అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు! | syndicate in outsourcing | Sakshi
Sakshi News home page

అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు!

Published Sat, Sep 20 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు!

అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు!

- కాంట్రాక్ట్ ఏజెన్సీలను దక్కించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ
- సిండికేట్‌గా షెడ్యూల్ దాఖలు చేసినట్టు విమర్శలు
- తమకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పైనా టీడీపీ నేతల కన్ను పడింది. ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. టెండర్లు ఎవరు వేయాలో వాళ్లే నిర్ణయించారు. గత కాంగ్రెస్ నేతలు చూపిన బాటలోనే వీరూ నడిచారు.  సిండికేట్‌గా మారి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకునేం దుకు లైన్‌క్లియర్ చేసుకున్నారు.
 
జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలి క సిబ్బందిని నియమించుకుంటున్నాయి. అందు కు అర్హులైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లు సమకూరుస్తాయి. ఈమేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. గతంలో టెండర్లు లేకుండా నేరుగా ఆ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించేవారు. అయితే, నిరుద్యోగులు పెరగడం, వారి మధ్యపోటీ ఏర్పడడంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపీడీకి దిగాయి.

ఎంత ఇచ్చినా సర్దుకుపోయే పరిస్థితికి నిరుద్యోగులు వచ్చేయడంతో ప్రభుత్వమిస్తున్నదాంట్లో భారీగా కోత పెట్టడం మొదలు పెట్టాయి. దీంతో ఏజెన్సీల పంట పండి, ఈ వ్యవహారం లాభసాటిగా తయారైంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో టెండర్ల ద్వారా ఏజెన్సీలు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్‌గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యుటీ కమిషనర్ సభ్యులగా ఉన్న కమిటీ ఏజెన్సీలను ఖరారు చేస్తుంది. అయితే, రాజు తలుచుకుంటే కానిదేముంటుంది అన్నట్టుగా నేతలు తలుచుకుంటే ఏవీ అడ్డుకావని అవుట్ సోర్సింగ్  ఏజెన్సీల వ్యవహారం రుజువు చేసింది. పేరుకే టెండర్ల ప్రక్రియ...షెడ్యూల్ దాఖలు  చేసేవాళ్లంతా అధికార పార్టీకి చెందిన వారే.

ఆ పార్టీ పెద్దలు ఎవరికివ్వాలో చెబితే వారికే అధికారులు పెద్ద పీట  వేస్తారు.  ఈ విధంగా వ్యూహాత్మకంగా షెడ్కూల్ దాఖలు చేసిన వ్యక్తులకే ఏజెన్సీలు ఖరారై, ఉద్యోగులను సమకూర్చే బాధ్యతను పంచేసుకుంటున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో  ఓ కీలక నేత బంధువు అన్నీతానై అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకున్నారు. బినామీలను తెరముందు పెట్టి కథ నడిపించారు.   ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఏజెన్సీలకు దక్కించుకుని మస్తుగా సంపాధించడమే కాకుండా,  తమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాన్న పేరు కొట్టేశారు.

ఈ విధంగా గత ప్రభుత్వంలో 13ఏజెన్సీలకు సుమారు 1500మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమకూర్చే బాధ్యత అప్పగించగా అందులో ఆ కీలక నేత బంధువు చేతిలో 10వరకు ఉన్నాయి. ఇప్పుడిదే ప్రస్తుత అధికార పార్టీ నేతలకు మార్గదర్శకంగా నిలిచింది. తాజాగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం పిలిచిన టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు  ఇందులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఎవరెవరు షెడ్యూల్ దాఖలు చేయాలో ఒప్పందం ప్రకారం ముందే నిర్ణయించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌ను ఇందుకు వేదికగా చేసుకుని పావులు కదిపారు. ఫలానా శాఖలు ఫలానా వారికని పంచేసుకుని షె డ్యూల్ వేశారు.   

ఇటీవల టెండర్లు గడువు ముగిసేసరికి 28 షెడ్యూల్ దాఖలయ్యాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందినవే.  సంపాధనే ధ్యేయంగా, ఎన్నికల్లో చేసిన ఖర్చు వేగంగా రాబట్టుకోవాలన్న యావతో ఉన్న ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి  ఈ విషయంలో కీ రోల్ పోషించారు. దాఖలైన  28షెడ్యూళ్లు  ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. కానీ, తమకే కేటాయించాలంటూ ఇప్పటికే పలువురు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు.    ఈ నేపథ్యంలో  అధికార పార్టీ వారికిచ్చేస్తే తలనొప్పి ఉండదనే భావనలో సదరు అధికారులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.   అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు తమకే దక్కుతాయని ధీమాతో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. మరి, కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement