Cooking oil import
-
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు నవంబర్‌లో గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 11,38,823 టన్నులతో పోల్చి చూస్తే, 32 శాతం పెరిగి 15,28,760 టన్నులకు చేరాయి. ముఖ్యంగా ముడి పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు అధికంగా జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి వంట నూనెలు, ఇతర నూనెల దిగుమతుల గణాంకాలను ఎస్ఈఏ బుధవారం విడుదల చేసింది. వంట నూనెలకు సంబంధించి 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో నవంబర్ మొదటి నెల అవుతుంది. పామాయిల్ రికార్డులు ► మొత్తం నూనెల దిగుమతులు నవంబర్ నెలకు 15,45,540 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఇవి 11,73,747 టన్నులుగా ఉన్నాయి. ► కేవలం వంట నూనెల దిగుమతులు 15,28,760 టన్నులకు చేరాయి. ► ఇతర నూనెల దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 34,924 టన్నులతో పోలిస్తే 52 శాతం తగ్గి 16,780 టన్నులుగా ఉన్నాయి. ► ముడి పామాయిల్ దిగుమతులు 9,31,180 టన్నులుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇవి 4,77,160 టన్నులుగానే ఉన్నాయి. అంటే రెట్టింపైనట్టు తెలుస్తోంది. ► ఇప్పటి వరకు ఒక నెలలో ముడి పామాయిల్ అధిక దిగుమతులు ఇవే కావడం గమనించాలి. చివరిగా 2015 అక్టోబర్ నెలలో 8,78,137 టన్నుల ముడి పామాయిల్ దిగుమతులు జరిగాయి. ► రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు నవంబర్ నెలకు 2,02,248 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్‌లో ఉన్న 58,267 టన్నులతో పోలిస్తే మూడు రెట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ► ముడి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 2,29,373 టన్నులకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి 4,74,160 టన్నులుగా ఉన్నాయి. ఎస్ఈఏ ఆందోళన..: రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ దిగుమతులు పెరిగిపోవడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ముడి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ మధ్య టారిఫ్ అంతరం 7.5 శాతమే ఉండడంతో, రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి దారితీస్తోంది. తుది ఉత్పత్తుల దిగుమతులు పెరగడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దేశీ సామర్థ్య వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి.. వాటిని ఎగుమతి చేసే దేశాలు (ఇండోనేషియా, మలేషియా) అక్కడి పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వల్లే. ముడి పామాయిల్ ఎగుమతులపై ఆయా దేశాలు అధిక సుంకాలు విధించాయి. తుది ఉత్పత్తి అయిన పామోలీన్ ఆయిల్‌పై తక్కువ డ్యూటీ విధించాయి’’అని అసోసియేషన్ పేర్కొంది. దేశీ పరిశ్రమను ఆదుకునేందుకు, ముడి పామాయిల్ దిగుమతిని ప్రోత్సహించేందుకు పరిశ్రమ కీలక సూచన చేసింది. రెండింటి మధ్య సుంకాల్లో అంతరం 15 శాతం మేర ఉంచాలని పేర్కొంది. రిఫైన్డ్ పామోలీన్ ఆయిల్‌పై డ్యూటీని 20 శాతం చేయాలని కోరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు అంతకుమందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 131 లక్షల టన్నుల నుంచి 140 లక్షల టన్నులకు పెరగడం గమనార్హం. -
వంట నూనెల హబ్.. 'కాకినాడ'
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడకు వంట నూనెల హబ్‌గానూ పేరుంది. ఈ విషయంలో కాకినాడ.. గుజరాత్ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి ఇక్కడకు ముడి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇక్కడున్న 12 రిఫైనరీలలో ముడి వంట నూనెలను శుద్ధి చేసి పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే కాకినాడ గేట్‌వే పోర్టుతో పారిశ్రామికంగా ఈ రంగం మరింత పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా ఇందుకు దోహదం చేయనుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కాకినాడలో ప్రభుత్వ రంగ యాంకరేజ్ పోర్టు, ప్రైవేటు రంగంలో కేఎస్పీఎల్ (కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్) రెండు పోర్టులు ఉన్నాయి. పలు రాష్ట్రాల రిఫైనరీలు.. ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి ఏటా 9 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ సీపోర్ట్సుకు దిగుమతి చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే ముడి నూనెలను ఓడ సముద్రతీరాన జట్టీలో ఉన్నప్పుడే నేరుగా రిఫైనరీకి తరలించే ప్రత్యేక ఏర్పాటు ఇక్కడ ఉంది. అందుకే పలు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రిఫైనరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. పోర్టు నుంచి రిఫైనరీలకు నేరుగా పైపులైన్లు ఉండటంతో సమయం, ఖర్చులు ఆదా అవుతున్నాయంటున్నారు. 12 రిఫైనరీలలో శుద్ధి.. ప్యాకింగ్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ పామాయిల్‌ను కాకినాడ పరిసరాల్లో వాకలపూడి, వలసపాకల, సూర్యారావుపేటలలో 12 రిఫైనరీలలో శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అదానివిల్మార్, అగర్వాల్, లోహియా, జెమిని, అమ్మిరెడ్డి, రుచిసోయ, భగవతి, సంతోíÙమాత, శ్రీ గాయత్రి, వెంకట రమణ తదితర కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రిఫైనరీల్లో శుద్ధి చేసిన వంట నూనెలను వివిధ బ్రాండ్ల పేరుతోఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తదితర రాష్ట్రాలకు ప్యాకింగ్ ఆయిల్, లూజు ఆయిల్గా రవాణా చేస్తున్నారు. రోజూ ట్యాంకర్ల ద్వారా 500 మెట్రిక్ టన్నుల ఆయిల్ (లూజు), 2,500 మెట్రిక్ టన్నులు లీటర్ చొప్పున ప్యాక్ చేసి ట్రక్కులలో కాకినాడ నుంచి పంపుతున్నారు. ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా కాకినాడ తర్వాత కృష్ణపట్నం.. దేశవ్యాప్తంగా ప్రజల వినియోగానికి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు అవసరమని అంచనా. దేశీయంగా అందుబాటులో ఉండే వంట నూనెలు మినహాయిస్తే.. విదేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు వరకు దిగుమతి అవుతున్నాయి. వీటిలో గుజరాత్‌లోని రెండు పోర్టులు ముడి వంట నూనెల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ పోర్టు ఉంది. దేశవ్యాప్తంగా దిగుమతి అవుతున్న ముడి వంట నూనెల్లో 20 శాతం రాష్ట్రంలోని పోర్టులకు దిగుమతి అవుతున్నాయి. కాకినాడ సీపోర్టు ద్వారా ఏటా 9 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాకినాడ తర్వాత రెండో స్థానాన్ని కృష్ణపట్నం పోర్టు దక్కించుకుంటోంది. క్రియాశీలకంగా కాకినాడ సీపోర్టు.. క్రూడ్ పామాయిల్ దిగుమతిలో కాకినాడ సీపోర్టు క్రియాశీలకంగా ఉంది. పోర్టు నుంచి నేరుగా రిఫైనరీల వరకు పైపులైన్ ఉండటంతో ముడి నూనె ఎటువంటి వృథా కాకుండా రవాణా అవుతుండటం కంపెనీలకు కలిసివస్తోంది. –ఎన్.మురళీధరరావు, సీఈవో, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ రవాణా రంగానికి ఊపిరి.. కాకినాడ సీపోర్టును ఆనుకుని పలు ఆయిల్ రిఫైనరీలు నిర్వహిస్తుండటంతో రవాణా రంగానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. డ్రైవర్లు, ట్రక్ యజమానులు, క్లీనర్లు తదితరులు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. – బావిశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, లారీ ట్యాంకర్స్ యూనియన్, కాకినాడ -
నిత్యావసర సరుకులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
దేశంలో వంట నూనెల కొరత ఉండదు!
న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల కొరత ఉండబోదని ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా ఇస్తోంది. దీనిపై ఆందోళన అక్కర్లేదని సూచిస్తోంది. వంట నూనెల సరఫరాల్లో ఎటువంటి సమస్యలూ లేకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వానికి పరిశ్రమ హామీ ఇచ్చింది. రెండు నెలల్లో ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వంట నూనెల పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనితో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు పువ్వు నూనె భారీగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి గోయల్ ఒక కీలక సమావేశం నిర్వహించి సన్‌ఫ్లవర్ ఆయిల్సహా వంటనూనెల సరఫరాలపై సమీక్ష జరిపారు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) సెక్రటరీ జనరల్ ఎస్పీ కమ్రా, అదానీ విల్మర్, రుచీ సొయా, మోడీ న్యాచురల్స్సహా ప్రముఖ రిఫైనర్లు, దిగుమతిదారుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సన్‌ఫ్లవర్.. తగినంత లభ్యత! సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత లేదని సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. మార్చిలో డెలివరీ కోసం మొదటి షిప్మెంట్ 1.5 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ యుద్ధానికి ముందే ఉక్రెయిన్ నుండి బయలుదేరింది. త్వరలో ఈ షిప్మెంట్ (దిగుమతుల) భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఒక నెలలో 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వాటా దాదాపు 1.5–2 లక్షల టన్నులు. హార్డ్‌కోర్ వినియోగదారుల (కేవలం సన్‌ఫ్లవర్ వంట నూనె వినియోగించే వారు) డిమాండ్‌ను తీర్చడానికి లక్ష టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అవసరం. దేశంలో పొద్దుతిరుగుడు నూనెకు ఆవాలు, సోయాబీన్ నూనెల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖకు పరిశ్రమ తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 11 లక్షల టన్నుల కొత్త ఆవాల పంట రావడంతో వచ్చే 2–3 నెలల్లో దేశంలో సరఫరాలు తగిన స్థాయిలోనే ఉంటాయని భరోసాను ఇచ్చింది. భారతదేశం తన వంట నూనెల డిమాండ్‌లో 60 కంటే ఎక్కువ వాటా దిగుమతులదే కావడం గమనార్హం. తయారీని పెంచే మార్గాలు అన్వేషించండి: గోయల్ కాగా, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచే దిశగా తగిన మార్గాలు అన్వేషించాలని పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ పిలుపునిచ్చారు. అలాగే, టెక్నాలజీలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో 10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌లను లేదా నవకల్పనల కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా 15 శాతం స్థాయిలో ఉంది. డీపీఐఐటీ వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. జీడీపీలో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచడంపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. సర్వీసుల ఎగుమతుల్లో టాప్ మూడు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడం, విదేశీ వాణిజ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై కసరత్తు జరగాలని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశీ కంపెనీలు మద్దతునివ్వాలని గోయల్ చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంపై పలు దేశాల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు. -
వంటనూనెల దిగుమతి తగ్గించుకోవాలి
ఏడీఎం ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ మార్టిన్ క్రాప్ సాక్షి, హైదరాబాద్ : దేశంలో ఆహారంతో పాటు ఆరోగ్యానికీ దోహదపడే సోయాబీన్ దిగుబడులు క్రమేపీ తగ్గిపోతుండటం మంచి పరిణామం కాదని ఏడీఎం ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ మార్టిన్ క్రాప్ అన్నారు. కోట్లు ఖర్చు చేస్తూ వంట నూనెలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో వాణిజ్య లోటు ఏర్పడుతోందన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శనివారం సోయాబీన్ నూనె ఉపయోగాలపై జరిగిన జాతీయ సదస్సుకు మార్టిన్ హాజరయ్యారు. యునెటైడ్ స్టేట్స్ సోయ్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ (యూఎస్ఎస్ఈసీ), ఆయిల్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏటా 2 కోట్ల టన్నుల వంటనూనెలను ఉపయోగిస్తూంటే.. వీటిల్లో 65 శాతం దిగుమతులే ఉంటున్నాయని చెప్పారు. యూఎస్ఎస్ఈసీ ఉన్నతాధికారి డాక్టర్ ఎం.ఎం.కృష్ణ మాట్లాడుతూ.. సోయా నూనెలో ఉండే ఒమేగా 3, 6, 9 కొవ్వులు గుండెకు మేలు చేస్తాయన్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు పామాయిల్, సోయా నూనెలను కలిపి వాడటం మంచిదని ఐఐసీటీలోని సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ విభాగ అధిపతి డాక్టర్ ఆర్.బి.ఎన్. ప్రసాద్ తెలిపారు. ఇకపై సోయా పప్పును కూడా చూడబోతున్నామని, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు తెలిపారు.