outsourcing contract
-
టీసీఎస్‌కు 225 కోట్ల డాలర్ల ఆర్డర్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)... భారీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకుంది. టీవీ చానెళ్ల రేటింగ్‌లు, అంతర్జాతీయ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ, నీల్సన్ నుంచి 225 కోట్ల డాలర్ల (దాదాపు రూ.14,500 కోట్లు) కాంట్రాక్ట్ రెన్యువల్‌ను టీసీఎస్ సాధించింది. ఈ డీల్‌పై ఇరు కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్‌లోనే సంతకాలు చేశాయి. 2007లో కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందానికి ఇది రెన్యువల్ అని, ఆ డీల్‌ను మరో ఐదేళ్ల పాటు నీల్సన్ పొడిగించిందని టీసీఎస్ తెలియజేసింది. ఒక భారత ఐటీ కంపెనీ సాధించిన అతి పెద్ద అవుట్సోర్సింగ్ ఆర్డర్ ఇదేనని నిపుణులంటున్నారు. విలువ, కాలవ్యవధుల పరంగా భారీ డీల్స్ బాగా తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో టీసీఎస్‌కు నీల్సన్ డీల్ దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో ఐదేళ్లు రెన్యువల్... నీల్సన్ కంపెనీకి పదేళ్ల పాటు ఐటీ సేవలు అందించడానికి 2007లో టీసీఎస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 120 కోట్ల డాలర్లు. 2013లో నీల్సన్ కంపెనీ ఈ డీల్ సైజ్‌ను రెట్టింపు చేసి (250 కోట్ల డాలర్లకు పెంచి), కాల వ్యవధిని మరో మూడేళ్లు పొడిగించింది. తాజా డీల్ ప్రకారం ఈ ఒప్పందాన్ని నీల్సన్ మరో ఐదేళ్లు (2025 వరకూ) పొడిగించిందని టీసీఎస్ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా నీల్సన్ కంపెనీ ఈ ఏడాది నుంచి 2020 వరకూ ఏటా టీసీఎస్ నుంచి కనీసం 32 కోట్ల డాలర్ల విలువైన ఐటీ సేవలను అందుకుంటుంది. 2021 నుంచి 2024 వరకూ ఏడాదికి కనీసం 18.6 కోట్ల డాలర్లు, 2025లో 14 కోట్ల డాలర్ల చొప్పున ఐటీ సర్వీసులను కొనుగోలు చేస్తుంది. గోపీనాథన్‌కు జోష్... టీసీఎస్‌కు సీఈవోగా పనిచేసిన ఎన్.చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులు కావడంతో ఆయన స్థానంలోకి రాజేశ్ గోపీనాథన్ వచ్చారు. రాజేశ్ గోపీనాథన్‌కు ఈ భారీ డీల్ మంచి జోష్ నిస్తుందని, ఈ డీల్ కుదిరిన ఉత్సాహంతో ఆయన మరిన్ని భారీ డీల్స్‌పై దృష్టి పెడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. డీల్ వార్తలతో టీసీఎస్ షేర్ 1.8% లాభంతో రూ.2,640 వద్ద ముగిసింది. -
టీసీఎస్-నీల్సన్ భారీ డీల్
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) భారీ ఆర్డర్‌ను సాధించింది. టెలివిజన్ రేటింగ్ మేనేజ్మెంట్ సంస్థ నీల్సన్ తో అతి భారీ విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. టిసిఎస్-నీల్సన్ ఒప్పందం పునరుద్ధరణలో భాగంగగా ఈ భారీ డీల్ కుదిరింది. 2.25 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14,కోట్లు) అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును గెలుచుకుంది. టీసీఎస్‌తో ఈ కాంట్రాక్టును ఐదు సంవత్సరాల వరకు (2025) పొడిగించామని, ఈ డీల్ డిసెంబర్ 31, 2025 న ముగుస్తుందని నీల్సన్ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ (అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన వివరాలను అందించింది. ఇండియన్ ఐటీలోనే బిగ్గెస్ట్ డీల్ తాజా డీల్ ప్రకారం నీల్సన్ నుంచి 2017నుంచి 2020వరకు ప్రతి సంవత్సరం 320 మిలియన్ డాలర్లు ఆదాయాన్ని, 2021 నుంచి 2024 వరకు 139.5 మిలియన్ డాలర్లు, 2025 నాటికి 186 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని టీసీఎస్ పొందనుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ కు ఇది ఒక కీలక మైన ఒప్పందంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమలోనే ఇది అతి పెద్ద డీల్‌గా నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు పోటీగా భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా టీసీఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఆర్ఐఎల్ మొదటిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంతో రాబోయే సంవత్సరాల్లో అత్యధిక విలువైన భారతీయ కంపెనీలను అధిగమిస్తుందని భావిస్తున్నారు. కాగా 2007 లో టీసీఎస్-నీల్సన్ మధ్య1.2 బిలియన్ డాలర్ల మేర , 2013లో దాదాపు రెట్టింపు విలువతో 10 సంవత్సరాలకుగాను 2.5బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదిరింది. దీన్ని మరో మూడేళ్ల పాటు 2020వరకు పొడిగించింది. -
‘కాంట్రాక్టు’ రెగ్యులరైజ్ చేయాలి
లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మె రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బి 2841 కార్యవర్గ తీర్మానం హైదరాబాద్: విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (బి 2841) కార్యవర్గ సమావేశం తీర్మానించింది. లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మంగళవారం టీఎస్ఈఈ యూనియన్ 327 ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులకు తార్డ్ పార్టీతో నిమిత్తం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించాలని, పనికి తగిన వేతనం అందజేయాలని, ఐదేళ్లు పనిచేసిన కార్మికులందరికి 2 ఇంక్రిమెంట్లు, ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ప్రస్తుతం విస్మరిస్తున్నారని విమర్శించారు. -
అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు!
- కాంట్రాక్ట్ ఏజెన్సీలను దక్కించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ - సిండికేట్‌గా షెడ్యూల్ దాఖలు చేసినట్టు విమర్శలు - తమకే కట్టబెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం : అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పైనా టీడీపీ నేతల కన్ను పడింది. ప్రభుత్వ శాఖలకు తాత్కాలిక ఉద్యోగులను సమకూర్చే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. టెండర్లు ఎవరు వేయాలో వాళ్లే నిర్ణయించారు. గత కాంగ్రెస్ నేతలు చూపిన బాటలోనే వీరూ నడిచారు. సిండికేట్‌గా మారి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను దక్కించుకునేం దుకు లైన్‌క్లియర్ చేసుకున్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలి క సిబ్బందిని నియమించుకుంటున్నాయి. అందు కు అర్హులైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లు సమకూరుస్తాయి. ఈమేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. గతంలో టెండర్లు లేకుండా నేరుగా ఆ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించేవారు. అయితే, నిరుద్యోగులు పెరగడం, వారి మధ్యపోటీ ఏర్పడడంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపీడీకి దిగాయి. ఎంత ఇచ్చినా సర్దుకుపోయే పరిస్థితికి నిరుద్యోగులు వచ్చేయడంతో ప్రభుత్వమిస్తున్నదాంట్లో భారీగా కోత పెట్టడం మొదలు పెట్టాయి. దీంతో ఏజెన్సీల పంట పండి, ఈ వ్యవహారం లాభసాటిగా తయారైంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్య పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో టెండర్ల ద్వారా ఏజెన్సీలు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ చైర్మన్‌గా, ఎంప్లాయిమెంట్ అధికారి కన్వీనర్‌గా, ట్రెజరీ డీడీ, కార్మిక శాఖ డిప్యుటీ కమిషనర్ సభ్యులగా ఉన్న కమిటీ ఏజెన్సీలను ఖరారు చేస్తుంది. అయితే, రాజు తలుచుకుంటే కానిదేముంటుంది అన్నట్టుగా నేతలు తలుచుకుంటే ఏవీ అడ్డుకావని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం రుజువు చేసింది. పేరుకే టెండర్ల ప్రక్రియ...షెడ్యూల్ దాఖలు చేసేవాళ్లంతా అధికార పార్టీకి చెందిన వారే. ఆ పార్టీ పెద్దలు ఎవరికివ్వాలో చెబితే వారికే అధికారులు పెద్ద పీట వేస్తారు. ఈ విధంగా వ్యూహాత్మకంగా షెడ్కూల్ దాఖలు చేసిన వ్యక్తులకే ఏజెన్సీలు ఖరారై, ఉద్యోగులను సమకూర్చే బాధ్యతను పంచేసుకుంటున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఓ కీలక నేత బంధువు అన్నీతానై అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను దక్కించుకున్నారు. బినామీలను తెరముందు పెట్టి కథ నడిపించారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఏజెన్సీలకు దక్కించుకుని మస్తుగా సంపాధించడమే కాకుండా, తమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాన్న పేరు కొట్టేశారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో 13ఏజెన్సీలకు సుమారు 1500మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమకూర్చే బాధ్యత అప్పగించగా అందులో ఆ కీలక నేత బంధువు చేతిలో 10వరకు ఉన్నాయి. ఇప్పుడిదే ప్రస్తుత అధికార పార్టీ నేతలకు మార్గదర్శకంగా నిలిచింది. తాజాగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం పిలిచిన టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు ఇందులో క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఎవరెవరు షెడ్యూల్ దాఖలు చేయాలో ఒప్పందం ప్రకారం ముందే నిర్ణయించారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌ను ఇందుకు వేదికగా చేసుకుని పావులు కదిపారు. ఫలానా శాఖలు ఫలానా వారికని పంచేసుకుని షె డ్యూల్ వేశారు. ఇటీవల టెండర్లు గడువు ముగిసేసరికి 28 షెడ్యూల్ దాఖలయ్యాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీకి చెందినవే. సంపాధనే ధ్యేయంగా, ఎన్నికల్లో చేసిన ఖర్చు వేగంగా రాబట్టుకోవాలన్న యావతో ఉన్న ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి ఈ విషయంలో కీ రోల్ పోషించారు. దాఖలైన 28షెడ్యూళ్లు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. కానీ, తమకే కేటాయించాలంటూ ఇప్పటికే పలువురు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వారికిచ్చేస్తే తలనొప్పి ఉండదనే భావనలో సదరు అధికారులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు తమకే దక్కుతాయని ధీమాతో టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. మరి, కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. -
సభలు పెట్టే సత్తా మాకూ ఉంది
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జె.ప్రవీణ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు తలుచుకుంటే హైదరాబాద్‌లో లక్ష కాదు.. పది లక్షల మందితో సభ పెట్టేంతా సత్తా మాకూ ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సభలకు అనుమతి ఇవ్వని సీఎం, డీజీపీ సీమాంధ్రుల ఉద్యోగుల సభలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. సీఎం, డీజీపీల అండతోనే సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉద్యమాన్ని నడుపుతున్నారని విమర్శించారు. మహెబూబ్నగర్ జిల్లాలో లక్ష మందితో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సభ జరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌బాబు డిగ్రీ పట్టాపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు వేరు కుంపటి పెట్టుకోగా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అశోక్‌బాబు ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆయన సీమాంధ్ర ప్రాంతానికే అధ్యక్షుడని నొక్కి చెప్పారు. అలాగే ఈ నెల 7న జరగనున్న సద్భావన యాత్రకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనికోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మయ్య, జిల్లా అధ్యక్షుడు రాజన్న, నాయకుడు ప్రకాశ్ ఉన్నారు.