‘న్యూటన్ ఏం నిరూపించాడో తెలుసా?’ అని అడుగుతాడు ఎలక్షన్ ఇన్‌స్ట్రక్టర్ ఈ సినిమాలో ‘న్యూటన్’ పేరుతో ఉన్న పాత్రధారి రాజ్‌కుమార్ రావ్‌ను. ‘భూమ్యాకర్షణ శక్తి’ అని జవాబు చెప్తాడు రాజ్ కుమార్ రావ్.
‘కాదు. న్యూటన్ అంత వరకూ ఉన్న అసమానతలన్నీ తుడిచి పెట్టే ఒక గొప్ప సంగతి చెప్పాడు. కొండ మీద నుంచి అంబానీ పడినా అంజిబాబు పడినా ఒకే సమయంలో ఒకే వేగంతో కిందకు పడతారు అని చెప్పాడు. ఇది రూల్. ఈ రూల్‌కు అందరూ సమానం’ అంటాడు ఎలక్షన్ ఇన్‌స్ట్రక్టర్.
దేశంలో చాలా రూల్స్ ఉన్నాయి. రూల్స్‌ను నెరవేర్చాల్సిన ఆఫీసర్లు ఉన్నారు. కాని ఆ రూల్స్ కొందరికే వర్తిస్తాయి. కొందరికి వర్తించవు. అసలు కొన్నిసార్లు రూల్స్ ఉన్నట్టుగా కూడా మనకు గుర్తుండదు. అందువల్లే ఈ దేశం, దేశమనే ఏముంది ప్రపంచం ఇలా ఉంది. దేనినైనా కచ్చితంగా పాటించాలి, అందరికీ పాటించి తీరాలి అని అనుకోగలగాలి. దాని వల్ల ఫలితం ఉంటుందా ఉండదా అనవసరం. కాని కర్తవ్యం నెరవేరిస్తే ప్రతిఫలం ఉండకుండా ఉంటుందా?
అలా అని నమ్మినవాడు ఈ సినిమాలోని న్యూటన్. అతడొక ఎలక్షన్ ఆఫీసర్. నక్సలైట్లు ఇవాళొకణ్ణి రేపొకణ్ణి లేపేసే, వాళ్లవైన కారణాలతోనే
అనుకోండి, దండకారణ్యంలోని ఒక చిన్న గిరిజన తండాలో ఎలక్షన్‌ను నెరవేర్చే పోలింగ్ ఆఫీసర్ డ్యూటీ అతడికి పడుతుంది. ఆ తండాలో 76 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు సక్రమంగా పోల్ చేయించి తిరిగి వచ్చే బాధ్యత న్యూటన్‌ది.
సాధారణంగా ఈ బాధ్యత ఇంకెవరికైనా అప్పజెప్తే వాళ్లు ఆ పోలింగ్ బూత్‌కు దగ్గరలో ఉన్న ఏదైనా ఊరిలో ఆ రోజుకు బస చేసి, మందు తాగి, కోణ్ణి కోసుకు తిని ‘ఎలక్షన్లకు వెళ్లాం. ఎవరూ ఓటేయడానికి రాలేదు’ అని రాసుకొని తిరిగి వచ్చేస్తారు. కాని న్యూటన్ అలా కాదు. ఎలక్షన్ సెంటర్‌కు తన టీమ్‌ను తీసుకుని అడవిలో నడుచుకుంటూ అంత దూరం వెళతాడు. అక్కడి పాడుబడిన స్కూల్‌లో బూత్‌ను సెట్ చేస్తాడు. ఓట్లేసే గిరిజనుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. కాని ఇతడి వ్యవహారమంతా ఇతడికి రక్షణగా వచ్చిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ అధికారికి నచ్చదు. ఇదొక పిచ్చి పని అనుకుంటాడు. కాని అతడికి తెలియకుండానే అతడు కూడా తన డ్యూటీని సక్రమంగా నెరవేర్చే పనిలో ఉంటాడు. పోలింగ్ సిబ్బంది క్షేమంగా తిరిగి వెళ్లేలా చూడటం తన బాధ్యత కనుక ఎలక్షన్‌ను పట్టించుకోకుండా బూత్ నుంచి వాళ్లను త్వరగా ఊరికి పంపడం గురించి అతడు తాపత్రయ పడుతుంటాడు. ‘ఫర్ ఎవ్విరి యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్’ అని న్యూటన్ శాస్త్రజ్ఞుడు చెప్పినట్టుగా ఇతని యాక్షన్‌కు అతడి రియాక్షన్; అతడి యాక్షన్‌కు ఇతడి రియాక్షన్ ఉంటాయి.
చివరకు పోలీస్ అధికారి ఒక ఎత్తు ఎత్తుతాడు. తన మనుషుల చేత గాలిలో ఫైర్ చేయించి, నక్సలైట్లు వస్తున్నారని చెప్పి, పోలింగ్ సిబ్బందిని ఖాళీ చేయించి తిరుగు ప్రయాణం పట్టిస్తాడు. కాని పోలింగ్ ఆఫీసరైన న్యూటన్ ఇది తొందరగానే గ్రహిస్తాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం మూడున్నర అయి ఉంటుంది. పోలింగ్ సమయం ఇంకా ఒకటిన్నర గంట ఉంటుంది. అందుకని పోలీసుల మీద తుపాకీ ఎక్కుపెట్టి మరీ మిగిలిన సమయంలో ఓటింగ్ జరిగేలా చూస్తాడు.
అది అతడి బాధ్యత. రూల్‌ను నెరవేర్చే బాధ్యత. ఆ రూల్ ముందు అందరూ సమానం. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఈ దేశంలో డెమొక్రసీ ఎంత బోలుతనంతో ఉందో, ఎన్నికల విధానం ఎంత ప్రహసనంగా మారిందో, ప్రజలకు ఎన్నికలకు మధ్య ఎంత ఎడం ఉందో, ఒకవేళ ఎన్నికల వల్ల పదవులలోకి ఎవరైనా వచ్చినా వాళ్ల వల్ల ప్రజలకు ఎటువంటి మేలు ఎలా జరగకుండా పోతుందో, అదనంగా కీడు ఎలా జరుగుతోందో దర్శకుడు చూపిస్తాడు. ఇవన్నీ కూడా న్యూటన్ పాత్రధారికి తెలుసు. అయినా సరే తన కర్తవ్యం తాను నెరవేర్చాలి. ఇంత ప్రహసనంలో కూడా తన డ్యూటీని తాను గౌరవించాలి.
కాని ఈ కథ ఇందుకు తీయలేదు. న్యూటన్ మూడో నియమం ‘ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అని చెప్పడానికే తీశారు. నువ్వు సరిగ్గా పాలన చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా డ్యూటీ చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా వ్యాపారం చెయ్. సమానమైన ప్రతి చర్య ఉంటుంది. నువ్వు సరిగ్గా పాఠాలు చెప్తే, వైద్యం చేస్తే, సంఘంలో మంచికి ప్రయత్నిస్తే అంతకు సమానమైన ప్రతిఫలం ఉంటుంది. ఎదుటివారి మీద వంకలు పెడుతూ, నిస్పృహ పొందుతూ, ఈ సిస్టమ్ ఇంతే అనుకుంటూ సిస్టమ్‌ను ఇలాగే ఉండనిస్తూ పోతే ఏమీ జరగదు. మన పని మనం కచ్చితంగా ఎప్పుడైతే చేస్తూ పోతామో అలా ప్రతి ఒక్కరూ చేస్తూ పోతారో అప్పుడే దేశం ముందుకు పోతుంది అని చెప్పడానికి తీశారు. పేపర్ తెరిస్తే ఎందరో అవినీతి అధికారులను, బాధ్యత లేని పాలకులను, చెడ్డ పోలీసులను, క్రూరమైన డాక్టర్లను చూస్తున్నాం. వాళ్లు సరిగ్గా పనిచేస్తే సరిౖయెన ప్రతిఫలం వచ్చి ఉండేది కదా. అదే ఈ సినిమా.
దర్శకుడు అమిత్ వి.మసుర్‌కర్‌కి ఇది తొలి చిత్రం. కాని చాలా దేశాల్లో విమర్శకుల ప్రశంసలు పొందే స్థాయిలో సినిమా తీశాడు. దీనిని ‘ఆస్కార్’కు అఫీషియల్ ఎంట్రీగా కేంద్రం ఎంపిక చేసింది. నటుడు రాజ్‌కుమార్ రావ్ ఈ పాత్రను సమర్థంగా నిర్వహించడం ఒక సంగతైతే అథెంటిసిటీ కోసం దర్శకుడు ఇది నిజంగా జరుగుతున్న కథ అన్నట్టుగా కచ్చితమైన లొకేషన్లలో సూక్ష్మ వివరాలతో సహా సినిమాను రూపొందించడం మరో విశేషం. విడుదలై రెండు నెలలైనా ఈ సినిమా గురించి ప్రశంస సాగుతూనే ఉంది.మీరు చూడాలనుకుంటే ఆన్‌లైన్‌లో వెతకండి. దొరికితే దొరకొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment