పాలమూరు పనులపై ‘బండరాయి’! | rock stopped works of palamooru project | Sakshi
Sakshi News home page

పాలమూరు పనులపై ‘బండరాయి’!

Published Fri, Jun 17 2016 2:19 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

పాలమూరు పనులపై ‘బండరాయి’! - Sakshi

పాలమూరు పనులపై ‘బండరాయి’!

  • కోటి క్యూబిక్ మీటర్ల మేర హార్డ్‌రాక్
  • {పధాన ప్యాకేజీ పనులన్నింటిలో ఇదే సమస్య
  • ముందుకు కదలని పనులు
  • జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్ చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలు
  • అభ్యంతరం చెబుతున్న పోలీసులు
  •  

     సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పనుల పురోగతికి బండరాళ్ల సమస్య గుదిబండగా మారింది. ప్రాజెక్టుల్లో ప్రధాన ప్యాకేజీల పనులన్నింటిలోనూ భారీగా బండరాయి(హార్డ్‌రాక్) అడ్డు తగులుతుండటంతో పనులు ముందుకు కదలడం లేదు. మొత్తం 18 ప్యాకేజీలకుగానూ 8 ప్యాకేజీల్లో ఇదే తరహా హార్డ్‌రాక్ ఉండటంతో వీటిని పగులగొట్టేందుకు బ్లాస్టింగ్ చేస్తున్నా.. పోలీస్ శాఖ నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులుతలలు పట్టుకుంటున్నారు.

     

     ఎక్కడెక్కడ బండరాళ్లు..?
    ఇప్పటికే టెండర్లు, అగ్రిమెంట్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని 18 ప్యాకేజీల్లో మూడు, నాలుగు ప్యాకేజీలు మినహా అన్నింటా పనులు ఆరంభమయ్యాయి. మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులను కాంట్రాక్టు సంస్థలు ఆరంభించాయి. అయితే రిజర్వాయర్లు నిర్మించే చోట వదిలేస్తే టన్నెల్స్, పంప్‌హౌజ్‌లు నిర్మించే ప్రాంతంలో హార్డ్‌రాక్ సమస్య ఎక్కువగా ఉంది. ప్యాకేజీ-1లోని స్టేజ్-1 పంప్‌హౌజ్, ప్యాకేజీ-3లోని నార్లాపూర్ కాల్వలు, ప్యాకేజీ-4లోని టన్నెల్, ప్యాకేజీ-5లోని స్టేజ్-2 టన్నెల్, ప్యాకేజీ-8లోని స్టేజీ-3 పంప్‌హౌజ్, ప్యాకేజీ-12లోని వట్టెం రిజర్వాయర్ కాల్వ, ప్యాకేజీ-16లోని స్టేజ్-4 పంపింగ్ స్టేషన్ పరిధిలో ఈ బండరాళ్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా ఈ 8 ప్యాకేజీల పరిధిలో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల హార్డ్‌రాక్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    కేసులు పెడుతున్న పోలీసులు
    హార్డ్‌రాక్‌ను బద్దలు కొట్టే బాధ్యత పూర్తిగా కాంట్రాక్టు ఏజెన్సీలపైనే ఉంది. పగులగొట్టే రాయితోనే కాంట్రాక్టు సంస్థలు దాన్ని కంకరగా మార్చి కాంక్రీట్ నిర్మాణాల్లో వాడాలి. అవసరానికి మించి ఉంటే మైనింగ్ శాఖ ద్వారా వేలం వేయాలి. అయితే హార్డ్‌రాక్‌ను పగులగొట్టడం కష్టం కావడంతో కాంట్రాక్టు ఏజెన్సీలు జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేస్తున్నాయి. ప్యాకేజీ-12లోని వట్టెం రిజర్వాయర్ పరిధిలో ఇలా బ్లాస్టింగ్ చేయడంతో ఇటీవలే సంబంధిత ఏజెన్సీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పేల్చివేత కోసం పూణేలోని బ్లాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉన్నా.. అలాంటివేవీ లేనందున కేసులు నమోదు చేస్తున్నామని పోలీసు శాఖ చెబుతోంది. పోలీసు కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్యాకేజీ 28 విషయమై నీటి పారుదల శాఖ అధికారులకు, డీజీపీకి లేఖ రాశారు.  పనులు త్వరితగతిన జరగాలంటే బ్లాస్టింగ్స్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇందుకు తమకు బ్లాస్టింగ్ లెసైన్స్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. అయితే మిగతా ప్యాకేజీల పరిధిలోనూ ఇలాంటి సమస్యే ఉన్నందున అన్నింటినీ కలిపి ఒకేమారు పంపాలని, వాటన్నింటికీ ఒకేసారి అనుమతులిస్తామని పోలీసు శాఖ తెలిపినట్లుగా సమాచారం.

    మైనింగ్‌తోనూ సమన్వయం
      ప్రాజెక్టు పరిధిలో తవ్వకం ద్వారా వచ్చే హార్డ్‌రాక్‌ను తమ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన దాన్ని తరలించడం సైతం ఇరిగేషన్ శాఖకు తలకు మించిన భారంగా మారనుంది. ఈ దృష్ట్యానే హార్డ్‌రాక్‌ను వేలం వేసి దాన్ని తరలించాల్సిన బాధ్యత మైనింగ్ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర  ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే ఈ విధానం ఉందని, టన్నెళ్లు, పంప్‌హౌజ్‌ల చోట తవ్వే హార్డ్‌రాక్‌ని తీసుకెళ్లడం అంత సులువు కాకపోవడం, దీని వేలానికి పెద్దగా స్పందన ఉండదన్న భావనతోనే మైనింగ్ శాఖ ముందుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే నీటి పారుదల శాఖ అప్రమత్తం కావాలని, మైనింగ్ శాఖతోనూ సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement