పాడయిపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు | special story about brahmasree chaganti koteswar rao | Sakshi
Sakshi News home page

పాడయిపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు

Published Sun, Jul 24 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

పాడయిపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు

పాడయిపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు

ఒక పరిపుష్ఠమైన మనసులోంచి వచ్చిన ఒక మంచి ఆలోచన ఒక మంచి సంకల్పానికి ప్రేరణ అవుతుంది. అటువంటి సంకల్పం ఒక నవ శకానికి నాంది అవుతుంది. అది ప్రపంచం దిశనే మార్చేస్తుంది. అలా మార్చిన వారు మహాపురుషులు. అందరికీ తెలుసు చెట్టు మీది నుంచి పండు కిందే పడుతుందని. ఒక్క న్యూటన్ మాత్రమే అడిగాడు ‘ఎందుకలానే పడాలి’ అని. భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది.

మీరెటువంటి పుస్తకాలు చదువుతారు, మీరెటువంటి స్నేహితులతో కలిసి తిరుగుతారు, మీరు ఏయే విషయాలు చూస్తూ ఉంటారు, మీరెటువంటి విషయాలు వింటూ ఉంటారు, మీరెటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు... ఇటువంటి వాటిని బట్టి మీ మనసులో సంకల్పం తయారవడం ప్రారంభమవుతుంది. ఒక మంచి సంకల్పం కలగడం అంత తేలికైన విషయం కాదు. ఇక సంకల్పం చేసినా దానిని నిలబెట్టడం అంత తేలికైన పనేమీ కాదు.

 1920 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన సిద్థాంతానికి వ్యతిరేకంగా చౌరీ చౌరా అనే ప్రాంతంలో ఉద్యమకారులు పోలీసులను కాల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న గాంధీగారు స్వాతంత్య్రం రావడం ఆలస్యమైనా ఫరవాలేదు కానీ సిద్ధాంతాన్ని వదులుకోనని వెంటనే ఉద్యమాన్ని విరమించారు. ఒక మనిషి సంకల్పం ఎలా చేశాడో దానికి నిలబడగలిగిన ప్రజ్ఞ లోపల ఉండడం కూడా అంతే ముఖ్యం. దానికి ఆటూ పోటూ రెండూ ఉంటాయి. తట్టుకుని నిలబడినప్పుడే లక్ష్యం అనుకున్నట్టుగా సిద్ధిస్తుంది.

 పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలనే ఉంటుంది. చదువుకోకుండా పాడైపోవాలని ఏ పిల్లవాడూ కోరుకోడు. కానీ కొంతమంది పిల్లలకు కొన్ని బలహీనతలుంటాయి. వీరికి సమర్థత లేక కాదు, కానీ ఏ సమయంలో దేనికి ఆకర్షింపబడతామో తెలుసుకుని అటు వెళ్లకుండా వీరు నిగ్రహించుకోలేరు. బలహీనతలను అధిగమించి ఎక్కడ దూసుకుపోవాలో అక్కడ అంత వేగంతోనూ పోవాల్సి ఉంటుంది. ఈ విజ్ఞత పశుపక్ష్యాదుల్లో కూడా చూడొచ్చు.

 ఏ కష్టం రాకుండా ఉంటేనే నేను నిలబడగలనండీ, అటువంటి కష్టాలొస్తే నేనసలు తట్టుకోలేను - అన్న మాట, అసలు ఆ ఆలోచన ఎందుకొస్తుంది. మన కావ్యాలు, పురాణాలు అన్నీ ఏమని ఘోషిస్తున్నాయి? ధర్మరాజు కంటే కష్టాలు ఎదుర్కొన్నవాళ్లుంటారా? సీతమ్మ పడిన కష్టాలు లోకంలో మరెవరైనా పడ్డారా? వాటిని వారెలా అధిగమించి మనకి ఆదర్శప్రాయు లయ్యారో మరిచిపోతే ఎలా? శీలము అంటే అదే, ఒక కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన వాడే అందరికీ మార్గదర్శకు డవుతాడు. అంతేకాదు, బుద్ధిబలం కూడా దానికి తోడైతే ఎంత పెద్ద సంక్షోభం నుంచైనా సులువుగా బయటపడవచ్చు.

 వివేకానందుడు ఒక కథ చెబుతుండేవాడు - ఒక రైతు దగ్గర ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు దారి సరిగా కనబడక పాడుబడ్డ నూతిలో పడిపోయింది. రైతు ఆ గాడిదను పైకి తీసే ప్రయత్నం చేశాడు. కుదరలేదు.  ‘‘ఇది ముసలిదైపోయింది. ఎక్కువ కాలం ఉపయోగపడదు. దీన్ని కష్టపడి పైకి తీసే కన్నా, నేను మరో బలమైన గాడిదను తెచ్చుకోవడం మేలు. అది కూడా దీనిలాగా ఈ బావిలో పడిపోతే మళ్లీ మరో గాడిద కొనుక్కోవాలి. ముసలి గాడిద ఎటూ పడిపోయింది కనుక, దీనిని మట్టితో కప్పేస్తే అప్పుడు బావి కూడా పూడిపోతుంది కనుక కొత్త గాడిద పడే సమస్య ఉండదు’’ అనుకుని చుట్టుపక్కల రైతులను పిలిచాడు. తలా ఒక తట్ట మట్టి తెచ్చి పోస్తున్నారు.

 యజమాని వైఖరికి లోపలున్న గాడిద ఖిన్నురాలైపోయి - ఎంత దారుణం అనుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. ఇక నేను నా గురించి ఆలోచిస్తాను. తప్పుకునే మార్గాన్ని చూసుకుంటాను అనుకుంది. ఒకసారి సంకల్పం చేసుకున్నాక ధైర్యం వచ్చి లోపల గోడకు బాగా దగ్గరకు వెళ్లి నిలబడింది. పైనుంచి మట్టి పోస్తున్నారు. తనమీద పడిన దాన్ని దులుపుకుంటున్నది. పక్కన పడ్డ మట్టి ఒక దిబ్బగా మారగానే దాని మీదకు చేరుతున్నది. అలా లోపల మట్టి లెవల్ పెరిగే కొద్దీ అది కూడా పైకి జరుగుతూ బావి పైఅంచు దగ్గరకు రాగానే ఒక్కసారి శక్తి కూడదీసుకుని బావి బయటకు దూకి పారిపోయింది. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కోలేకపోయి ఉంటే, ఆ గాడిద కూడా ఒక అవశేషంగా మిగిలిపోయి ఉండేది. స్వామి వివేకానంద యువకులకు ఈ కథ చెబుతూ ‘‘భీరువులై (పిరికివారై) బతక్కండి, ధైర్యంగా నిలబడి కష్టాన్ని ఎదుర్కోండి’’ అని చెప్పేవారు.

గద్ద 80 సంవత్సరాలు బతుకుతుందని చెబుతారు. 50 సంవత్సరాల తరువాత దానికి ఆహారం తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. ముక్కు కొన పదును కోల్పోయి వంగిపోతుంది. దానితో ఆకాశంలో వెడుతూ కింద నేలమీది కోడిపిల్లను లక్ష్యంగా చేసుకుని దూసుకు వచ్చినా పట్టడంలో పట్టు కోల్పోతుంది. కాలిగోళ్లు కూడా బాగా పెరిగిపోయి వేటను పట్టుకుని పెకైగరలేదు. రెక్కలలో ఈకలు ఎక్కువైపోయి, బరువై పోవడంతో రెక్కలు చురుగ్గా విప్పి వేగంగా ప్రయాణించే శక్తిని కోల్పోతుంది. అప్పుడు గద్ద తనంత తానుగా ఓ 5 నెలలు శిక్ష వేసుకుంటుంది. ఒక పర్వత శిఖరం మీదకు వెళ్లిపోయి పెద్ద శిలనొకదానిని ఎంచుకుని, ముక్కును దానికేసి అదే పనిగా కొట్టుకుంటుంది. ముక్కు అరిగిపోయి మొదట్లోకి వెళ్లిపోతుంది.

అ తర్వాత దొరికినంత వరకు బహు కొద్ది ఆహారాన్ని తీసుకుంటూ ప్రాణాన్ని నిలబెట్టుకుంటుంది. పాత ముక్కు స్థానంలో మళ్లీ పదునైన కొత్త ముక్కు వచ్చిన తర్వాత, పెరిగిపోయిన కాళ్లగోళ్లను పీకేసుకుంటుంది. కొంతకాలానికి కొత్త గోళ్లు వస్తాయి. తర్వాత రెక్కలు విప్పి పెట్టుకుని పెరిగిన ఈకలన్నీ కొత్త గోళ్లతో పీకేసుకుంటుంది. గుండెకు అంటుకున్న రెక్కలు పీకేటప్పుడు రక్తస్రావమైనా బాధకు ఓర్చుకుంటూ వాటిని తొలగించేసుకుంటుంది. దాదాపు 150 రోజులకు గద్ద కొత్త గోళ్లు, కొత్త ముక్కు, కొత్త రెక్కలతో తిరిగి జీవనాన్ని ప్రారంభిస్తుంది. మరో 30 సంవత్సరాలు నిరాఘాటంగా బతుకుతుంది. తర్వాత స్వాభావికంగా శరీరాన్ని విడిచి పెట్టేస్తుంది. ఒకసారి బడలిపోయిన గద్ద ఆహారాన్ని పట్టుకోలేకపోతున్నానని బెంగపెట్టుకొని చచ్చిపోదు. అంత కష్టంలోనూ ఊన్చుకునే లక్షణం ఉండబట్టే గద్ద సరికొత్త జీవితం ప్రారంభించగలుగుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement