ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా!  | Agencies Are Exploiting Unemployed In The Name Of Jobs | Sakshi
Sakshi News home page

ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా! 

Published Thu, Sep 5 2019 10:08 AM | Last Updated on Thu, Sep 5 2019 10:08 AM

Agencies Are Exploiting Unemployed In The Name Of Jobs - Sakshi

సాక్షి, నల్లగొండ: అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల దందా ఏళ్ల తరబడిగా కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నెలకు రూ.10వేల జీతం వచ్చే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగానికి రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకుపైనే వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అంతోఇంతో అదనపు ఆదాయం ఉంటుందని భావిస్తున్న శాఖల్లో అయితే వసూళ్ల రేటు పెద్దగానే ఉంటుంది. ఈ ఉద్యోగాల విషయంలో డబ్బుల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తాజాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఏజెన్సీ నిర్వాహకుడు వసూళ్ల దందాకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు. వాస్తవమేనని తేలడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఆ ఏజెన్సీ నిర్వాహకుడిని ఆదేశించారని తెలిసింది. దీంతో పాటు ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారని సమాచారం. 

పనిచేస్తున్న వారినుంచే వసూళ్లు
ఈ పోస్టులకు సంబంధించి కొందరు ఇప్పటికే ఆ శాఖలో రోజువారీ వేతనంపై  పనిచేస్తున్నారు. వారంతా తమనే అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన తీసుకోవాలని అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వారినుంచే ఏజెన్సీ డబ్బులు వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం భువనగిరి, సూర్యాపేటలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 

ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన 24 పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చాయి. నల్లగొండ, సూర్యాపేటలో ఒకే ఏజెన్సీకి  ఉద్యోగులను సమకూర్చే కాంట్రాక్ట్‌  దక్కింది. యాదాద్రి జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కలెక్టర్‌ మిగిలిన జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. నల్లగొండలో ఉన్న ఏడు పోస్టులకు సంబంధించి నలుగురినుంచి 

ఒక ఏజెన్సీ నిర్వహకుడు రూ.75వేల చొప్పున రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బాధితుల పక్షాన నల్లగొండ శాసనసభ్యుడికి ఫిర్యాదు అందడంతో ఆయన కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారని చెబుతున్నారు. దీంతో కలెక్టర్‌ విచారణ చేపట్టారు. నలుగురినుంచి ఏజెన్సీ నిర్వాహకుడు డబ్బులు వసూలు చేశాడని తేలడంతో కలెక్టర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సదరు నిర్వాహకుడిని పిలిపించి బాధితులకు డబ్బులు తిరిగివ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏజెన్సీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని  సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. 

ఏళ్ల తరబడి ..దందా 
జిల్లాలో కొన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల దందా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా కాంట్రాక్టర్‌ ప్రభుత్వం అడిగిన సిబ్బందిని వారి క్వాలిఫికేషన్‌ ఆధారంగా ప్రభుత్వ శాఖలకు పంపించాల్సి ఉంది. ఈ సందర్భంలో వారినుంచి ఎలాంటి డబ్బులూ వసూలు చేయరాదు. కానీ ప్రస్తుతం పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య ఏజెన్సీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ అవకాశంతో కొందరు ఏజెన్సీల నిర్వాహకులు రూ.కోట్లకు పడగలెత్తారు. కొందరు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఏజెన్సీ దక్కించుకుంటుండగా మరికొందరు ప్రజాప్రతినిధుల ద్వారా ఏజెన్సీలు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి వసూళ్ల దందా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. 

సంవత్సరంపైగా ఉచితంగా పనిచేయాల్సిందేనా..
రూ.15వేలు వచ్చే అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుకు రూ.2లక్షలు వసూలు చేస్తున్నారంటే  దాదాపు సంవత్సరం పైగానే వారు ఉచితంగా  పనిచేయాల్సి వస్తున్నట్టే. అదనపు సంపాదన ఉం టుందని భావించే శాఖల్లో ఉద్యోగమైతే.. ఒక పోస్టుకు రూ.3లక్షల పైనే వసూలు చేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కొందరు  నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు లేని వారికి అన్ని అర్హతులు ఉండీ అవకాశం దొరకని పరిస్థితి. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు అర్హతలు లేకున్నా బోగస్‌ సర్టిఫికెట్లు సృష్టించి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

మెడికల్‌ కళాశాలలోనూ వసూళ్ల దందా..!
జిల్లా మెడికల్‌ కళాశాలలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పోస్టులు మంజూరు కావడంతో ఏజెన్సీల దందా మొదలైంది. ఇప్పటికీ ఏజెన్సీలను ఫైనల్‌ చేయలేదు. కానీ కొందరు నిర్వాహకులు మాత్రం మెడికల్‌ కళాశాలల్లో ఉద్యోగాల పేర డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంపై  ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వసూలు దారుల్లో గుబులు మొదలైంది. పోలీసులు కూడా వారి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఇదే పరిస్థితిలో రిజిస్ట్రేషన్‌ శాఖలో ఏజెన్సీ నిర్వాహకుడు అభ్యర్థుల నుంచి వసూళ్ల దందా బయటపడింది. బాధితులకు తిరిగి డబ్బు ఇప్పించడం ఇప్పుడు అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల్లో గుబులు రేపుతోంది. 

కలెక్టర్‌ సీరియస్‌తో అడ్డం తిరిగిన కథ
ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ నిర్వాహకుడు కూడా డబ్బులు వసూలు చేసి తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి శాసనసభ్యుడి ఫిర్యాదు, కలెక్టర్‌ విచారణతో బట్టబయలై వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించడంతో ఏజెన్సీల్లో కలవరం మొదలైంది. ఇదే క్రమంలో గతంలో భర్తీ చేసిన ఉద్యోగాలపై కూడా విచారణ చేయాలన్న డిమాండ్‌ కొన్ని ఏజెన్సీలనుంచే వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement