Corier boy
-
లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్‌నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్ అపార్ట్మెంట్లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్‌మెంట్‌ని 4వ అంతస్థుకు వెళ్లాడు. కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం! -
ఏంటి? మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!
సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్‌ఫోన్ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్– ఏ60ఎస్ సెల్‌ఫోన్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీకు ఆర్డర్ పెట్టాడు. సెల్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్ బాయ్ ఫోన్ వచ్చిందంటూ ఓ బాక్స్ అందజేశాడు. ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్ బాయ్ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్‌కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్ బాయ్ వెంటనే సంబంధిత కొరియర్ కంపెనీకి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్ ప్రకారం సెల్‌ఫోన్ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు. -
ఒకే వ్యక్తి నుంచి 47 పాస్‌పోర్టులు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: 47 పాస్‌పోర్ట్‌లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి(26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్‌పోర్టు యజమాని రషీద్ పురమాయించిన మేరకు అతడు సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. పాతబస్తీకి చెందిన రషీద్ స్నేహితుడు వాహిద్‌ను కలుసుకుని, అతనిచ్చిన బ్యాగ్‌తో తిరిగి బెంగళూరు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. అతడు అక్కడ బస్ కోసం వేచి చూస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అమ్మిరెడ్డి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 47 పాస్‌పోర్టులు బయటపడ్డాయి. అయితే, వాటి విషయం తనకు తెలియదని, రషీద్ చెప్పిన మేరకు బ్యాగ్ తీసుకువెళ్తున్నానని అతడు తెలిపాడు. పోలీసులు అతని నుంచి 47 పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. దీనికి కారకులైన వాహీద్, రషీద్‌లు పరారీలో ఉన్నారు.