Newton
-
OTT: మలయాళ మూవీ ‘పేరడైజ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్‌కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్‌లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ. ఈ సినిమా మొత్తంలో స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
న్యూటన్ ఎక్కడ పుట్టారు? రెండు పుట్టిన రోజులు ఎందుకు?
ప్రముఖ శాస్త్రవేత్త, గణిత మేథావి ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాఠశాల పుస్తకాలలో అతని పేరు తప్పక కనిపిస్తుంది. న్యూటన్ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతవేత్త ఇలా మరెన్నో సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే న్యూటన్ తన గురుత్వాకర్షణ, చలన నియమాలకు ప్రసిద్ధి చెందారు. అయితే న్యూటన్ ఎక్కడ పుట్టారో తెలుసా? అలాగే ఆయనకు రెండు పుట్టిన రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా? న్యూటన్ ఇంగ్లాండ్‌లోని లింకన్షైర్ కౌంటీలోని వూల్స్టోర్ప్-బై-కోల్స్టర్వర్త్లోని వూల్స్టోర్ప్ మనోర్‌లో 1642, డిసెంబరు 25న జన్మించారు. న్యూటన్ పుట్టిన మూడు నెలలకు అతని తండ్రి కన్నుమూశారు. అతని పూర్తి పేరు ఐజాక్ న్యూటన్. న్యూటన్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రపంచానికి వినూత్న ఆవిష్కరణలు అందించిన న్యూటన్ 1727 మార్చి 20న కన్నుమూశారు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి ఉంది. న్యూటన్‌కు పిల్లలు లేరు. అతని ఆస్తిని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. న్యూటన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. న్యూటన్‌కు రెండు పుట్టినరోజులు. నాటి రోజుల్లో అమలులో ఉన్న క్యాలెండర్ కారణంగా అతని పుట్టిన తేదీల మధ్య పది రోజుల తేడా ఉంది. న్యూటన్ పుట్టిన రోజు జనవరి 4నే కాకుండా, డిసెంబర్ 25న కూడా వస్తుంది. న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్‌లో జరుపుకున్నారు. ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4 కింద లెక్కిస్తారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్‌ను ఇంగ్లాండ్‌లో ఉపయోగించారు. ఈ క్యాలెంటర్ యూరప్‌కు భిన్నమైనది. దీని ప్రకారం న్యూటన్ 1642, డిసెంబరు 25న జన్మించారు. ఆ సమయంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించేవారు. దీని ప్రకారం న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. -
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా. -
న్యూటన్ నాల్గవ నియమాన్ని అనుసరించి కరోనా విజృంభిస్తోందట!
Child explains Newton's fourth law in hilarious way: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కోవిడ్‌తో అల్లాడిపోతున్నాయి. ఒకనొక దశలో వ్యాక్సిన్లు లేక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడేమో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఆ వైరస్ తన తీరుని మార్చకుంటోంది. పైగా ఒక్కొక్కరిలో ఒక్కోలా మారి వేగంగా వ్యాపిస్తోంది. అయితే దీని విజృంభణ గురించి ఒక విద్యార్థి న్యూటన్ నాల్గవ నియమాన్ని అనుసరిస్తూ వేగంగా వ్యాపిస్తోందని హాస్యాస్పదంగా చెబుతున్నాడు. (చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!) అసలు విషయంలోకెళ్లితే...ఒక విద్యార్థి సర్ ఐజాక్ న్యూటన్‌కి సంబంధించిన నాల్గవ నియమం ప్రకారం కరోనా, పరిశోధనలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనో తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు దీన్ని ఒక సమీకరణాన్ని రూపంలో చూపించి మరీ వివరించి చెప్పాడు. పైగా 'కే' అనే ఒక స్టిరమైన వేరియబుల్ "వినాశనం"ను సూచిస్తుందని అన్నాడు. కరోనా తగ్గుముఖం పట్టడంతో గతేడాది సెప్టెంబర్ సమయాల్లో స్కూళ్లు ఆఫీసులు తెరుచుకుని మళ్లీ పరిస్థితి పూర్వవైభవం సంతరించుకుంటుంది అనే క్రమంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌తో విరుచకుపడటం మొదలు పెట్టింది. దీంతో ప్రజలకు మళ్లీ ఇళ్లకే పరిమితమవ్వల్సి రావడంతో ఒకింత నిరాశ నిస్ప్రహలకు గురయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలోనే విసుగు పుట్టి ఒక విద్యార్థి ఇలా కరోనా విజృంభణను సమీకరణ రూపంలో వివరించాడు. అంతేకాదు ఈ విషయానికి "కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం..మత్తిచ్చి..చంపి ఆ భాగాలను తినేశాడు!) ‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP — Awanish Sharan (@AwanishSharan) January 4, 2022 -
‘న్యూటన్’ను కోర్టుకు లాగుతున్నారే!
సాక్షి, సినిమా : గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ చిత్రం న్యూటన్ చిక్కుల్లో పడింది. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఎస్సై ఒకరు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం కోర్టుకు చేరింది. చిత్రంలో తమను(సీఆర్పీఎఫ్) తక్కువ చేసి చూపారని.. తమ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సీఆర్పీఎఫ్ సబ్ ఇన్సెపెక్టర్ ఒకరు ఢిల్లీలోని కార్కాడూమ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో క్రిమినల్ ఫిర్యాదుతోపాటు న్యూటన్ నిర్మాతలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహించే ఓ సన్నివేశం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదుల్లో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 3న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. అమిత్ వీ మసూర్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్ తదితరులు నటించారు. ఆస్కార్ ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో లిస్ట్‌లో చోటు దక్కించుకున్న న్యూటన్.. చివరి జాబితాలో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ 63వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. -
మంత్రాల్లోనే న్యూటన్ నియమాలు!
న్యూఢిల్లీ: డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం తప్పని వాదించిన కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలు(లాస్ ఆఫ్ మోషన్) మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని సత్యపాల్ సింగ్ తెలిపారు. గత జనవరిలో హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 65వ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ) భేటీలో సత్యపాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాబట్టి సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని సత్యపాల్ సూచించారు. అంతేకాకుండా పాఠశాల భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలనీ.. అప్పుడే విద్యార్థులకు చదువు అబ్బుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా న్యూటన్ మంత్రాల విషయమై మీడియా ఆయన్ను బుధవారం ప్రశ్నించగా.. సత్యపాల్ జవాబు దాటవేశారు. అంతేకాకుండా డార్విన్ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. -
నో నామినేషన్
2018లో జరగనున్న 90వ ఆస్కార్స్‌కు గాను ‘ఉత్తమ ఫారిన్ ల్యాంగ్వేజ్ చిత్ర విభాగం’లో భారతదేశం తరçపున ‘న్యూటన్’ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. అమిత్ వి. మసూర్కర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ సినిమాకు తొలి రౌండ్లోనే నిరాశ ఎదురైయింది. ఈ క్యాటగిరీలో తర్వాతి రౌండ్‌కు సెలెక్ట్ అయిన తొమ్మిది చిత్రాల లిస్ట్‌ను ఆస్కార్ అవార్డ్స్ అందించే ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది ‘న్యూటన్’. ఇది వరకు ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ ఈ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నప్పటికీ అవార్డుని సొంతం చేసుకోలేకపోయాయి. ఆస్కార్‌లో అన్ని విభాగాల నామినేషన్ల పూర్తి వివరాలను జనవరి 23న విడుదల చేస్తారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చ్ 4న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగనుంది. ‘‘ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మొత్తం 92 సినిమాలు పోటీకి వచ్చాయి. అక్కడిదాకా మా సినిమా వెళ్లినందుకు మాకు ఆనందంగా ఉంది. నామినేషన్ దక్కలేదనే బాధ లేదు. ఈ అనుభవం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నాకు ఉత్సాహాన్నిచ్చింది’’అన్నారు దర్శకుడు. -
‘న్యూటన్’కు నిరాశ
ఆస్కార్ బరిలో సత్తా చాటలనుకున్న బాలీవుడ్ మూవీ న్యూటన్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లాయి. ఈ సారి న్యూటన్ ఆ ఘనత సాదిస్తుందని భావించినా.. నిరాశే ఎదురైంది. 90వ ఆస్కార్ అవార్డ్స్ లో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో 98 విదేశీ సినిమాలు పోటిలో పడ్డాయి. వీటిలో కేవలం 9 సినిమాలు మాత్రమే ఫైనల్స్ కు చేరాయి. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన న్యూటన్ కు ఫైనల్స్ లో చోటు దక్కలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియపై తెరకెక్కిన న్యూటన్ సినిమాకు అమిత్ మసూర్కర్ దర్శకుడు. ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో ఫైనల్స్ కు చేరిన చిత్రాలు... ఫెలిసైట్ ఆన్ బాడీ అండ్ సోల్ ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ ఇన్ ది ఫేడ్ ది ఇన్ సల్ట్ ఫాక్స్ ట్రాట్ లవ్ లెస్ ది స్క్వేర్ ది వూండ్ -
డ్యూటీకే నా ఓటు న్యూటన్
‘న్యూటన్ ఏం నిరూపించాడో తెలుసా?’ అని అడుగుతాడు ఎలక్షన్ ఇన్స్ట్రక్టర్ ఈ సినిమాలో ‘న్యూటన్’ పేరుతో ఉన్న పాత్రధారి రాజ్‌కుమార్ రావ్‌ను. ‘భూమ్యాకర్షణ శక్తి’ అని జవాబు చెప్తాడు రాజ్ కుమార్ రావ్. ‘కాదు. న్యూటన్ అంత వరకూ ఉన్న అసమానతలన్నీ తుడిచి పెట్టే ఒక గొప్ప సంగతి చెప్పాడు. కొండ మీద నుంచి అంబానీ పడినా అంజిబాబు పడినా ఒకే సమయంలో ఒకే వేగంతో కిందకు పడతారు అని చెప్పాడు. ఇది రూల్. ఈ రూల్‌కు అందరూ సమానం’ అంటాడు ఎలక్షన్ ఇన్స్ట్రక్టర్. దేశంలో చాలా రూల్స్ ఉన్నాయి. రూల్స్‌ను నెరవేర్చాల్సిన ఆఫీసర్లు ఉన్నారు. కాని ఆ రూల్స్ కొందరికే వర్తిస్తాయి. కొందరికి వర్తించవు. అసలు కొన్నిసార్లు రూల్స్ ఉన్నట్టుగా కూడా మనకు గుర్తుండదు. అందువల్లే ఈ దేశం, దేశమనే ఏముంది ప్రపంచం ఇలా ఉంది. దేనినైనా కచ్చితంగా పాటించాలి, అందరికీ పాటించి తీరాలి అని అనుకోగలగాలి. దాని వల్ల ఫలితం ఉంటుందా ఉండదా అనవసరం. కాని కర్తవ్యం నెరవేరిస్తే ప్రతిఫలం ఉండకుండా ఉంటుందా? అలా అని నమ్మినవాడు ఈ సినిమాలోని న్యూటన్. అతడొక ఎలక్షన్ ఆఫీసర్. నక్సలైట్లు ఇవాళొకణ్ణి రేపొకణ్ణి లేపేసే, వాళ్లవైన కారణాలతోనే అనుకోండి, దండకారణ్యంలోని ఒక చిన్న గిరిజన తండాలో ఎలక్షన్‌ను నెరవేర్చే పోలింగ్ ఆఫీసర్ డ్యూటీ అతడికి పడుతుంది. ఆ తండాలో 76 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు సక్రమంగా పోల్ చేయించి తిరిగి వచ్చే బాధ్యత న్యూటన్ది. సాధారణంగా ఈ బాధ్యత ఇంకెవరికైనా అప్పజెప్తే వాళ్లు ఆ పోలింగ్ బూత్‌కు దగ్గరలో ఉన్న ఏదైనా ఊరిలో ఆ రోజుకు బస చేసి, మందు తాగి, కోణ్ణి కోసుకు తిని ‘ఎలక్షన్లకు వెళ్లాం. ఎవరూ ఓటేయడానికి రాలేదు’ అని రాసుకొని తిరిగి వచ్చేస్తారు. కాని న్యూటన్ అలా కాదు. ఎలక్షన్ సెంటర్‌కు తన టీమ్‌ను తీసుకుని అడవిలో నడుచుకుంటూ అంత దూరం వెళతాడు. అక్కడి పాడుబడిన స్కూల్లో బూత్‌ను సెట్ చేస్తాడు. ఓట్లేసే గిరిజనుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. కాని ఇతడి వ్యవహారమంతా ఇతడికి రక్షణగా వచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అధికారికి నచ్చదు. ఇదొక పిచ్చి పని అనుకుంటాడు. కాని అతడికి తెలియకుండానే అతడు కూడా తన డ్యూటీని సక్రమంగా నెరవేర్చే పనిలో ఉంటాడు. పోలింగ్ సిబ్బంది క్షేమంగా తిరిగి వెళ్లేలా చూడటం తన బాధ్యత కనుక ఎలక్షన్‌ను పట్టించుకోకుండా బూత్ నుంచి వాళ్లను త్వరగా ఊరికి పంపడం గురించి అతడు తాపత్రయ పడుతుంటాడు. ‘ఫర్ ఎవ్విరి యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్’ అని న్యూటన్ శాస్త్రజ్ఞుడు చెప్పినట్టుగా ఇతని యాక్షన్‌కు అతడి రియాక్షన్; అతడి యాక్షన్‌కు ఇతడి రియాక్షన్ ఉంటాయి. చివరకు పోలీస్ అధికారి ఒక ఎత్తు ఎత్తుతాడు. తన మనుషుల చేత గాలిలో ఫైర్ చేయించి, నక్సలైట్లు వస్తున్నారని చెప్పి, పోలింగ్ సిబ్బందిని ఖాళీ చేయించి తిరుగు ప్రయాణం పట్టిస్తాడు. కాని పోలింగ్ ఆఫీసరైన న్యూటన్ ఇది తొందరగానే గ్రహిస్తాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం మూడున్నర అయి ఉంటుంది. పోలింగ్ సమయం ఇంకా ఒకటిన్నర గంట ఉంటుంది. అందుకని పోలీసుల మీద తుపాకీ ఎక్కుపెట్టి మరీ మిగిలిన సమయంలో ఓటింగ్ జరిగేలా చూస్తాడు. అది అతడి బాధ్యత. రూల్‌ను నెరవేర్చే బాధ్యత. ఆ రూల్ ముందు అందరూ సమానం. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఈ దేశంలో డెమొక్రసీ ఎంత బోలుతనంతో ఉందో, ఎన్నికల విధానం ఎంత ప్రహసనంగా మారిందో, ప్రజలకు ఎన్నికలకు మధ్య ఎంత ఎడం ఉందో, ఒకవేళ ఎన్నికల వల్ల పదవులలోకి ఎవరైనా వచ్చినా వాళ్ల వల్ల ప్రజలకు ఎటువంటి మేలు ఎలా జరగకుండా పోతుందో, అదనంగా కీడు ఎలా జరుగుతోందో దర్శకుడు చూపిస్తాడు. ఇవన్నీ కూడా న్యూటన్ పాత్రధారికి తెలుసు. అయినా సరే తన కర్తవ్యం తాను నెరవేర్చాలి. ఇంత ప్రహసనంలో కూడా తన డ్యూటీని తాను గౌరవించాలి. కాని ఈ కథ ఇందుకు తీయలేదు. న్యూటన్ మూడో నియమం ‘ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అని చెప్పడానికే తీశారు. నువ్వు సరిగ్గా పాలన చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా డ్యూటీ చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా వ్యాపారం చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా పాఠాలు చెప్తే, వైద్యం చేస్తే, సంఘంలో మంచికి ప్రయత్నిస్తే అంతకు సమానమైన ప్రతిఫలం ఉంటుంది. ఎదుటివారి మీద వంకలు పెడుతూ, నిస్పృహ పొందుతూ, ఈ సిస్టమ్ ఇంతే అనుకుంటూ సిస్టమ్‌ను ఇలాగే ఉండనిస్తూ పోతే ఏమీ జరగదు. మన పని మనం కచ్చితంగా ఎప్పుడైతే చేస్తూ పోతామో అలా ప్రతి ఒక్కరూ చేస్తూ పోతారో అప్పుడే దేశం ముందుకు పోతుంది అని చెప్పడానికి తీశారు. పేపర్ తెరిస్తే ఎందరో అవినీతి అధికారులను, బాధ్యత లేని పాలకులను, చెడ్డ పోలీసులను, క్రూరమైన డాక్టర్లను చూస్తున్నాం. వాళ్లు సరిగ్గా పనిచేస్తే సరిౖయెన ప్రతిఫలం వచ్చి ఉండేది కదా. అదే ఈ సినిమా. దర్శకుడు అమిత్ వి.మసుర్కర్కి ఇది తొలి చిత్రం. కాని చాలా దేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందే స్థాయిలో సినిమా తీశాడు. దీనిని ‘ఆస్కార్’కు అఫీషియల్ ఎంట్రీగా కేంద్రం ఎంపిక చేసింది. నటుడు రాజ్‌కుమార్ రావ్ ఈ పాత్రను సమర్థంగా నిర్వహించడం ఒక సంగతైతే అథెంటిసిటీ కోసం దర్శకుడు ఇది నిజంగా జరుగుతున్న కథ అన్నట్టుగా కచ్చితమైన లొకేషన్లలో సూక్ష్మ వివరాలతో సహా సినిమాను రూపొందించడం మరో విశేషం. విడుదలై రెండు నెలలైనా ఈ సినిమా గురించి ప్రశంస సాగుతూనే ఉంది.మీరు చూడాలనుకుంటే ఆన్లైన్లో వెతకండి. దొరికితే దొరకొచ్చు. -
ఆస్కార్ రేసు... కాపీ కాన్సెప్ట్?
సాక్షి, ముంబై : భారత్ తరపున విదేశీ చిత్ర కేటగిరీలో బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ చిత్రం తాజాగానే ఇండియాలో రిలీజ్ కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంను కాపీ చేశారంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . 2001లో వచ్చిన ఇరానియన్ చిత్రం సీక్రెట్ బాలెట్‌ను మక్కికి మక్కీ దించేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయా రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోల్చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే తెరకెక్కినవే. పైగా ప్రధాన పాత్రలు ఎన్నికల అధికారి పాత్రలు పోషించాయి. వారికి తోడుగా ఓ సైనిక అధికారి ఉండటం అనే కామన్ పాయింట్ కూడా ఉంది. రెండింటిల్లోనూ కష్టాలు ఎదుర్కునే లీడ్ రోల్స్ కష్టాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తాయి. ఇలా దాదాపు అన్నీ సిచ్యువేషన్లు, సీన్లు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ కాపీ కామెంట్లను న్యూటన్ చిత్ర దర్శకుడు అమిత్ మసుకర్ ఖండించారు. సినిమాను సీక్రెట్ బ్యాలెట్ నుంచి తాను కాపీ కొట్టలేదని, పైగా ప్రేరణ కూడా పొందలేదని ఆయన చెబుతున్నారు. ‘‘న్యూటన్ నేను సొంతంగా రాసుకున్న కథ. సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడొకరు సీక్రెట్ బ్యాలెట్ చిత్రం గురించి నాకు చెప్పాడు. యూట్యూబ్‌లో ఆ చిత్రం వీడియోలను చూస్తే ఆశ్చర్యం వేసింది. కాస్త పోలికలు ఉన్నప్పటికీ.. తేడాలను కూడా గమనించాను. అందులో లీడ్ పాత్ర మహిళ పోషించగా.. ఇక్కడ మాత్రం రాజ్ కుమార్ రావు పోషించారు. అక్కడ రొమాన్స్ ట్రాక్ ఉంటే.. ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శలు వినిపిస్తాయని నాకు తెలుసు. కానీ, ఏం చేయగలను? అలా జరిగిపోయింది’’ అని అమిత్ వివరణ ఇచ్చారు. -
భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'
ఈ ఏడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడబోయే భారతీయ చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన న్యూటన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటికి పంపనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 26 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు న్యూటన్ ను ఎంపిక చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు. -
పాడయిపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు
ఒక పరిపుష్ఠమైన మనసులోంచి వచ్చిన ఒక మంచి ఆలోచన ఒక మంచి సంకల్పానికి ప్రేరణ అవుతుంది. అటువంటి సంకల్పం ఒక నవ శకానికి నాంది అవుతుంది. అది ప్రపంచం దిశనే మార్చేస్తుంది. అలా మార్చిన వారు మహాపురుషులు. అందరికీ తెలుసు చెట్టు మీది నుంచి పండు కిందే పడుతుందని. ఒక్క న్యూటన్ మాత్రమే అడిగాడు ‘ఎందుకలానే పడాలి’ అని. భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది. మీరెటువంటి పుస్తకాలు చదువుతారు, మీరెటువంటి స్నేహితులతో కలిసి తిరుగుతారు, మీరు ఏయే విషయాలు చూస్తూ ఉంటారు, మీరెటువంటి విషయాలు వింటూ ఉంటారు, మీరెటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు... ఇటువంటి వాటిని బట్టి మీ మనసులో సంకల్పం తయారవడం ప్రారంభమవుతుంది. ఒక మంచి సంకల్పం కలగడం అంత తేలికైన విషయం కాదు. ఇక సంకల్పం చేసినా దానిని నిలబెట్టడం అంత తేలికైన పనేమీ కాదు. 1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన సిద్థాంతానికి వ్యతిరేకంగా చౌరీ చౌరా అనే ప్రాంతంలో ఉద్యమకారులు పోలీసులను కాల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న గాంధీగారు స్వాతంత్య్రం రావడం ఆలస్యమైనా ఫరవాలేదు కానీ సిద్ధాంతాన్ని వదులుకోనని వెంటనే ఉద్యమాన్ని విరమించారు. ఒక మనిషి సంకల్పం ఎలా చేశాడో దానికి నిలబడగలిగిన ప్రజ్ఞ లోపల ఉండడం కూడా అంతే ముఖ్యం. దానికి ఆటూ పోటూ రెండూ ఉంటాయి. తట్టుకుని నిలబడినప్పుడే లక్ష్యం అనుకున్నట్టుగా సిద్ధిస్తుంది. పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలనే ఉంటుంది. చదువుకోకుండా పాడైపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు. కానీ కొంతమంది పిల్లలకు కొన్ని బలహీనతలుంటాయి. వీరికి సమర్థత లేక కాదు, కానీ ఏ సమయంలో దేనికి ఆకర్షింపబడతామో తెలుసుకుని అటు వెళ్లకుండా వీరు నిగ్రహించుకోలేరు. బలహీనతలను అధిగమించి ఎక్కడ దూసుకుపోవాలో అక్కడ అంత వేగంతోనూ పోవాల్సి ఉంటుంది. ఈ విజ్ఞత పశుపక్ష్యాదుల్లో కూడా చూడొచ్చు. ఏ కష్టం రాకుండా ఉంటేనే నేను నిలబడగలనండీ, అటువంటి కష్టాలొస్తే నేనసలు తట్టుకోలేను - అన్న మాట, అసలు ఆ ఆలోచన ఎందుకొస్తుంది. మన కావ్యాలు, పురాణాలు అన్నీ ఏమని ఘోషిస్తున్నాయి? ధర్మరాజు కంటే కష్టాలు ఎదుర్కొన్నవాళ్లుంటారా? సీతమ్మ పడిన కష్టాలు లోకంలో మరెవరైనా పడ్డారా? వాటిని వారెలా అధిగమించి మనకి ఆదర్శప్రాయు లయ్యారో మరిచిపోతే ఎలా? శీలము అంటే అదే, ఒక కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన వాడే అందరికీ మార్గదర్శకు డవుతాడు. అంతేకాదు, బుద్ధిబలం కూడా దానికి తోడైతే ఎంత పెద్ద సంక్షోభం నుంచైనా సులువుగా బయటపడవచ్చు. వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు - ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ‘‘ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు. అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు. తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు. యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి - ఎంత దారుణం అనుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది. ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది. అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది. స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు. గద్ద 80 సంవత్సరాలు బతుకుతుందని చెబుతారు. 50 సంవత్సరాల తరువాత దానికి ఆహారం తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. ముక్కు కొన పదును కోల్పోయి వంగిపోతుంది. దానితో ఆకాశంలో వెడుతూ కింద నేలమీది కోడిపిల్లను లక్ష్యంగా చేసుకుని దూసుకు వచ్చినా పట్టడంలో పట్టు కోల్పోతుంది. కాలిగోళ్లు కూడా బాగా పెరిగిపోయి వేటను పట్టుకుని పెకైగరలేదు. రెక్కలలో ఈకలు ఎక్కువైపోయి, బరువై పోవడంతో రెక్కలు చురుగ్గా విప్పి వేగంగా ప్రయాణించే శక్తిని కోల్పోతుంది. అప్పుడు గద్ద తనంత తానుగా ఓ 5 నెలలు శిక్ష వేసుకుంటుంది. ఒక పర్వత శిఖరం మీదకు వెళ్లిపోయి పెద్ద శిలనొకదానిని ఎంచుకుని, ముక్కును దానికేసి అదే పనిగా కొట్టుకుంటుంది. ముక్కు అరిగిపోయి మొదట్లోకి వెళ్లిపోతుంది. అ తర్వాత దొరికినంత వరకు బహు కొద్ది ఆహారాన్ని తీసుకుంటూ ప్రాణాన్ని నిలబెట్టుకుంటుంది. పాత ముక్కు స్థానంలో మళ్లీ పదునైన కొత్త ముక్కు వచ్చిన తర్వాత, పెరిగిపోయిన కాళ్లగోళ్లను పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త గోళ్లు వస్తాయి. తర్వాత రెక్కలు విప్పి పెట్టుకుని పెరిగిన ఈకలన్నీ కొత్త గోళ్లతో పీకేసుకుంటుంది. గుండెకు అంటుకున్న రెక్కలు పీకేటప్పుడు రక్తస్రావమైనా బాధకు ఓర్చుకుంటూ వాటిని తొలగించేసుకుంటుంది. దాదాపు 150 రోజులకు గద్ద కొత్త గోళ్లు, కొత్త ముక్కు, కొత్త రెక్కలతో తిరిగి జీవనాన్ని ప్రారంభిస్తుంది. మరో 30 సంవత్సరాలు నిరాఘాటంగా బతుకుతుంది. తర్వాత స్వాభావికంగా శరీరాన్ని విడిచి పెట్టేస్తుంది. ఒకసారి బడలిపోయిన గద్ద ఆహారాన్ని పట్టుకోలేకపోతున్నానని బెంగపెట్టుకొని చచ్చిపోదు. అంత కష్టంలోనూ ఊన్చుకునే లక్షణం ఉండబట్టే గద్ద సరికొత్త జీవితం ప్రారంభించగలుగుతున్నది. -
విరామ స్థితిలో ఉన్న వస్తువు త్వరణం?
సీహెచ్ మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. ఫిజిక్స్ - యాంత్రిక శాస్త్రం వస్తువుల స్థితిగతులను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంత్రిక శాస్త్రం అంటారు. ఈ శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. యాంత్రిక శాస్త్రాన్ని మూడు అంశాలుగా విభజించవచ్చు. 1. రేఖీయ చలనం 2. భ్రమణ చలనం లేదా కోణీయ చలనం 3. సరళ హరాత్మక చలనం రేఖీయ చలనం: ఒక వస్తువు రుజుమార్గంలో ప్రయాణిస్తే దాని చలనాన్ని రేఖీయ చలనం అంటారు. ఉదా: రుజుమార్గంలో ప్రయాణిస్తున్న ఒక బస్సు లేదా రైలు రేఖీయ చలనాన్ని కలిగి ఉంటుంది. ప్రాథమిక అంశాలు దూరం(): ఒక వస్తువు ప్రయాణించిన మార్గాన్ని దూరం అంటారు. ప్రమాణాలు: Cm, m(ఇది అంతర్జాతీయ ప్రమాణం) దూరం అనే భౌతిక రాశికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది. కానీ ప్రత్యేక దిశ ఉండదు. అందువల్ల, దూరాన్ని అదిశరాశి అంటారు. స్థానభ్రంశం: ఒక వస్తువు తొలిస్థానం, తుది స్థానాలను కలిపే సరళరేఖను స్థానభ్రంశం అని అంటారు. ప్రమాణాలు: Cm, m స్థానభ్రంశానికి పరిమాణం, ప్రత్యేక దిశ ఉంటాయి. అందువల్ల దీన్ని సదిశరాశి అంటారు. దూరం, స్థానభ్రంశాల మధ్యగల సంబంధం సందర్భం- I ఎ. ఒక వస్తువు వృత్తాకార మార్గంలో ఒక భ్రమణాన్ని పూర్తిచేసిన తరువాత అది ప్రయాణించిన దూరం వృత్తపరిధికి సమానంగా ఉంటుంది. \u3149?ట్చఛఙ దూరం () = 2ఞట, = 0 ఎందుకంటే, ఈ సందర్భంలో వస్తువు తొలిస్థానం, తుదిస్థానాలు ఒకదానితో మరొకటి ఏకీభవిస్తాయి. బి. ఒకవేళ వస్తువు అర్ధ భ్రమణాన్ని పూర్తి చేసినట్లయితే అది ప్రయాణించిన దూరం () = ఞట అవుతుంది. కానీ, పొందిన స్థానభ్రంశం వృత్త వ్యాసానికి సమానం అవుతుంది. \ = 2r = d సందర్భం- II ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసరితే అది భూమి గురుత్వాకర్షణ దిశకు వ్యతిరేకదిశలో ప్రయాణిస్తూ కొంత ఎత్తును చేరిన తర్వాత దాని వేగం శూన్యం అవుతుంది. కాబట్టి, తిరిగి అదేమార్గంలో ప్రయాణించి తన తొలిస్థానాన్ని చేరుతుంది. అందువల్ల, ఈ సందర్భంలో వస్తువు ప్రయాణించిన దూరం, = AB + BA = 2h కానీ, పొందిన స్థానభ్రంశం = 0 సందర్భం- III ఒక లఘులోలకం ఒక డోలనాన్ని పూర్తిచేసిన తర్వాత అది ప్రయాణించిన దూరం = ACB + BCA. పొందిన స్థానభ్రంశం = 0 సందర్భం- IV ఒక వస్తువు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తే అది ప్రయాణించిన దూరం, పొందిన స్థానభ్రంశానికి సమానంగా ఉంటుంది. సందర్భం- V ఒకవేళ వస్తువు క్రమరహిత మార్గంలో ప్రయాణిస్తే అది ప్రయాణించిన దూరం పొందిన స్థానభ్రంశం కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే వడి (V): గమనంలో ఉన్న ఒక వస్తువు ఇచ్చిన కాలంలో ప్రయాణించిన దూరాన్ని వడి అని అంటారు. వడి(v) = ప్రయాణించిన దూరం (s) ______________ పట్టిన కాలం (t) ఇది అదిశ రాశి {పమాణాలు: వేగం (): గమనంలో ఉన్న ఒక వస్తువు ఇచ్చిన కాలంలో పొందిన స్థానభ్రంశాన్ని వేగం అని అంటారు. వేగం () = పొందిన స్థానభ్రంశం ________________ పట్టిన కాలం (t). ఇది సదిశ రాశి {పమాణాలు: త్వరణం (): గమనంలో ఉన్న ఒక వస్తువు వేగంలోని మార్పురేటును త్వరణం అని అంటారు. త్వరణం () = వేగంలోని మార్పు _____________ కాలంలోని మార్పు ఇది సదిశ రాశి {పమాణాలు: త్వరణాన్ని 2 రకాలుగా వర్గీకరించొచ్చు. దన త్వరణం: గమనంలో ఉన్న వస్తువు వేగంలోని మార్పురేటు పెరిగితే దాన్ని ధన త్వరణం అంటారు. ఉదా: ఒక రైల్వే స్టేషన్ నుంచి వెళుతున్న రైలుకి ధనత్వరణం ఉంటుంది. రుణ త్వరణం: గమనంలో ఉన్న వస్తువు వేగంలోని మార్పురేటు తగ్గితే దాన్ని రుణత్వరణం అంటారు. ఉదా: రైల్వే స్టేషన్‌ను సమీపిస్తున్న రైలు వేగం క్రమంగా తగ్గడం వల్ల అది రుణ త్వరణం కలిగి ఉంటుంది. ఒక వస్తువు విరామస్థితిలో ఉన్నప్పుడు దాని వేగం శూన్యం కాబట్టి, ఆ వస్తువు త్వరణం కూడా శూన్యం అవుతుంది. ఒకవేళ వస్తువు సమవేగంతో ప్రయాణిస్తే (v1 = v2 = v3 = .... = v) దాని త్వరణం శూన్యం అవుతుంది. రేఖీయ ద్రవ్యవేగం (): గమనంలో ఉన్న ఒక వస్తువు ద్రవ్యరాశి, వేగాల లబ్ధాన్ని రేఖీయ ద్రవ్యవేగం అంటారు. ఇది సదిశ రాశి ప్రమాణాలు: బలం(జ): విరామస్థితిలో ఉన్న వస్తువును కదిలించడానికి, కదులుతున్న వస్తువును విరామస్థితికి తీసుకొని రావడానికి ప్రయత్నించే భౌతిక రాశిని బలం అంటారు. f = ma m = వస్తువు ద్రవ్యరాశి a = త్వరణం ] ప్రమాణాలు: డైన్ న్యూటన్ (అంతర్జాతీయ ప్రమాణం) 1N =105 dyne తొలిసారిగా 16వ శతాబ్దంలో న్యూటన్ బలాల గురించి అధ్యయనం చేసి వాటిని అంతర్గత బలాలు, బాహ్యబలాలు అని రెండు రకాలుగా వర్గీకరించాడు. అంతర్గత బలం: ఒక వస్తువు, వ్యవస్థ లోపల ఉన్న బలాలను అంతర్గత బలాలు అంటారు. ఈ బలాల వల్ల వస్తువు స్థితిలో ఎలాంటి మార్పు కలగదని న్యూటన్ ప్రతిపాదించాడు. బస్సు లోపల ఉన్న ప్రయాణికులు తమ ఎదుటి సీట్లపైన బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బస్సు స్థితిలో ఎలాంటి మార్పు కలగదు. సహజ రేడియోధార్మికతలో పరమాణ కేంద్రం నుంచి రేడియోధార్మిక కిరణాలు వెలువడడానికి కారణం అంతర్గత బలాలే. అణుబాంబుల విస్ఫోటంలో అంతర్గత బలాలు ఉంటాయి. అంతర్గత బలాలు సమతుల్య బలాలు బాహ్య బలం: ఒక వస్తువు మరో వస్తువుపై ప్రయోగించే బలాన్ని బాహ్యబలం అని అంటారు. ఈ బాహ్య బలం వల్ల వస్తువు స్థితిలో మార్పు రావచ్చు లేదా మార్పు రావడానికి ప్రయత్నించవచ్చు. న్యూటన్ గమన నియమాలు 1. న్యూటన్ మొదటి గమన నియమం: ఒక వస్తువుపై బాహ్యబలాన్ని ప్రయోగించనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో, గమనంలో ఉన్న వస్తువు సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. మొదటి నియమం నుంచి ప్రతి వస్తువుకు స్వభావ సిద్ధంగా ఏర్పడే జడత్వం అనే ధర్మం ఉంటుందని తెలుస్తోంది. జడత్వం: ఒక వస్తువు తనంతట తానుగా తన స్థితిని మార్చుకోలేని అశక్తతను, ధర్మాన్ని జడత్వం అంటారు. జడత్వం వస్తువుల ద్రవ్యరాశిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి పెరిగితే జడత్వం కూడా పెరుగుతుంది. ప్రమాణాలు: gm, kg జడత్వాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. విరామ జడత్వం: విరామ స్థితిలో ఉన్న ఒక వస్తువు తనంతట తానుగా తన స్థితిని మార్చుకోలేని అశక్తతను విరామ జడత్వం అంటారు. ఉదా: విరామ స్థితిలో ఉన్న ఒక బస్సు అకస్మాత్తుగా ముందుకు కదిలితే అందులోని ప్రయాణికులు విరామ జడత్వం వల్ల వెనుకవైపు తూలుతారు. గమన జడత్వం: గమన స్థితిలోని ఒక వస్తువు తనంతట తానుగా తన స్థితిని మార్చుకోలేని అశక్తతను గమన జడత్వం అంటారు. ఉదా: గమనంలో ఉన్న బస్సును అకస్మాత్తుగా బ్రేక్ వేసి ఆపినప్పుడు అందులోని ప్రయాణికులు గమన జడత్వం వల్ల ముందుకు తూలుతారు. దిశాజడత్వం: ఒక వస్తువు తనంతట తానుగా తన దిశను మార్చుకోలేని అశక్తతను దిశా జడత్వం అంటారు. ఉదా: రుజుమార్గంలో ప్రయాణిస్తున్న ఒక బస్సు వంపు మార్గంలో మలుపు తిరుగుతున్నప్పుడు దిశా జడత్వం వల్ల అందులోని ప్రయాణికులు ఆవలివైపునకు తూలుతారు. న్యూటన్ మొదటి నియమం నుంచి జడత్వం అనే ధర్మాన్ని పొందడం వల్ల ఈ మొదటి నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారు. ii. న్యూటన్ రెండో గమన నియమం: న్యూటన్ రెండో గమన నియమం నుంచి ఒక వస్తువుపై ప్రయోగించిన బలానికి సమీకరణం ఊ = ఝ్చను పొందవచ్చు. iii. న్యూటన్ మూడో గమన నియమం: ప్రతి చర్యకు సమాన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. చర్య = - ప్రతిచర్య a = R (or) A + R = 0 చర్య, ప్రతిచర్యలు ఒకదానికొకటి సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ఇవి ఎల్లప్పుడూ జంటగా ఉంటాయి. ఒక బంతిని గోడకు విసిరినప్పుడు ఆ గోడపై కలిగే బలాన్ని చర్య అంటారు. అదే సమయంలో గోడ కూడా అంతే బలాన్ని బంతిపై వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది. దాన్ని ప్రతిచర్య అంటారు. నడవడం, నీటిలో ఈదడం, పడవ ప్రయాణం, పక్షి ఎగరడం మొదలైన వాటిలో న్యూటన్ మూడో గమన నియమం ఇమిడి ఉంటుంది. జెట్ విమానాలు, రాకెట్స్, క్షిపణులు, తుపాకులు మొదలైనవి కూడా న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా పనిచేస్తాయి. రాకెట్ పనిచేయడంలో రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఇమిడి ఉంటుంది. న్యూటన్ మూడు గమన నియమాల్లో మొదటి నియమానికి, మూడో నియమానికి రెండో నియమం ఒక జనకంలా పనిచేస్తుంది. కాబట్టి, ఈ రెండో నియమం అధిక ప్రాధాన్యతను కలిగింది. -
హరివిల్లులో.. ఎనిమిదో రంగు!
ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయి? ఏడు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రయోగశాలలో పట్టకాల సాయంతో చూసి ఉంటాం కూడా. అయితే ఎప్పుడో 400 ఏళ్ల క్రితం న్యూటన్ గుర్తించిన ఈ ఏడు రంగులు వాస్తవానికి ఏడు కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో మరో రంగు కూడా ఉందట. వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాండల్ మన్రో పరిశోధనలో ఈ సంగతి తెలిసింది. నెమ్మదిగా కదిలే కాంతి(స్లో లైట్) ధర్మాలను తెలుసుకునేందుకు చేపట్టిన పరిశోధనల్లో భాగంగా... కొన్ని కాంతి కణాలను బాగా చల్లగా ఉన్న సోడియం అణువుల గుండా మన్రో పంపించారు. దానివల్ల కాంతి కణాల వేగం గంటకు 17 మైళ్ల స్థాయికి తగ్గిపోయింది. తర్వాత ఆ కణాలను కార్బన్ నానోట్యూబుల గుండా పంపించి పరిశీలించారు. దీంతో నానోట్యూబుల నుంచి బయటకొచ్చిన కాంతి కణాల్లో ఎనిమిదో రంగు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే పచ్చ, నీలం రంగులు కలగలిసినట్లు ఉండే ఈ కొత్త రంగుకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ కొత్త రంగు భవిష్యత్తులో వస్తువులను మాయం చేయగల ఇన్విజిబుల్ క్లోక్స్ తయారీకి బాగా ఉపయోగపడుతుందని మన్రో అంటున్నారు. -
దేవుణ్ణి నమ్మని గ్రహం
నమో నాస్తికా! ఐజక్ న్యూటన్ తెలుసు కదా! ఇంగ్లండ్ సైంటిస్ట్. భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త. ఇన్ని తెలిసిన ఈ మనిషి ఏనాడూ ‘దేవుడెవరో నాకు తెలీదు’ అనలేదు! ఓ రోజు న్యూటన్ దగ్గరికి నాస్తికుడైన ఓ సైంటిస్టు వచ్చాడు. అతడు రావడానికి కాస్త ముందు న్యూటన్ తన ‘ఓర్రెరీ’ పూర్తి చేసి అక్కడున్న బల్ల మీద పెట్టాడు. (ఓర్రెరీ అంటే యంత్ర పరికరాలతో తయారుచేసిన సౌర వ్యవస్థ నమూనా). దాన్ని చూసిన మన నాస్తికుడు చేత్తో దాని హ్యాండిల్ పట్టుకుని తిప్పాడు. వెంటనే గ్రహాలు తిరగడం మొదలు పెట్టాయి. వాటిని ఎంతో అబ్బురంగా చూశాడు నాస్తికుడు. ‘‘దీన్ని ఎవరు చేశారు’’ అని అడిగాడు. ‘‘ఎవరూ చేయలేదు’’ అన్నాడు న్యూటన్. నాస్తికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నేను అడుగుతున్నది... ఇదిగో, దీన్ని ఎవరు చేశారూ అని’’ అన్నాడు ఓర్రెరీని చూపిస్తూ. ‘‘చెప్పాను కదా, ఎవరూ చేయలేదని’’ అన్నాడు న్యూటన్. నాస్తికుడికి విసుగొచ్చింది. ‘‘ఇంత అద్భుతమైన యంత్రం ఎవరూ చేయకుండా ఎలా తయారౌతుంది?’’ అని అడిగాడు. ‘‘ఎవరూ చేయలేదని చెప్పాను కదా’’ అని తనూ విసుక్కున్నట్లుగా అన్నాడు న్యూటన్. నాస్తికుడు యంత్రం హ్యాండిల్ తిప్పడం ఆపి, ‘‘న్యూటన్... సరిగ్గా విను. ఎవరో ఒకరు చేయకుండా దీనికై ఇదే ఇక్కడికి ఎలా వచ్చిందంటావ్’’ అన్నాడు. న్యూటన్ తను చేస్తున్న పని ఆపి, నాస్తికుడి వైపు చూశాడు. ‘‘చిత్రంగా మాట్లాడుతున్నావు! ఈ చిన్న యంత్రాన్ని ఎవరూ తయారు చేయలేదంటే నువ్వు నమ్మడం లేదు. పైన ఆకాశంలో ఇదే సౌరవ్యవస్థ, అందులోని గ్రహాలు మాత్రం ఎవరూ చేసినవి కాదంటావు. ఏమిటి నీ వాదన’’ అన్నాడు న్యూటన్. (తర్వాత తెలిసిందేమిటంటే ఈ సంఘటన తర్వాత నాస్తికుడు ఆస్తికుడిగా మారాడని). -
2060లోపు ఈ సృష్టి అంతరిస్తుంది!?
న్యూటన్ నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ. బతకడం కష్టం అనుకున్నారు వైద్యులు. బాల్యంలో న్యూటన్ ఎప్పుడూ పరధ్యానంగా కనిపించేవాడు. అయినప్పటికీ కొత్త కొత్త వస్తువులు తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. చదువులో వెనకబడి ఉండేవాడు. తరచుగా ఉపాధ్యాయులతో తిట్లుతినేవాడు. తరగతి గదిలో ఒకసారి న్యూటన్ను ఒక అబ్బాయి అకారణంగా కొట్టాడు. అప్పుడు న్యూటన్ శపథం చేశాడు. ఒకటి: తనను కొట్టిన వాడిని తిరిగి కొట్టాలని. రెండు: చదువులో ముందుండాలని....అనుకున్నది సాధించాడు. న్యూటన్ను స్కూలు మానిపించి వ్యవసాయం చేయించాలని అనుకుంది తల్లి. కొన్నిరోజులు తల్లికి వ్యవసాయంలో సహాయం చేశాడు. 2060లోపు ఈ సృష్టి అంతరిస్తుందని అంచనా వేశాడు. న్యూటన్ రాసిన శాస్త్రీయ వ్యాసాల కంటే మతపరమైన వ్యాసాలే ఎక్కువ. రసవిద్య మీద న్యూటన్‌కు ప్రత్యేక ఆసక్తి ఉండేది. దాని మీద చాలా పుస్తకాలే రాశాడు.పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో న్యూటన్ ఒకే ఒక మాట మాట్లాడారని చెబుతారు. ఆ మాట: ‘ఆ కిటికీ తలుపు వేయండి’ -
న్యూటన్ గర్వభంగం
కొత్త సిద్ధాంతం నెత్తిన ఆపిల్ పడ్డప్పటి నుంచి న్యూటన్‌కి కళ్లు నెత్తికెక్కాయి. ఎందుకంటే... ఆపిల్‌ను తినకుండా నెత్తిమీద పడేసుకున్నందువల్లనే గ్రహాలన్నీ అంతరిక్షంలో ఎలా నిలబడ్డాయి, అవి ఎందుకు కూర్చోవడం లేదు... లాంటి ఎన్నో సందేహాలను తీర్చాడు. పైగా ఆ గ్రహాలన్నీ అంతరిక్షంలో పక్షుల్లా తమ చుట్టూ తామో, ఇంకెవరి చుట్టూనో ఎక్కడెక్కడ షికార్లు కొడుతున్నాయి... లాంటి ఫిజిక్స్ లెక్కలు వేసి, ఫిజిక్స్ పండితులకు కొత్త పాఠాలు, సూత్రాలు చెప్పేశాడు. ఇవన్నీ కనిపెట్టడానికి కారణం... ఆపిల్ నెత్తిమీద పడి, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లు తెలియడమే కదా! అందుకే అది కనుగొన్న నాటి నుంచీ న్యూటన్ కాస్త రణపెంకిగా తయారై, గర్వంగా తిరగడం మొదలుపెట్టాడు. సెల్ఫ్ డప్పోపాఖ్యానం: ఓరోజు గొప్పలకు పోయి వాళ్లావిడతో, ‘‘నీ మొగుడు ఎంత గొప్పవాడో చూశావా? భూమికి ఆకర్షణశక్తి ఉందని ఎంత చక్కగా నిరూపించాడో!’’ అన్నాడు న్యూటన్. ‘‘ఎందుకంత మిడిసిపాటు? నెత్తిన ఆపిల్ పడితే తినేయాలిగానీ, తర్కిస్తారా ఎవరైనా?’’ అంది!!! ‘‘నోరు మాత్రమే ఉన్నవారు తినేస్తారు. నాలా బుర్ర ఉన్నవారు కనిపెడతారు’’ అన్నాడు న్యూటన్. ‘‘సర్లెండి... మీరు కనిపెట్టాకే అదేదో వచ్చి చేరినట్టు పెద్ద గొప్ప. అసలు మీ చేతగానితనం కాకపోతే... నలుగురిలో మనమూ గొప్పగా ఉండాలనే భావన మీకుంటే ఈ భూమ్యాకర్షణను మీరు ఎప్పుడో కనిపెట్టేవారు. అప్పు డు ఇలా మీ నెత్తి బొప్పి కట్టే ఖర్మ కూడా తప్పేది’’ అంది వెటకారంగా. సొంత జ్ఞానోదయోపాఖ్యానం: ఆ రాత్రి న్యూటన్ కళ్లు ఆపిల్ స్థానం నుంచి దిగి, నేల చూపులు చూడటం మొదలుపెట్టాయి. కారణం... ఆ కళ్లను భూమి ఆకర్షించడం కాదు. ‘‘మధ్యాహ్నం భోజనాల సమయంలో ఎందుకు వెటకారంగా నవ్వావు?’’ అడిగాడు న్యూటన్. ‘‘ఏదో నెత్తిన ఆపిల్ పడ్డందుకు భూమ్యాకర్షణను కనుగొన్నారు కదా! అదే... ఓ ఐదు తులాల బంగారం కొని ఒక చైన్, దానికో లాకెట్, చెవులకు జుంకీలూ చేయించి, నాకు అలంకరించారను కోండి. ఆ లాకెట్టూ, ఆ జుంకీలూ కిందికే ఎందుకు వేలాడుతున్నాయని ఆలోచిస్తే... ఎప్పుడో పదేళ్ల కిందటే కనుగొనేవారు ఈ సిద్ధాంతాన్ని’’ అంది. కళ్లు నేలలో కూరుకుపోవడంతో పాటు కాస్త బైర్లు గమ్మినట్టూ అనిపించింది. ‘‘బరువు పెరుగుతున్నకొద్దీ బంగారు గొలుసు భూమ్యాకర్షణకు అనులోమంగా, దాని ధరలు విలోమంగా పనిచేస్తాయి’’ అంటూ గొణుగుతూ ఏదో కొత్త సిద్ధాంతం చెప్పబోయాడు. కానీ ఆమె కేవలం బాగా బుర్ర ఉన్న మేధావులకు మాత్రమేగాక... అందరికీ అర్థమయ్యే భాషలో ప్రపంచంలోని భర్తలందరికీ మరో సిద్ధాంతమూ చెప్పింది. అది ‘న్యూటన్స్ వైఫ్స్ లా’ అని గణుతికెక్కింది. అదే... ‘‘ పెళ్లాలను ప్రేమగా చూసుకునే ప్రయోజకులు గోల్డ్ చైన్ల సాయంతో గోల్డెన్ సిద్ధాంతాలు కనుగొని, ఆ బంగారం మెరుపును భార్య కళ్లలో చూస్తారు. న్యూటన్లాంటి చేతకాని వాళ్లు మాత్రం బోలెడంత ప్రేమ నటిస్తూ ఆపిల్ చేతికిచ్చి, ఆ ఎరుపును భార్య కళ్లలో చూస్తారు’’ అని. - యాసీన్ -
జీవితమంటే నిన్న, రేపు కాదు... నేడే!
ముందెంతో జీవితముందన్న భరోసాతో రోజులు వెళ్లబుచ్చడం ఎండమావిలో నీళ్లు వెదకడమే! మనకున్న జీవితమల్లా ఈరోజు ఒక్కటేనన్నది కఠోర వాస్తవం. దీన్ని ఎంత ఫలభరితంగా, దేవునికి ఆమోదయోగ్యంగా జీవిస్తామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. జీవితంలో భయాలు, చింతలు అందరికీ ఎప్పుడూ ఉండేవే! వాటికి కృంగకుండా, వాటికన్నా ప్రాముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయని గ్రహించి ముందుకు సాగాలి. మహా సముద్రాల అంతు చూడాలనుకుంటే ముందు మన దృష్టి తీరం మీదినుండి వైదొలగాలి కదా! భౌతికశాస్త్ర పితామహుడు సర్ ఐజక్ న్యూటన్ గదిలో వేలాది పుస్తకాలు, ఆయన రాసిన పరిశోధన వ్యాసాలు కాగితాలు గుట్టలుగా పడి ఉండేవట. అక్కడే కొవ్వొత్తి, పెంపుడు కుక్కపిల్లా ఉండేవి. ఒకరోజు కుక్కపిల్ల కాలు తగిలి వెలిగే కొవ్వొత్తి కాగితాల మీద పడి అవి నిప్పంటుకున్నాయి. ఎన్నో ఏళ్ల ఆయన పరిశోధనంతా నిమిషాల్లో బూడిదయింది. బాగా కృంగిపోయిన న్యూటన్ చాలా కాలం తర్వాత తన పరిశోధనంతా కొత్తగా ఆరంభించాడు. అలా కొత్తగా ఆలోచించడమే తనకు ఖ్యాతినిచ్చిన గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొనడానికి తోడ్పడిందని ఆయన ఒకచోట రాసుకున్నాడు. జీవితం వృథా అయిపోయిందని వాపోయేవాళ్లకు మోషే జీవితం ప్రేరణనిస్తుంది. మోషే 120 ఏళ్లు బతికాడు. మొదటి 40 ఏళ్లూ ఫరో రాకుమారుడిగా గమ్యం లేకుండా బతికాడు. పిదన తాను నిజానికి హెబ్రీయుణ్ణని తెలుసుకుని, ఇశ్రాయేలీయులపైన పెత్తనం చేయబోయి భంగపడి ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి అక్కడ 40 ఏళ్ల మర దలు కాస్తూ బతికాడు. ఆయన ఇక అంతటితో చనిపోవాలి. ఎందుకంటే నరుని ఆయువు మహా అయితే 80 ఏళ్లని ఆయన తను రాసిన ఒక కీర్తనలో పేర్కొన్నాడు (90:10). కాని దేవుడు అతని అంచనాలు తారుమారు చేస్తూ 80 ఏళ్ల వయసులో మండే పొద ద్వారా మాట్లాడి సేవకు పిలచుకున్నాడు. అలా మోషే ఐగుప్తునకు వెళ్లి ఇశ్రాయేలీయులను దాస్యం నుండి విడిపించి మరో 40 ఏళ్లపాటు వారిని అరణ్యంలో నడిపించి వాగ్దాన దేశమైన కనానుకు చేర్చాడు (నిర్గమ 3:1-22). అలా 80 ఏళ్ల నిష్పల జీవితం తర్వాత ఉత్తేజ భరితమైన, అర్థవంతమైన 40 ఏళ్లను దేవుడాయనకిచ్చాడు. చేజారిన అవకాశాలను తలంచుతూ నిర్వీర్యంగా బతకడం కాదు, ఆ పాఠాలే పునాదిగా ఫలభరితమైన జీవితాన్ని విశ్వాసి పునర్నిర్మించుకోవాలి. ముందెంతో జీవితముందన్న భరోసాతో రోజులు వెళ్లబుచ్చడం ఎండమావిలో నీళ్లు వెదకడమే! మనకున్న జీవితమల్లా ఈరోజు ఒక్కటేనన్నది కఠోర వాస్తవం. దీన్ని ఎంత ఫలభరితంగా, దేవునికి ఆమోదయోగ్యంగా జీవిస్తామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. జీవితంలో భయాలు, చింతలు అందరికీ ఎప్పుడూ ఉండేవే! వాటికి కృంగకుండా, వాటికన్నా ప్రాముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయని గ్రహించి ముందుకు సాగాలి. మహా సముద్రాల అంతు చూడాలనుకుంటే ముందు మన దృష్టి తీరం మీదినుండి వైదొలగాలి కదా! మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చిన కానుక. వాటితో మనం ఆయనకోసం చేయబోయే కార్యాలు, సాధించబోయే విజయాలు మనం దేవునికివ్వబోయే కానుక. చీకటిగదిలో మనకు కావాల్సిన వాటికోసం తడుములాడటం దేనికి? బల్బు వెలిగించే స్విచ్ కోసం ముందు వెదికి లైట్ వేస్తే అదెంత సులువు? అందుకే ‘మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడవన్నీ మీకు దొరుకుతాయి’ అని యేసు ప్రభువు సులువైన సూత్రం చెప్పాడు (మత్త 6:33). కష్టాల చీకట్లు కమ్మినప్పుడు జీవితంలో పరిష్కారాలు, జవాబులకోసం కాక ముందుగా దేవుని సాన్నిధ్యాన్ని వెతకాలి. మనమెల్లప్పుడూ ధైర్యంగా, నిబ్బరంగా ఉండాలని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని విడనాడనని దేవుడు వాగ్దానం చేశాడు( ద్వితీ 31:8). దేవుని సాన్నిధ్యాన్ని, రాజ్యాన్ని కాక లోక సంబంధమైనవి ఏవేవో పొందడానికి మనం వ్యయం చేసే రోజులన్నీ వృథా కిందే లెక్క. అలా డబ్బు, బంగారం, ఆస్తులు మాత్రమే సంపాదించుకున్న వాడు కటిక పేదవాడు. దేవుని సాన్నిధ్యాన్ని పుష్కలంగా కలిగి బోలెడు మంది ఆప్తులను, స్నేహితులను సంపాదించుకున్నవాడు అవేమీ లేకున్నా మహా ధనవంతుడు. దేవుడుంటే ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే. దేవుడు లేకుంటే అన్నీ ఉన్నా జీవితంలో ఏమీ లేనట్టే! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ హితవాక్యం: ఆకాశంలో విహరించేందుకు ఆశపడేవాడు భూమి మీద పాకడానికి ఇష్టపడడు. - హెలెన్ కెల్లెర్