8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్‌లో వృద్ధి 4.2 శాతం
విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్
న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్‌లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్‌లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.
వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే...
బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది.
ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది.
సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది.
విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది.
క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది.
సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది.
రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది.
ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది.
ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా
కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది.