47 పాస్‌పోర్ట్‌లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
అఫ్జల్‌గంజ్: 47 పాస్‌పోర్ట్‌లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి(26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్‌పోర్టు యజమాని రషీద్ పురమాయించిన మేరకు అతడు సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు.
పాతబస్తీకి చెందిన రషీద్ స్నేహితుడు వాహిద్‌ను కలుసుకుని, అతనిచ్చిన బ్యాగ్‌తో తిరిగి బెంగళూరు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. అతడు అక్కడ బస్ కోసం వేచి చూస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అమ్మిరెడ్డి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 47 పాస్‌పోర్టులు బయటపడ్డాయి. అయితే, వాటి విషయం తనకు తెలియదని, రషీద్ చెప్పిన మేరకు బ్యాగ్ తీసుకువెళ్తున్నానని అతడు తెలిపాడు. పోలీసులు అతని నుంచి 47 పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. దీనికి కారకులైన వాహీద్, రషీద్‌లు పరారీలో ఉన్నారు.