దేవుణ్ణి నమ్మని గ్రహం
నమో నాస్తికా!
ఐజక్ న్యూటన్ తెలుసు కదా! ఇంగ్లండ్ సైంటిస్ట్. భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త. ఇన్ని తెలిసిన ఈ మనిషి ఏనాడూ ‘దేవుడెవరో నాకు తెలీదు’ అనలేదు! ఓ రోజు న్యూటన్ దగ్గరికి నాస్తికుడైన ఓ సైంటిస్టు వచ్చాడు. అతడు రావడానికి కాస్త ముందు న్యూటన్ తన ‘ఓర్రెరీ’ పూర్తి చేసి అక్కడున్న బల్ల మీద పెట్టాడు. (ఓర్రెరీ అంటే యంత్ర పరికరాలతో తయారుచేసిన సౌర వ్యవస్థ నమూనా). దాన్ని చూసిన మన నాస్తికుడు చేత్తో దాని హ్యాండిల్ పట్టుకుని తిప్పాడు. వెంటనే గ్రహాలు తిరగడం మొదలు పెట్టాయి. వాటిని ఎంతో అబ్బురంగా చూశాడు నాస్తికుడు. ‘‘దీన్ని ఎవరు చేశారు’’ అని అడిగాడు.
‘‘ఎవరూ చేయలేదు’’ అన్నాడు న్యూటన్.
నాస్తికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నేను అడుగుతున్నది... ఇదిగో, దీన్ని ఎవరు చేశారూ అని’’ అన్నాడు ఓర్రెరీని చూపిస్తూ.
‘‘చెప్పాను కదా, ఎవరూ చేయలేదని’’ అన్నాడు న్యూటన్.
నాస్తికుడికి విసుగొచ్చింది. ‘‘ఇంత అద్భుతమైన యంత్రం ఎవరూ చేయకుండా ఎలా తయారౌతుంది?’’ అని అడిగాడు.
‘‘ఎవరూ చేయలేదని చెప్పాను కదా’’ అని తనూ విసుక్కున్నట్లుగా అన్నాడు న్యూటన్.
నాస్తికుడు యంత్రం హ్యాండిల్ తిప్పడం ఆపి, ‘‘న్యూటన్... సరిగ్గా విను. ఎవరో ఒకరు చేయకుండా దీనికై ఇదే ఇక్కడికి ఎలా వచ్చిందంటావ్’’ అన్నాడు.
న్యూటన్ తను చేస్తున్న పని ఆపి, నాస్తికుడి వైపు చూశాడు. ‘‘చిత్రంగా మాట్లాడుతున్నావు! ఈ చిన్న యంత్రాన్ని ఎవరూ తయారు చేయలేదంటే నువ్వు నమ్మడం లేదు. పైన ఆకాశంలో ఇదే సౌరవ్యవస్థ, అందులోని గ్రహాలు మాత్రం ఎవరూ చేసినవి కాదంటావు. ఏమిటి నీ వాదన’’ అన్నాడు న్యూటన్.
(తర్వాత తెలిసిందేమిటంటే ఈ సంఘటన తర్వాత నాస్తికుడు ఆస్తికుడిగా మారాడని).