‘కాంట్రాక్టు’ రద్దుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయడానికి సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నెల 9న జరిగే పాలకమండలి సమావేశంలో ఈమేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు తెలిపింది. అయితే ప్రభుత్వం అనుమతించిన మేరకు 24,577 మందిని ఒకే విడతలో క్రమబద్ధీకరించడానికి మాత్రం నిరాకరించింది. తొలి విడతలో 3,954 మంది డ్రైవర్లు, 5,564 మంది కండక్టర్లు కలిపి మొత్తం 9,518 మంది కాంట్రాక్టు సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించడానికి అంగీకరించింది. వీరికి ఫిబ్రవరి 1న రెగ్యులర్ సిబ్బందికి ఇచ్చే విధంగా జీతాలు చెల్లించనున్నారు. సోమవారం కార్మిక శాఖ కమిషనర్ వద్ద కార్మిక సంఘాలకు, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకూ ఐఆర్ ఇవ్వాలన్న ఈయూ, టీఎంయూ డిమాండ్‌పై యాజ మాన్యం సానుకూలంగా స్పందించలేదు. యాజమాన్య ధోరణికి నిరసనగా ఈ నెలలో ఏ రోజైనా మెరుపు సమ్మెకు దిగుతామని ఈయూ, టీఎంయూ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను ఒకేసారి కాకుండా దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామని యాజమాన్యం చెప్పడంతో నిరసనగా ఎన్ఎంయూ నేతలు చర్చల నుంచి బయటకువచ్చారు.