుపైనే వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అంతోఇంతో అదనపు ఆదాయం ఉంటుందని భావిస్తున్న శాఖల్లో అయితే వసూళ్ల రేటు పెద్దగానే ఉంటుంది. ఈ ఉద్యోగాల విషయంలో డబ్బుల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఏజెన్సీ నిర్వాహకుడు వసూళ్ల దందాకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. వాస్తవమేనని తేలడంతో ఆగ్రహించిన కలెక్టర్ వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఆ ఏజెన్సీ నిర్వాహకుడిని ఆదేశించారని తెలిసింది. దీంతో పాటు ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారని సమాచారం. పనిచేస్తున్న వారినుంచే వసూళ్లు ఈ పోస్టులకు సంబంధించి కొందరు ఇప్పటికే ఆ శాఖలో రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు. వారంతా తమనే అవుట్ సోర్సింగ్ పద్ధతిన తీసుకోవాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వారినుంచే ఏజెన్సీ డబ్బులు వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం భువనగిరి, సూర్యాపేటలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన 24 పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చాయి. నల్లగొండ, సూర్యాపేటలో ఒకే ఏజెన్సీకి ఉద్యోగులను సమకూర్చే కాంట్రాక్ట్ దక్కింది. యాదాద్రి జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కలెక్టర్ మిగిలిన జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. నల్లగొండలో ఉన్న ఏడు పోస్టులకు సంబంధించి నలుగురినుంచి ఒక ఏజెన్సీ నిర్వహకుడు రూ.75వేల చొప్పున రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బాధితుల పక్షాన నల్లగొండ శాసనసభ్యుడికి ఫిర్యాదు అందడంతో ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారని చెబుతున్నారు. దీంతో కలెక్టర్ విచారణ చేపట్టారు. నలుగురినుంచి ఏజెన్సీ నిర్వాహకుడు డబ్బులు వసూలు చేశాడని తేలడంతో కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సదరు నిర్వాహకుడిని పిలిపించి బాధితులకు డబ్బులు తిరిగివ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏజెన్సీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి ..దందా జిల్లాలో కొన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా కాంట్రాక్టర్ ప్రభుత్వం అడిగిన సిబ్బందిని వారి క్వాలిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వ శాఖలకు పంపించాల్సి ఉంది. ఈ సందర్భంలో వారినుంచి ఎలాంటి డబ్బులూ వసూలు చేయరాదు. కానీ ప్రస్తుతం పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య ఏజెన్సీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ అవకాశంతో కొందరు ఏజెన్సీల నిర్వాహకులు రూ.కోట్లకు పడగలెత్తారు. కొందరు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఏజెన్సీ దక్కించుకుంటుండగా మరికొందరు ప్రజాప్రతినిధుల ద్వారా ఏజెన్సీలు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి వసూళ్ల దందా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సంవత్సరంపైగా ఉచితంగా పనిచేయాల్సిందేనా.. రూ.15వేలు వచ్చే అవుట్ సోర్సింగ్ పోస్టుకు రూ.2లక్షలు వసూలు చేస్తున్నారంటే దాదాపు సంవత్సరం పైగానే వారు ఉచితంగా పనిచేయాల్సి వస్తున్నట్టే. అదనపు సంపాదన ఉం టుందని భావించే శాఖల్లో ఉద్యోగమైతే.. ఒక పోస్టుకు రూ.3లక్షల పైనే వసూలు చేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కొందరు నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు లేని వారికి అన్ని అర్హతులు ఉండీ అవకాశం దొరకని పరిస్థితి. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు అర్హతలు లేకున్నా బోగస్ సర్టిఫికెట్లు సృష్టించి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మెడికల్ కళాశాలలోనూ వసూళ్ల దందా..! జిల్లా మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టులు మంజూరు కావడంతో ఏజెన్సీల దందా మొదలైంది. ఇప్పటికీ ఏజెన్సీలను ఫైనల్ చేయలేదు. కానీ కొందరు నిర్వాహకులు మాత్రం మెడికల్ కళాశాలల్లో ఉద్యోగాల పేర డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వసూలు దారుల్లో గుబులు మొదలైంది. పోలీసులు కూడా వారి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఇదే పరిస్థితిలో రిజిస్ట్రేషన్ శాఖలో ఏజెన్సీ నిర్వాహకుడు అభ్యర్థుల నుంచి వసూళ్ల దందా బయటపడింది. బాధితులకు తిరిగి డబ్బు ఇప్పించడం ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో గుబులు రేపుతోంది. కలెక్టర్ సీరియస్‌తో అడ్డం తిరిగిన కథ ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ నిర్వాహకుడు కూడా డబ్బులు వసూలు చేసి తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి శాసనసభ్యుడి ఫిర్యాదు, కలెక్టర్ విచారణతో బట్టబయలై వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించడంతో ఏజెన్సీల్లో కలవరం మొదలైంది. ఇదే క్రమంలో గతంలో భర్తీ చేసిన ఉద్యోగాలపై కూడా విచారణ చేయాలన్న డిమాండ్ కొన్ని ఏజెన్సీలనుంచే వ్యక్తమవుతోంది. -
ఏపీ విద్యాశాఖ వింత పోకడలపై సర్వత్రా విమర్శలు
-
పాలమూరు పనులపై ‘బండరాయి’!
కోటి క్యూబిక్ మీటర్ల మేర హార్డ్‌రాక్ {పధాన ప్యాకేజీ పనులన్నింటిలో ఇదే సమస్య ముందుకు కదలని పనులు జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలు అభ్యంతరం చెబుతున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పనుల పురోగతికి బండరాళ్ల సమస్య గుదిబండగా మారింది. ప్రాజెక్టుల్లో ప్రధాన ప్యాకేజీల పనులన్నింటిలోనూ భారీగా బండరాయి(హార్డ్‌రాక్) అడ్డు తగులుతుండటంతో పనులు ముందుకు కదలడం లేదు. మొత్తం 18 ప్యాకేజీలకుగానూ 8 ప్యాకేజీల్లో ఇదే తరహా హార్డ్‌రాక్ ఉండటంతో వీటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ చేస్తున్నా.. పోలీస్ శాఖ నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులుతలలు పట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడ బండరాళ్లు..? ఇప్పటికే టెండర్లు, అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని 18 ప్యాకేజీల్లో మూడు, నాలుగు ప్యాకేజీలు మినహా అన్నింటా పనులు ఆరంభమయ్యాయి. మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులను కాంట్రాక్టు సంస్థలు ఆరంభించాయి. అయితే రిజర్వాయర్లు నిర్మించే చోట వదిలేస్తే టన్నెల్స్, పంప్‌హౌజ్‌లు నిర్మించే ప్రాంతంలో హార్డ్‌రాక్ సమస్య ఎక్కువగా ఉంది. ప్యాకేజీ-1లోని స్టేజ్-1 పంప్‌హౌజ్, ప్యాకేజీ-3లోని నార్లాపూర్ కాల్వలు, ప్యాకేజీ-4లోని టన్నెల్, ప్యాకేజీ-5లోని స్టేజ్-2 టన్నెల్, ప్యాకేజీ-8లోని స్టేజీ-3 పంప్‌హౌజ్, ప్యాకేజీ-12లోని వట్టెం రిజర్వాయర్ కాల్వ, ప్యాకేజీ-16లోని స్టేజ్-4 పంపింగ్ స్టేషన్ పరిధిలో ఈ బండరాళ్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా ఈ 8 ప్యాకేజీల పరిధిలో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల హార్డ్‌రాక్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసులు పెడుతున్న పోలీసులు హార్డ్‌రాక్‌ను బద్దలు కొట్టే బాధ్యత పూర్తిగా కాంట్రాక్టు ఏజెన్సీలపైనే ఉంది. పగులగొట్టే రాయితోనే కాంట్రాక్టు సంస్థలు దాన్ని కంకరగా మార్చి కాంక్రీట్ నిర్మాణాల్లో వాడాలి. అవసరానికి మించి ఉంటే మైనింగ్ శాఖ ద్వారా వేలం వేయాలి. అయితే హార్డ్‌రాక్‌ను పగులగొట్టడం కష్టం కావడంతో కాంట్రాక్టు ఏజెన్సీలు జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేస్తున్నాయి. ప్యాకేజీ-12లోని వట్టెం రిజర్వాయర్ పరిధిలో ఇలా బ్లాస్టింగ్ చేయడంతో ఇటీవలే సంబంధిత ఏజెన్సీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పేల్చివేత కోసం పూణేలోని బ్లాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉన్నా.. అలాంటివేవీ లేనందున కేసులు నమోదు చేస్తున్నామని పోలీసు శాఖ చెబుతోంది. పోలీసు కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్యాకేజీ 28 విషయమై నీటి పారుదల శాఖ అధికారులకు, డీజీపీకి లేఖ రాశారు. పనులు త్వరితగతిన జరగాలంటే బ్లాస్టింగ్స్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇందుకు తమకు బ్లాస్టింగ్ లెసైన్స్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. అయితే మిగతా ప్యాకేజీల పరిధిలోనూ ఇలాంటి సమస్యే ఉన్నందున అన్నింటినీ కలిపి ఒకేమారు పంపాలని, వాటన్నింటికీ ఒకేసారి అనుమతులిస్తామని పోలీసు శాఖ తెలిపినట్లుగా సమాచారం. మైనింగ్తోనూ సమన్వయం ప్రాజెక్టు పరిధిలో తవ్వకం ద్వారా వచ్చే హార్డ్‌రాక్‌ను తమ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన దాన్ని తరలించడం సైతం ఇరిగేషన్ శాఖకు తలకు మించిన భారంగా మారనుంది. ఈ దృష్ట్యానే హార్డ్‌రాక్‌ను వేలం వేసి దాన్ని తరలించాల్సిన బాధ్యత మైనింగ్ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే ఈ విధానం ఉందని, టన్నెళ్లు, పంప్‌హౌజ్‌ల చోట తవ్వే హార్డ్రాక్ని తీసుకెళ్లడం అంత సులువు కాకపోవడం, దీని వేలానికి పెద్దగా స్పందన ఉండదన్న భావనతోనే మైనింగ్ శాఖ ముందుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే నీటి పారుదల శాఖ అప్రమత్తం కావాలని, మైనింగ్ శాఖతోనూ సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.