‘కాంట్రాక్టు’ రెగ్యులరైజ్ చేయాలి
లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మె
రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బి 2841 కార్యవర్గ తీర్మానం
హైదరాబాద్: విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ కంపెనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (బి 2841) కార్యవర్గ సమావేశం తీర్మానించింది. లేదంటే రెగ్యులర్ ఉద్యోగులతో కలసి సమ్మెకు దిగడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మంగళవారం టీఎస్‌ఈఈ యూనియన్ 327 ప్రధాన కార్యదర్శి ఈ. శ్రీధర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
సమావేశానికి ఆల్ ఇండియా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులకు తార్డ్ పార్టీతో నిమిత్తం లేకుండా నేరుగా వేతనాలు చెల్లించాలని, పనికి తగిన వేతనం అందజేయాలని, ఐదేళ్లు పనిచేసిన కార్మికులందరికి 2 ఇంక్రిమెంట్లు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ప్రస్తుతం విస్మరిస్తున్నారని విమర్శించారు.