హరివిల్లులో.. ఎనిమిదో రంగు!
ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయి? ఏడు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రయోగశాలలో పట్టకాల సాయంతో చూసి ఉంటాం కూడా. అయితే ఎప్పుడో 400 ఏళ్ల క్రితం న్యూటన్ గుర్తించిన ఈ ఏడు రంగులు వాస్తవానికి ఏడు కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో మరో రంగు కూడా ఉందట. వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాండల్ మన్రో పరిశోధనలో ఈ సంగతి తెలిసింది. నెమ్మదిగా కదిలే కాంతి(స్లో లైట్) ధర్మాలను తెలుసుకునేందుకు చేపట్టిన పరిశోధనల్లో భాగంగా... కొన్ని కాంతి కణాలను బాగా చల్లగా ఉన్న సోడియం అణువుల గుండా మన్రో పంపించారు.
దానివల్ల కాంతి కణాల వేగం గంటకు 17 మైళ్ల స్థాయికి తగ్గిపోయింది. తర్వాత ఆ కణాలను కార్బన్ నానోట్యూబుల గుండా పంపించి పరిశీలించారు. దీంతో నానోట్యూబుల నుంచి బయటకొచ్చిన కాంతి కణాల్లో ఎనిమిదో రంగు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే పచ్చ, నీలం రంగులు కలగలిసినట్లు ఉండే ఈ కొత్త రంగుకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ కొత్త రంగు భవిష్యత్తులో వస్తువులను మాయం చేయగల ఇన్‌విజిబుల్ క్లోక్స్ తయారీకి బాగా ఉపయోగపడుతుందని మన్రో అంటున్నారు.