సాక్షి, ముంబై : భారత్ తరపున విదేశీ చిత్ర కేటగిరీలో బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం తాజాగానే ఇండియాలో రిలీజ్ కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంను కాపీ చేశారంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . 2001లో వచ్చిన ఇరానియన్ చిత్రం సీక్రెట్ బాలెట్‌ను మక్కికి మక్కీ దించేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయా రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోల్చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే తెరకెక్కినవే. పైగా ప్రధాన పాత్రలు ఎన్నికల అధికారి పాత్రలు పోషించాయి. వారికి తోడుగా ఓ సైనిక అధికారి ఉండటం అనే కామన్ పాయింట్ కూడా ఉంది. రెండింటిల్లోనూ కష్టాలు ఎదుర్కునే లీడ్ రోల్స్ కష్టాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తాయి. ఇలా దాదాపు అన్నీ సిచ్యువేషన్లు, సీన్లు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు.
అయితే ఈ కాపీ కామెంట్లను న్యూటన్ చిత్ర దర్శకుడు అమిత్ మసుకర్ ఖండించారు. సినిమాను సీక్రెట్ బ్యాలెట్ నుంచి తాను కాపీ కొట్టలేదని, పైగా ప్రేరణ కూడా పొందలేదని ఆయన చెబుతున్నారు. ‘‘న్యూటన్ నేను సొంతంగా రాసుకున్న కథ. సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడొకరు సీక్రెట్ బ్యాలెట్ చిత్రం గురించి నాకు చెప్పాడు. యూట్యూబ్‌లో ఆ చిత్రం వీడియోలను చూస్తే ఆశ్చర్యం వేసింది. కాస్త పోలికలు ఉన్నప్పటికీ.. తేడాలను కూడా గమనించాను. అందులో లీడ్ పాత్ర మహిళ పోషించగా.. ఇక్కడ మాత్రం రాజ్ కుమార్ రావు పోషించారు. అక్కడ రొమాన్స్ ట్రాక్ ఉంటే.. ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శలు వినిపిస్తాయని నాకు తెలుసు. కానీ, ఏం చేయగలను? అలా జరిగిపోయింది’’ అని అమిత్ వివరణ ఇచ్చారు.