Contract Agency
-
సచివాలయంలో 3 లక్షల ఎలుకలు...!
ముంబై : సచివాలయంలో మూడు లక్షల ఎలుకలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవాల్సిందే.. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలుకలపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపారు. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్ సంస్థ చెప్పడంతో వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఖడ్సే తెలిపారు. అసలు మంత్రాలయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత మంది పని చేస్తున్నారు, ఆ స్థాయిలో అసలు ఎలుకలు ఉన్నాయా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో కాంట్రక్ట్ సంస్థపై మండిపడ్డారు. అలాగైతే రోజుకి ఎన్ని ఎలుకలు చంపారు, ఏ విధంగా చంపారు, చంపిన ఎలుకలను ఎక్కడికి తరలించారో తెలపాలని సదురు సంస్థను ప్రశ్నించారు. సరాసరి రోజుకు 45,628.57 ఎలుకలను చంపారనుకుంటే అందులో 0.57 మాత్రం కొత్తగా పుట్టిన ఎలుక పిల్లలు అయి ఉంటాయని ఖడ్సే అనడంతో సభలోని అందరూ ఒక్కసారిగా నవ్వారు. నగరంలోని ఆరు లక్షల ఎలుకలను చంపడానికి బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)కే రెండు సంవత్సరాలు పట్టిందని ఖాడ్సే ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు పొందేందుకే సంస్థ తప్పుడు సమాచారం సమర్పించిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
వేగంగా ‘కాళేశ్వరం’ భూసేకరణ
ప్రాజెక్టు పురోగతి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ఆదేశం పట్టా భూముల పరిహారమే అసైన్డ్ భూములకూ ఇవ్వండి రైతుల త్యాగం వెల కట్టలేనిది.. వారిని నొప్పించకుండా పనులు చక్కబెట్టండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని సీఎం కేసీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అందువల్ల అలసత్వం పనికిరాదని సూచించారు. ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భూసేకరణ పనుల పురోగతిని హరీశ్‌రావు గురువారం అసెంబ్లీ హాలులో సమీక్షించారు. ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు ఏజన్సీలకూ ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనదని... అందువల్ల అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన చోట నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంట్రాక్టు ఏజెన్సీలను మంత్రి కోరారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతం వద్ద ఇసుక తవ్వకానికి అనుమతులివ్వాలని కలెక్టర్లకు సూచించారు. భూసేకరణ వ్యవహారంలో ఆర్డీఓలు చురుగ్గా పనిచేయాలని... కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చెందిన డ్రాయింగ్లు, డిజైనులు త్వరితగతిన పూర్తి చేసి ఏజెన్సీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే రైతుకు పరిహారం చెల్లింపులు జరగాలని, చెల్లింపుల్లో జాప్యం తగదన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే అసైన్డు భూములకూ అదే స్థాయిలో పరిహారం ఇవ్వాలన్నారు. భూములిచ్చే రైతుల త్యాగం వెలకట్ట లేనిదని, వారితో మర్యాదగా మెలగాలని, గౌరవంగా మాట్లాడాలని హరీశ్‌రావు సూచించారు. రైతులకు అవగాహన... రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన రైతులకు ప్రయోజనం కలిగించే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదోవిధంగా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుతంత్రాలు పన్నుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షాల వలలో రైతులు పడకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులపై హైదరాబాద్ నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా నిర్మాణ స్థలం నుంచి వీడియో కెమెరాలను జలసౌధకు అనుసంధానించే ప్రతిపాదనలపై అధికారులతో హరీశ్‌రావు చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషీ, ఈఎన్సీ మురళిధర్‌రావు, జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా కలెక్టర్లు మురళి, అమృత వర్షిణి, కన్నన్, సీఈలు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో ఆపరేటర్లకు పొంచి ఉన్న గండం
♦ నెలాఖరుతో ముగియనున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు ♦ 1,313 మంది డేటా ఎంట్రీ ♦ ఆపరేటర్లలో ఆందోళన కొనసాగింపు విషయమై త్వరలో ఉత్తర్వులు: డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ విభాగంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1,313మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. గ్రామ పంచాయతీల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు 2014లో ఔట్సోర్సింగ్ పద్ధతిన వీరందరినీ ప్రభుత్వం నియమించింది. కార్వీ ఏజెన్సీతో సర్కారు కుదుర్చుకున్న ఒప్పందం గత డిసెంబరు 31తోనే ముగియగా, చివరి నిమిషంలోప్రభుత్వం మరో మూడు నెలల పాటు (2016 మార్చి 31) వరకు కాంట్రాక్ట్ గడువును పొడిగించింది. దీంతో తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయోనని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కార్వే ఏజెన్సీ కింద ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వీరందరిని వదిలించుకోవాలని, కార్వే కాంట్రాక్ట్‌కు మంగళం పాడాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 తర్వాత సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించవద్దని ఉన్నతాధికారుల నుంచి పంచాయతీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల’కోసం విలేజ్ లెవల్ ఎంటర్ప్రెన్యూర్లను నియమిస్తున్నందున, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఇకపై ఉండబోదని పంచాయతీరాజ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు. కొనసాగిస్తాం: పీఆర్ విభాగం డెరైక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తామని, వారు పనిచేస్తున్న కార్వీ ఏజె న్సీ కాంట్రాక్ట్ గడువును మాత్రం పొడిగించడం లేదని పంచాయతీరాజ్ విభాగం డెరైక్టర్ అనితా రాంచంద్రన్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల ఆదాయంలో 10 శాతం నిధులను పరిపాలనకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను ఆ పంచాయతీలే చెల్లించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీచేస్తామని ఆమె పేర్కొన్నారు. -
అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు!
- కాంట్రాక్ట్ ఏజెన్సీలను దక్కించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ - సిండికేట్‌గా షెడ్యూల్ దాఖలు చేసినట్టు విమర్శలు - తమకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం : అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పైనా టీడీపీ నేతల కన్ను పడింది. ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. టెండర్లు ఎవరు వేయాలో వాళ్లే నిర్ణయించారు. గత కాంగ్రెస్ నేతలు చూపిన బాటలోనే వీరూ నడిచారు. సిండికేట్‌గా మారి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకునేం దుకు లైన్‌క్లియర్ చేసుకున్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలి క సిబ్బందిని నియమించుకుంటున్నాయి. అందు కు అర్హులైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లు సమకూరుస్తాయి. ఈమేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. గతంలో టెండర్లు లేకుండా నేరుగా ఆ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించేవారు. అయితే, నిరుద్యోగులు పెరగడం, వారి మధ్యపోటీ ఏర్పడడంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపీడీకి దిగాయి. ఎంత ఇచ్చినా సర్దుకుపోయే పరిస్థితికి నిరుద్యోగులు వచ్చేయడంతో ప్రభుత్వమిస్తున్నదాంట్లో భారీగా కోత పెట్టడం మొదలు పెట్టాయి. దీంతో ఏజెన్సీల పంట పండి, ఈ వ్యవహారం లాభసాటిగా తయారైంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో టెండర్ల ద్వారా ఏజెన్సీలు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్‌గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యుటీ కమిషనర్ సభ్యులగా ఉన్న కమిటీ ఏజెన్సీలను ఖరారు చేస్తుంది. అయితే, రాజు తలుచుకుంటే కానిదేముంటుంది అన్నట్టుగా నేతలు తలుచుకుంటే ఏవీ అడ్డుకావని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం రుజువు చేసింది. పేరుకే టెండర్ల ప్రక్రియ...షెడ్యూల్ దాఖలు చేసేవాళ్లంతా అధికార పార్టీకి చెందిన వారే. ఆ పార్టీ పెద్దలు ఎవరికివ్వాలో చెబితే వారికే అధికారులు పెద్ద పీట వేస్తారు. ఈ విధంగా వ్యూహాత్మకంగా షెడ్కూల్ దాఖలు చేసిన వ్యక్తులకే ఏజెన్సీలు ఖరారై, ఉద్యోగులను సమకూర్చే బాధ్యతను పంచేసుకుంటున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఓ కీలక నేత బంధువు అన్నీతానై అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకున్నారు. బినామీలను తెరముందు పెట్టి కథ నడిపించారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఏజెన్సీలకు దక్కించుకుని మస్తుగా సంపాధించడమే కాకుండా, తమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాన్న పేరు కొట్టేశారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో 13ఏజెన్సీలకు సుమారు 1500మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమకూర్చే బాధ్యత అప్పగించగా అందులో ఆ కీలక నేత బంధువు చేతిలో 10వరకు ఉన్నాయి. ఇప్పుడిదే ప్రస్తుత అధికార పార్టీ నేతలకు మార్గదర్శకంగా నిలిచింది. తాజాగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం పిలిచిన టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు ఇందులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఎవరెవరు షెడ్యూల్ దాఖలు చేయాలో ఒప్పందం ప్రకారం ముందే నిర్ణయించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌ను ఇందుకు వేదికగా చేసుకుని పావులు కదిపారు. ఫలానా శాఖలు ఫలానా వారికని పంచేసుకుని షె డ్యూల్ వేశారు. ఇటీవల టెండర్లు గడువు ముగిసేసరికి 28 షెడ్యూల్ దాఖలయ్యాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందినవే. సంపాధనే ధ్యేయంగా, ఎన్నికల్లో చేసిన ఖర్చు వేగంగా రాబట్టుకోవాలన్న యావతో ఉన్న ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి ఈ విషయంలో కీ రోల్ పోషించారు. దాఖలైన 28షెడ్యూళ్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. కానీ, తమకే కేటాయించాలంటూ ఇప్పటికే పలువురు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వారికిచ్చేస్తే తలనొప్పి ఉండదనే భావనలో సదరు అధికారులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు తమకే దక్కుతాయని ధీమాతో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. మరి, కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.