కాపీకి కాపీ
ఆ సీన్ - ఈ సీన్
హాలీవుడ్ లేదా విదేశీ సినిమాల నుంచి కథ, కథనం, సీన్లను కాపీ చేయడం ఒక పద్ధతి. అందులో కూడా ఒరిజినల్ రచయితకు క్రెడిట్ ఇస్తే అది అభినందించ దగ్గ పద్ధతే అవుతుంది. అయితే సినీ సృజనకారులు కాపీ కొట్టడంలో ఎంతో సృజనను చూపిస్తూ ఉంటారు. ఈ విషయంలో కొందరు మరింత లోతులకు వెళ్లి నవలల నుంచి కూడా కథాంశాలను పట్టుకొచ్చారు. కానీ పాపం వారు స్ఫూర్తి పొందింది ప్రముఖ నవలలు, క్లాసిక్స్ అనిపించుకొన్న రచనల నుంచి కాబట్టి, వాటి మూలాలు మనం సులువుగా కనిపెట్టేయవచ్చు. మణిరత్నం సినిమాలకు సొబగులు అద్దే సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. మణి దర్శకత్వం వహించిన ‘బొంబాయి’, ‘గురు’, ‘కడలి’ వంటి సినిమాలు... రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ ప్రతిభకు నిలువుటద్దాలు. అయితే ఓ సమయంలో రాజీవ్‌కు ఉన్నట్టుండి దర్శకత్వం మీద గాలి మళ్లింది.
వెంటనే మెగాఫోన్ పట్టి మెరుపుకలలు, ప్రియురాలు పిలిచింది సినిమాలు తీసేశాడు. కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించక పోయినా... ఈ రెండు సినిమాలూ క్లాస్ ప్రేక్షకుల మెప్పు పొందాయి. ముఖ్యంగా అమ్మాయిల మనసులు దోచాయి! ప్రత్యేకించి ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా. టబు, ఐశ్వర్యారాయ్, అజిత్, మమ్ముట్టి, అబ్బాస్‌లు ముఖ్యపాత్రల్లో వచ్చిన ఈ డబ్బింగ్ సినిమా పదిహేనేళ్ల కిందటిదే అయినా... ఇప్పటికీ ఫ్రెష్‌గా ఆకట్టుకొనే శక్తి ఆ సబ్జెక్టులో ఉంది. అయితే ఆ శక్తి రాజీవ్ మీనన్ వల్ల సమ కూరింది మాత్రం నిస్సందేహంగా కాదు. అసలు ‘ప్రియురాలు పిలిచింది’ కథ ఇప్పటిదే కాదు. రెండువందల ఏళ్ల కిందటిది! మిగతా కథల సంగతేమో కానీ.. అక్కాచెల్లెళ్ల కథలకు మాత్రం ఎప్పుడూ అందం ఉంటుంది. యుక్తవయసుల్లోని అమ్మాయిల కథల్లో ఆకట్టుకొనే రొమాంటి సిజం ఉంటుంది. అది వందల ఏళ్లు గడిచినా వన్నె తగ్గనిది. ఆ విషయాన్ని ఎన్నో పుస్తకాలు, నాటకాలు, సినిమాలు నిరూపించాయి.... ఈ కథతో సహా!
ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురివీ మూడు రకాల మనస్తత్వాలు. పేరున్న కుటుంబం. కానీ ఆర్థిక ఇబ్బందులు. పెద్దమ్మాయికి జాతకంలోని దోషాలతో వివాహం కుదరదు. రెండో అమ్మాయికి రొమాంటిక్ హోప్స్. కవిత్వం.. ప్రకృతి.. ఉరుములు.. మేఘాలు.. అన్నీ కావాలి! ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మాయికి పరిచయం అయ్యే డ్రామా డెరైక్టర్, చిన్నమ్మాయికి పరిచయం అయ్యే భావు కుడు, ఆమెనే ఆరాధించే ఒక ఓల్డ్ బ్యాచి లర్ కల్నల్... ఈ పాత్రల మధ్య దోబూచు లాటే ‘సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ నవల. 1811లో అచ్చయిన జేన్ ఆస్టిన్ అద్భుత రచన ఇది. అప్పట్లోనే దీన్ని నాటకంగా మార్చి బ్రిటన్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.
ఆ తర్వాత ఈ కథ హాలీవుడ్ కళ్లలో పడింది.
నిజానికి తొంభైల్లో హాలీవుడ్ ఇంగ్లిష్ లిటరేచర్ వెంట పడింది. షేక్‌స్పియర్ నాటకాలను, రొమాంటిక్ ఎరాలో వచ్చిన ఇంగ్లిష్ సాహిత్యాన్ని సినిమాలుగా మలిచారు హాలీవుడ్ దర్శకులు. అదే ట్రెండ్‌లో దర్శకుడు ఆంగ్ లీ జేన్ ఆస్టిన్ ‘సెన్‌స అండ్ సెన్సిబిలిటీ’ మీద దృష్టి సారించాడు. దాన్ని అదే పేరుతో చక్కని సినిమాగా మలిచాడు. ఎమ్మా థాంప్సన్, కేట్ విన్‌స్లెట్, అలెన్ రాక్‌మన్ తదితరులు నటించిన ఈ చిత్రం 1995లో విడుదల అయ్యింది. అయితే ఈ కాపీ ఇక్కడితోనే ఆగిపోలేదు. తెలుగుకీ వచ్చింది.
2000 సంవత్సరంలో ’ప్రియురాలు పిలిచింది’ తమిళ, తెలుగు వెర్షన్‌లు విడుదలయ్యాయి. ఈ చిత్ర కథ అచ్చంగా ’సెన్స్ అండ్ సెన్సిబిలిటీ’ కథలానే ఉంటుంది. కాకపోతే పాశ్చాత్య కథను ఒక సనాతన దక్షిణాది కుటుంబంలోని అమ్మాయిల నేపథ్య కథగా మార్చారు రాజీవ్ మీనన్. అయితే మూలాన్ని ఆయన ఆస్టిన్ నవల నుంచి తీసుకున్నారా లేక, హాలీవుడ్‌లో వచ్చిన సినిమా నుంచి తీసుకున్నారా అన్నది ఆయనకే తెలియాలి. నిజానికి ఆస్టిన్ రచించిన ఎన్నో నవలల్లో అక్కాచెల్లెళ్ల కథాంశం ఉంటుంది. వాటి ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మరెన్నో టీవీ సీరియళ్లు కూడా రూపొం దాయి. అలాంటి వాటిలో రాజీవ్ మీనన్ సినిమా ఒకటి!
- బి.జీవన్‌రెడ్డి