భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు, మెట్రో : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి భగ్గుమంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా 14 శాసనసభ స్థానాలు కట్టబెట్టిన జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే అసమ్మతి మొదలైంది. మంత్రి వర్గ విస్తరణతో అది మరింత ముదిరింది. విస్తరణలో ఒకరికి అదనంగా పదవి దక్కిందన్న ఆనందం ఏ మాత్రం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అండగా నిలబడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం చింతమనేని వర్గం ఏలూరులోని జిల్లాపరిషత్ కార్యాలయంలో సమావేశమైంది. దెందులూరుకు చెందిన పార్టీ నేతలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, సొసైటీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చింతమనేనికి అన్యాయం జరిగిందంటూ పెద్దపెట్టున నినదించారు. చింతమనేని వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన వారికి కనీస గుర్తింపు లేకుండా పోయిందని, గత ఎన్నికల వరకూ వేరే పార్టీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని నిరసన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం జరగనప్పుడు పార్టీలో ఉండటం అనవసరమని, పదవులకు రాజీనామాలు చేద్దామని చింతమనేని అనుచరులు నినాదాలు చేశారు. అందరూ మూకుమ్మడి రాజీనామాలకు సన్నద్ధమయ్యారు. దీంతో చింతమనేని వద్దకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును అధిష్టానం చర్చలకు పంపింది.
చింతమనేని వెంటే మేము : బడేటి
పార్టీకి చింతమనేని రాజీనామా చేస్తే తామూ ఆయన వెంటే ఉంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఆయనను ఒంటరి కానివ్వబోమని పేర్కొన్నారు. అనంతరం చింతమనేని అమరావతికి వెళ్లి ఎమ్మెల్యే, విప్ పదవులకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందచేశారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ‘పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువంటేæ ఎలా?, పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయను, అన్నీ తెలిసిన నీవే ఇలా చేస్తే ఎలా అంటూ చింతమనేనికి సీఎం క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.
నిరాశలో మొడియం
చివరి వరకూ మంత్రి పదవి వస్తుందని ఆశించిన పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కూడా అసంతృప్తి చెందారు. ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్ నేతలైన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు తదితరులూ తమను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. మైనారిటీ కోటాలో స్థానం దక్కుతుందన్న ప్రచారం చివరి వరకూ జరిగినా తమను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఎమ్మెల్సీ షరీఫ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు మంత్రి పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తప్పించడంపై మాల సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. అసెంబ్లీలో 21 మంది మాల సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఉన్నా.. సరైన న్యాయం జరగలేదని, మహిళా మంత్రికి అన్యాయం చేశారంటూ మాలమహానాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత లుకలుకలను బయటపెట్టింది.
అవసరమైతే పార్టీ పెడతా !
ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వీరాంజనేయులుతో చర్చించిన సమయంలో తను ప్రజాప్రతినిధిగా కొనసాగడం ఇష్టం లేదనీ, తనను నియోజకవర్గ నాయకులు ఆస్తులమ్మి, సొమ్ములు కూడబెట్టి గెలిపించారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి దక్కలేదని రాజీనామాకు సిద్ధపడటం లేదనీ, పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటే అన్యాయం జరిగిందనే కారణంతోనే రాజీనామా చేయనున్నట్టు ఆవేదన వెళ్లగక్కారు. కిందిస్థాయి నాయకుల మాటే తనకు శిరోధార్యమని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా వేరే పార్టీలోకి వెళ్లననీ, కావాలంటే వేరే పార్టీ పెట్టి పోటీ చేస్తానని చింతమనేని ప్రకటించారు. అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు. రెండు మూడు రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాక భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానని స్పష్టం చేశారు.