న్యూటన్ గర్వభంగం | sattirer on newton formula | Sakshi
Sakshi News home page

న్యూటన్ గర్వభంగం

Published Mon, Jan 20 2014 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

న్యూటన్ గర్వభంగం - Sakshi

న్యూటన్ గర్వభంగం

 కొత్త సిద్ధాంతం
నెత్తిన ఆపిల్ పడ్డప్పటి నుంచి న్యూటన్‌కి కళ్లు నెత్తికెక్కాయి. ఎందుకంటే... ఆపిల్‌ను తినకుండా నెత్తిమీద పడేసుకున్నందువల్లనే గ్రహాలన్నీ అంతరిక్షంలో ఎలా నిలబడ్డాయి, అవి ఎందుకు కూర్చోవడం లేదు... లాంటి ఎన్నో సందేహాలను తీర్చాడు. పైగా ఆ గ్రహాలన్నీ అంతరిక్షంలో పక్షుల్లా తమ చుట్టూ తామో, ఇంకెవరి చుట్టూనో ఎక్కడెక్కడ షికార్లు కొడుతున్నాయి... లాంటి ఫిజిక్స్ లెక్కలు వేసి, ఫిజిక్స్ పండితులకు కొత్త పాఠాలు, సూత్రాలు చెప్పేశాడు. ఇవన్నీ కనిపెట్టడానికి కారణం... ఆపిల్ నెత్తిమీద పడి, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లు తెలియడమే కదా! అందుకే అది కనుగొన్న నాటి నుంచీ న్యూటన్ కాస్త రణపెంకిగా తయారై, గర్వంగా తిరగడం మొదలుపెట్టాడు.
 
 సెల్ఫ్ డప్పోపాఖ్యానం: ఓరోజు గొప్పలకు పోయి వాళ్లావిడతో, ‘‘నీ మొగుడు ఎంత గొప్పవాడో చూశావా? భూమికి ఆకర్షణశక్తి ఉందని ఎంత చక్కగా నిరూపించాడో!’’ అన్నాడు న్యూటన్.  ‘‘ఎందుకంత మిడిసిపాటు? నెత్తిన ఆపిల్ పడితే తినేయాలిగానీ, తర్కిస్తారా ఎవరైనా?’’ అంది!!!
 ‘‘నోరు మాత్రమే ఉన్నవారు తినేస్తారు. నాలా బుర్ర ఉన్నవారు కనిపెడతారు’’ అన్నాడు న్యూటన్. ‘‘సర్లెండి... మీరు కనిపెట్టాకే అదేదో వచ్చి చేరినట్టు పెద్ద గొప్ప. అసలు మీ చేతగానితనం కాకపోతే... నలుగురిలో మనమూ గొప్పగా ఉండాలనే భావన మీకుంటే ఈ భూమ్యాకర్షణను మీరు ఎప్పుడో కనిపెట్టేవారు. అప్పు డు ఇలా మీ నెత్తి బొప్పి కట్టే ఖర్మ కూడా తప్పేది’’ అంది వెటకారంగా.
 
 సొంత జ్ఞానోదయోపాఖ్యానం: ఆ రాత్రి న్యూటన్ కళ్లు ఆపిల్ స్థానం నుంచి దిగి, నేల చూపులు చూడటం మొదలుపెట్టాయి. కారణం... ఆ కళ్లను భూమి ఆకర్షించడం కాదు. ‘‘మధ్యాహ్నం భోజనాల సమయంలో ఎందుకు వెటకారంగా నవ్వావు?’’ అడిగాడు న్యూటన్. ‘‘ఏదో నెత్తిన ఆపిల్ పడ్డందుకు భూమ్యాకర్షణను కనుగొన్నారు కదా! అదే... ఓ ఐదు తులాల బంగారం కొని ఒక చైన్, దానికో లాకెట్, చెవులకు జుంకీలూ చేయించి, నాకు అలంకరించారను కోండి. ఆ లాకెట్టూ, ఆ జుంకీలూ కిందికే ఎందుకు వేలాడుతున్నాయని ఆలోచిస్తే... ఎప్పుడో పదేళ్ల కిందటే కనుగొనేవారు ఈ  సిద్ధాంతాన్ని’’ అంది.  కళ్లు నేలలో కూరుకుపోవడంతో పాటు కాస్త బైర్లు గమ్మినట్టూ అనిపించింది.
 
 ‘‘బరువు పెరుగుతున్నకొద్దీ బంగారు గొలుసు భూమ్యాకర్షణకు అనులోమంగా, దాని ధరలు విలోమంగా పనిచేస్తాయి’’ అంటూ గొణుగుతూ ఏదో కొత్త సిద్ధాంతం చెప్పబోయాడు. కానీ ఆమె కేవలం బాగా బుర్ర ఉన్న మేధావులకు మాత్రమేగాక... అందరికీ అర్థమయ్యే భాషలో ప్రపంచంలోని భర్తలందరికీ మరో సిద్ధాంతమూ చెప్పింది. అది ‘న్యూటన్స్ వైఫ్స్ లా’ అని గణుతికెక్కింది. అదే... ‘‘ పెళ్లాలను ప్రేమగా చూసుకునే ప్రయోజకులు గోల్డ్ చైన్ల సాయంతో గోల్డెన్ సిద్ధాంతాలు కనుగొని, ఆ బంగారం మెరుపును భార్య కళ్లలో చూస్తారు. న్యూటన్‌లాంటి చేతకాని వాళ్లు మాత్రం బోలెడంత ప్రేమ నటిస్తూ ఆపిల్ చేతికిచ్చి, ఆ ఎరుపును భార్య కళ్లలో చూస్తారు’’ అని.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement