అనుసంధానం..అంతంతే
సాక్షి, సంగారెడ్డి: వంట గ్యాస్-ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియ జిల్లాలో చతికిలపడింది. ఇక ఆధార్-బ్యాంక్ ఖాతాల అనుసంధానం పక్రియ మరింత దిగజారింది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 50 శాతం వినియోగదారులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేయించుకున్నారు. జిల్లాలో 4,89,707 గృహ అవసర గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 2,47,978 కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఇక ఆధార్‌తో బ్యాంక్ ఖాతాల అనుసంధానమైతే కేవలం 1,35,097 కనెక్షన్లకు మాత్రమే పూర్తైది. వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టవద్దని సుప్రీం కోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పుల నేపథ్యంలో వినియోగదారుల్లో కొంత అయోమయం నెలకొందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వం న్యాయ స్థానాల తీర్పులను అమలు చేయకపోవడంతో వినియోగదారులందరూ ఆధార్‌తో అనుసంధానం కాక తప్పని పరిస్థితి నెలకొంది. అయినా వినియోగదారులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ సా..గుతూ పోతోంది. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం సైతం అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాలో మళ్లీ బ్యాంకు మేళాలు నిర్వహించి రాయితీ పథకాల లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్(నో ఫ్రిల్) ఖాతాలు అందించడానికి జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఖాతాల జారీతో పాటు బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో అనుసంధానం కోసం ఈ మేళాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పెరిగిన గడువు ..
వంట గ్యాస్-ఆధార్ అనుసంధానికి తుది గడువు డిసెంబర్ 31తో ముగిసిపోయింది. పురోగతి లేకపోవడంతో జనవరి 31 వరకు గడువును పొడిగిస్తూ చమురు సంస్థలు వెసులుబాటు కల్పించాయి. దీంతో ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధానం కాని వినియోగదారులకు సబ్సిడీపైనే గ్యాస్ అందిస్తున్నారు. పొడిగించిన గడువులోగా ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ఆతర్వాత రాయితీపై వంట గ్యాస్ లభించదని అధికాారులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ రాయితీపై రూ.444, రాయితీ లేకుండా రూ.1,327కు లభిస్తోంది. గడువులోగా అనుసంధానం కాని వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.900 వరకు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.
8 వేల కనెక్షను బ్లాక్
ఒక కుటుంబానికి ఒకే కనెక్షన్ విధానాన్ని గ్యాస్ కంపెనీలు అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లుంటే ఏరివేయడానికి గత ఏడాది వినియోగదారుల నుంచి కేవైసీ ఫారాలను స్వీకరించి సమాచారాన్ని విశ్లేషించాయి. దీని ఆధారంగా జిల్లాలో 8 వేల మంది వినియోగదారులు ఒకటికి మించి కనెక్షన్లు కలిగి ఉండడంతో ఆ కనెక్షన్లను బ్లాక్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో 3,600 కనెక్షన్లు భారత్ గ్యాస్‌కు సంబంధించినవి కాగా..మిగిలిన కనెక్షన్లు ఇండెన్, హెచ్‌పీ కంపెనీలవి ఉన్నాయి.