Core Industries
-
మౌలికం ఉత్పత్తులు పూర్తిగా డౌన్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా మూడో నెలలో కూడా క్షీణత నమోదు చేసింది. మేలో 23.4 శాతం క్షీణించింది. 2019 మేలో ఎనిమిది రంగాల ఉత్పత్తి 3.8 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎరువుల పరిశ్రమ మినహా మిగతా ఏడు రంగాలన్నీ (బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్) మేలో ప్రతికూల వృద్ధే కనపర్చాయి. 2020–21 ఏప్రిల్–మే మధ్యకాలంలో మౌలిక రంగాల ఉత్పత్తి 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 4.5 శాతం వృద్ధి సాధించింది. ‘ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బొగ్గు, సిమెంటు, ఉక్కు, సహజ వాయువు, రిఫైనరీ, ముడిచమురు తదితర పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది‘ అని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. క్షీణత తగ్గుముఖం పడుతోంది.. మే గణాంకాల బట్టి చూస్తే ఉత్పత్తి క్షీణత గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ‘ ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 55.5 శాతం క్షీణించింది. ఈ ధోరణుల ప్రకారం చూస్తే మేలో ఇది 35–45 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది‘ అని పేర్కొన్నారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 37 శాతం క్షీణించింది. తాజాగా మేలో బొగ్గు (14 శాతం క్షీణత), సహజ వాయువు (16.8 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (21.3 శాతం), ఉక్కు (48.4 శాతం), సిమెంటు (22.2 శాతం), విద్యుదుత్పత్తి (15.6 శాతం) క్షీణించాయి. -
ఇన్ఫ్రా రంగానికి ఆర్బీఐ బూస్ట్
రుణ నిబంధనల్లో మరింత సడలింపు ముంబై: నిలిచిపోయిన మౌలిక రంగ ప్రాజెక్టులకు చేయూతనిచ్చేందుకు.. అదేవిధంగా బ్యాంకులు మొండిబకాయిల సమస్య నుంచి కొంతమేరకు గట్టెక్కేలా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న దీర్ఘకాలిక ప్రాజెక్టు రుణాలు, కీలక(కోర్) పరిశ్రమల రుణాల వ్యవస్థీకరణ(స్ట్రక్చరింగ్) నిబంధనలను సడలిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు 5:25 స్కీమ్‌ను విస్తృతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిప్రకారం... ప్రస్తుత దీర్ఘకాలిక ఇన్ఫ్రా ప్రాజెక్టులు, కోర్ ఇండస్ట్రీస్ విషయంలో రూ.500 కోట్లకుపైగా విలువైన రుణాలకు సంబంధించి బ్యాంకులకు రీఫైనాన్స్, స్ట్రక్చరింగ్‌లో మరింత వెసులుబాటు లభిస్తుందని ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అంటే 5:25 స్కీమ్ ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు బ్యాంకులు సంబంధిత రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు లేదంటే విక్రయిచేందుకు వీలవుతుంది. దీనివల్ల అటు బ్యాంకులతో పాటు ఇన్ఫ్రా కంపెనీలకూ ఇబ్బందులు తప్పుతాయి. కాగా, ఈ సదుపాయాన్ని అమలు చేయాలంటే... రుణ వ్యవధి 25 ఏళ్లకు మించి ఉండకూడదని, అదికూడా టర్మ్ లోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆర్బీఐ నిబంధనల విధించింది. అంతేకాకుండా ప్రాజెక్టు టర్మ్‌లోన్ లేదా రీఫైనాన్స్ చేసిన రుణం గనుక ఏ దశలోనైనా మొండిబకాయి(ఎన్పీఏ)గా మారితే... బ్యాంకులు భవిష్యత్తులో రీఫైనాన్సింగ్‌ను నిలిపేయడంతోపాటు తగినవిధంగా కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ మళ్లీ ఈ రుణం ఎన్పీఏ నుంచి బయటికొస్తే.. రీఫైనాన్సింగ్‌కు అర్హత లభిస్తుందని మార్గదర్శకాల్లో తెలిపింది. ఈ ఏడాది జూలైలో ఆర్బీఐ ఇన్ఫ్రా, కీలక పరిశ్రమల ప్రాజెక్టులకు ఇచ్చే కొత్త రుణాలకు మాత్రమే స్ట్రక్చరింగ్‌లో సడలింపు ఇచ్చింది. అయితే, బ్యాంకులు ఇప్పటికే కొనసాగుతున్న దీర్ఘకాలిక ప్రాజెక్టులకూ దీన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూవచ్చాయి. తాజాగా డీసెంబర్ 2న జరిగిన పాలసీ సమీక్ష సందర్బంగా ఇన్ఫ్రా రంగానికి చేయూతనివ్వడం కోసం 5:25 స్కీమ్‌లో మార్పులు చేస్తూ రెండు కీలక చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. దీనికి అగుణంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.