మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జె.ప్రవీణ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు తలుచుకుంటే హైదరాబాద్‌లో లక్ష కాదు.. పది లక్షల మందితో సభ పెట్టేంతా సత్తా మాకూ ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సభలకు అనుమతి ఇవ్వని సీఎం, డీజీపీ సీమాంధ్రుల ఉద్యోగుల సభలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. సీఎం, డీజీపీల అండతోనే సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉద్యమాన్ని నడుపుతున్నారని విమర్శించారు.
మహెబూబ్‌నగర్ జిల్లాలో లక్ష మందితో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సభ జరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌బాబు డిగ్రీ పట్టాపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు వేరు కుంపటి పెట్టుకోగా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అశోక్‌బాబు ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆయన సీమాంధ్ర ప్రాంతానికే అధ్యక్షుడని నొక్కి చెప్పారు. అలాగే ఈ నెల 7న జరగనున్న సద్భావన యాత్రకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనికోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మయ్య, జిల్లా అధ్యక్షుడు రాజన్న, నాయకుడు ప్రకాశ్ ఉన్నారు.
సభలు పెట్టే సత్తా మాకూ ఉంది
Published Thu, Sep 5 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement