Copy scenes
-
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కాపీ కొట్టారా?
సాక్షి, వెబ్‌డెస్క్: మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విలన్ థానోస్ నుంచి కాపాడేందుకు సూపర్ హీరోలు చేసే సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు... భారీ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. హ్యారీ పాటర్ సిరీస్‌లోని సన్నివేశాలను ఎత్తేసి ఇన్ఫినిటీ వార్‌ను రూపొందించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫిలోని చాలా మట్టుకు సన్నివేశాలను.. హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్లోని సీన్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హ్యారీ పాటర్ సిరీస్‌ల్లోని ది సెంట్రల్ క్వెస్ట్.. వోల్దెమార్ట్ చనిపోయే సన్నివేశం.. డీమెంటర్స్-రెడ్స్కల్ మధ్య పోలికలు.. మ్యాడ్ఊ మూడీ కన్నును థోర్ కంటితో పోలుస్తూ కాపీ కొట్టారంటూ వాదిస్తున్నారు. మరికొందరు జేకే రౌలింగ్(హ్యారీ పాటర్ రచయిత్రి) నుంచి రాయల్టీ తీసుకోవాల్సిందేనంటూ చమక్కులు పేలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే విదేశీ మార్కెట్‌తోపాటు భారత్‌లోనూ అవెంజర్స్ ప్రభంజనం కొనసాగుతోంది. తొలిరోజు రూ. 30 కోట్లు(2000 వేల స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది) వసూలు చేసిన ఈ చిత్రం.. వీకెండ్లో భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. Watching the Avengers: Infinity War feels like watching Harry Potter and the Deathly Hallows — Niekholois (@Khloivillaverde) 28 April 2018 Curious question, I've only seen 3 Harry Potter movies... How many Harry Potter Flicks do I need to see to catch up for Avengers: Infinity War??? #AvengersInfinityWar #InfinityGauntlet — ᴹᶦᶜʳᵒ (@Micromonics) 28 April 2018 The truth has been revealed. Harry Potter was fake. It was Thanos who killed Voldemort.#Avengers #InfinityWar #ThanosTheRealHero #Avengers4 pic.twitter.com/L0zMl0GujS — Abhishek D (@abh1shekdas) 28 April 2018 Hello, Avengers? JK Rowling called and wants some royalties. #horcruxes #HarryPotter — Jeffrey Pugh (@JeffreyCPugh) 28 April 2018 ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్ థానోస్.. అతని నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు.. వాళ్లు చేసే పోరాటాల నేపథ్యంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించారు. -
ఆస్కార్ రేసు... కాపీ కాన్సెప్ట్?
సాక్షి, ముంబై : భారత్ తరపున విదేశీ చిత్ర కేటగిరీలో బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం తాజాగానే ఇండియాలో రిలీజ్ కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంను కాపీ చేశారంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . 2001లో వచ్చిన ఇరానియన్ చిత్రం సీక్రెట్ బాలెట్‌ను మక్కికి మక్కీ దించేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయా రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోల్చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే తెరకెక్కినవే. పైగా ప్రధాన పాత్రలు ఎన్నికల అధికారి పాత్రలు పోషించాయి. వారికి తోడుగా ఓ సైనిక అధికారి ఉండటం అనే కామన్ పాయింట్ కూడా ఉంది. రెండింటిల్లోనూ కష్టాలు ఎదుర్కునే లీడ్ రోల్స్ కష్టాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తాయి. ఇలా దాదాపు అన్నీ సిచ్యువేషన్లు, సీన్లు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ కాపీ కామెంట్లను న్యూటన్ చిత్ర దర్శకుడు అమిత్ మసుకర్ ఖండించారు. సినిమాను సీక్రెట్ బ్యాలెట్ నుంచి తాను కాపీ కొట్టలేదని, పైగా ప్రేరణ కూడా పొందలేదని ఆయన చెబుతున్నారు. ‘‘న్యూటన్ నేను సొంతంగా రాసుకున్న కథ. సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడొకరు సీక్రెట్ బ్యాలెట్ చిత్రం గురించి నాకు చెప్పాడు. యూట్యూబ్‌లో ఆ చిత్రం వీడియోలను చూస్తే ఆశ్చర్యం వేసింది. కాస్త పోలికలు ఉన్నప్పటికీ.. తేడాలను కూడా గమనించాను. అందులో లీడ్ పాత్ర మహిళ పోషించగా.. ఇక్కడ మాత్రం రాజ్ కుమార్ రావు పోషించారు. అక్కడ రొమాన్స్ ట్రాక్ ఉంటే.. ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శలు వినిపిస్తాయని నాకు తెలుసు. కానీ, ఏం చేయగలను? అలా జరిగిపోయింది’’ అని అమిత్ వివరణ ఇచ్చారు. -
కాపీకి కాపీ
ఆ సీన్ - ఈ సీన్ హాలీవుడ్ లేదా విదేశీ సినిమాల నుంచి కథ, కథనం, సీన్లను కాపీ చేయడం ఒక పద్ధతి. అందులో కూడా ఒరిజినల్ రచయితకు క్రెడిట్ ఇస్తే అది అభినందించ దగ్గ పద్ధతే అవుతుంది. అయితే సినీ సృజనకారులు కాపీ కొట్టడంలో ఎంతో సృజనను చూపిస్తూ ఉంటారు. ఈ విషయంలో కొందరు మరింత లోతులకు వెళ్లి నవలల నుంచి కూడా కథాంశాలను పట్టుకొచ్చారు. కానీ పాపం వారు స్ఫూర్తి పొందింది ప్రముఖ నవలలు, క్లాసిక్స్ అనిపించుకొన్న రచనల నుంచి కాబట్టి, వాటి మూలాలు మనం సులువుగా కనిపెట్టేయవచ్చు. మణిరత్నం సినిమాలకు సొబగులు అద్దే సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. మణి దర్శకత్వం వహించిన ‘బొంబాయి’, ‘గురు’, ‘కడలి’ వంటి సినిమాలు... రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ ప్రతిభకు నిలువుటద్దాలు. అయితే ఓ సమయంలో రాజీవ్‌కు ఉన్నట్టుండి దర్శకత్వం మీద గాలి మళ్లింది. వెంటనే మెగాఫోన్ పట్టి మెరుపుకలలు, ప్రియురాలు పిలిచింది సినిమాలు తీసేశాడు. కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించక పోయినా... ఈ రెండు సినిమాలూ క్లాస్ ప్రేక్షకుల మెప్పు పొందాయి. ముఖ్యంగా అమ్మాయిల మనసులు దోచాయి! ప్రత్యేకించి ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా. టబు, ఐశ్వర్యారాయ్, అజిత్, మమ్ముట్టి, అబ్బాస్‌లు ముఖ్యపాత్రల్లో వచ్చిన ఈ డబ్బింగ్ సినిమా పదిహేనేళ్ల కిందటిదే అయినా... ఇప్పటికీ ఫ్రెష్‌గా ఆకట్టుకొనే శక్తి ఆ సబ్జెక్టులో ఉంది. అయితే ఆ శక్తి రాజీవ్ మీనన్ వల్ల సమ కూరింది మాత్రం నిస్సందేహంగా కాదు. అసలు ‘ప్రియురాలు పిలిచింది’ కథ ఇప్పటిదే కాదు. రెండువందల ఏళ్ల కిందటిది! మిగతా కథల సంగతేమో కానీ.. అక్కాచెల్లెళ్ల కథలకు మాత్రం ఎప్పుడూ అందం ఉంటుంది. యుక్తవయసుల్లోని అమ్మాయిల కథల్లో ఆకట్టుకొనే రొమాంటి సిజం ఉంటుంది. అది వందల ఏళ్లు గడిచినా వన్నె తగ్గనిది. ఆ విషయాన్ని ఎన్నో పుస్తకాలు, నాటకాలు, సినిమాలు నిరూపించాయి.... ఈ కథతో సహా! ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురివీ మూడు రకాల మనస్తత్వాలు. పేరున్న కుటుంబం. కానీ ఆర్థిక ఇబ్బందులు. పెద్దమ్మాయికి జాతకంలోని దోషాలతో వివాహం కుదరదు. రెండో అమ్మాయికి రొమాంటిక్ హోప్స్. కవిత్వం.. ప్రకృతి.. ఉరుములు.. మేఘాలు.. అన్నీ కావాలి! ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మాయికి పరిచయం అయ్యే డ్రామా డెరైక్టర్, చిన్నమ్మాయికి పరిచయం అయ్యే భావు కుడు, ఆమెనే ఆరాధించే ఒక ఓల్డ్ బ్యాచి లర్ కల్నల్... ఈ పాత్రల మధ్య దోబూచు లాటే ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ నవల. 1811లో అచ్చయిన జేన్ ఆస్టిన్ అద్భుత రచన ఇది. అప్పట్లోనే దీన్ని నాటకంగా మార్చి బ్రిటన్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ కథ హాలీవుడ్ కళ్లలో పడింది. నిజానికి తొంభైల్లో హాలీవుడ్ ఇంగ్లిష్ లిటరేచర్ వెంట పడింది. షేక్స్పియర్ నాటకాలను, రొమాంటిక్ ఎరాలో వచ్చిన ఇంగ్లిష్ సాహిత్యాన్ని సినిమాలుగా మలిచారు హాలీవుడ్ దర్శకులు. అదే ట్రెండ్‌లో దర్శకుడు ఆంగ్ లీ జేన్ ఆస్టిన్ ‘సెన్స అండ్ సెన్సిబిలిటీ’ మీద దృష్టి సారించాడు. దాన్ని అదే పేరుతో చక్కని సినిమాగా మలిచాడు. ఎమ్మా థాంప్సన్, కేట్ విన్స్లెట్, అలెన్ రాక్‌మన్ తదితరులు నటించిన ఈ చిత్రం 1995లో విడుదల అయ్యింది. అయితే ఈ కాపీ ఇక్కడితోనే ఆగిపోలేదు. తెలుగుకీ వచ్చింది. 2000 సంవత్సరంలో ’ప్రియురాలు పిలిచింది’ తమిళ, తెలుగు వెర్షన్లు విడుదలయ్యాయి. ఈ చిత్ర కథ అచ్చంగా ’సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ కథలానే ఉంటుంది. కాకపోతే పాశ్చాత్య కథను ఒక సనాతన దక్షిణాది కుటుంబంలోని అమ్మాయిల నేపథ్య కథగా మార్చారు రాజీవ్ మీనన్. అయితే మూలాన్ని ఆయన ఆస్టిన్ నవల నుంచి తీసుకున్నారా లేక, హాలీవుడ్లో వచ్చిన సినిమా నుంచి తీసుకున్నారా అన్నది ఆయనకే తెలియాలి. నిజానికి ఆస్టిన్ రచించిన ఎన్నో నవలల్లో అక్కాచెల్లెళ్ల కథాంశం ఉంటుంది. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మరెన్నో టీవీ సీరియళ్లు కూడా రూపొం దాయి. అలాంటి వాటిలో రాజీవ్ మీనన్ సినిమా ఒకటి! - బి.జీవన్‌రెడ్డి